కరోనా కష్టాల సీజన్లో చాలామంది ఉపాధి కోల్పోయారు. అయితే ఆ తర్వాత మళ్లీ పరిస్థితి మెరుగుపడింది. ఐటీ కంపెనీల్లో కొత్త రిక్రూట్ మెంట్లు మొదలయ్యాయి. వివిధ బహుళజాతి సంస్థలు కూడా కొత్తవారికి అవకాశాలివ్వడంలో పోటీ పడ్డాయి. ఆ తర్వాత అసలు సీన్ మొదలైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఉద్యోగుల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. అయితే ఈసారి ఈ కష్టాల తీవ్రత బాగా పెరిగింది. ఏఐ రాకతో ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతోంది. పలు ప్రైవేట్ కంపెనీలు విడతల వారీగా ఉద్యోగులకు షాకులిస్తున్నాయి. తాజాగా అమెజాన్ కంపెనీ ఈ లిస్ట్ లో చేరింది. ప్రపంచ వ్యాప్తంగా 14వేలమందిని తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఆల్రడీ ఆ పని మొదలు పెట్టింది కూడా.
ఖర్చు తగ్గించుకోడానికేనా..?
అమెజాన్ లో ఉద్యోగుల తొలగింపుకి ప్రధాన కారణం ఖర్చు తగ్గించుకోవడం అని పైకి చెబుతున్నా, అసలు కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల దొరికిన వెసులుబాటు అని తెలుస్తోంది. దాదాపుగా అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతోంది. దానివల్ల మ్యాన్ పవర్ ని అంతా తగ్గించేస్తున్నారు. ఆ బాటలోనే అమెజాన్ అడుగులు వేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ సంస్థ 14వేలమందిని తొలగించేస్తోంది.
అమెజాన్ తాజా లే ఆఫ్ వల్ల ఆ సంస్థలో ఉద్యోగుల సంఖ్య 13 శాతం తగ్గుతుందని అంటున్నారు. అదే సమయంలో నష్ట నివారణ చర్యలు కూడా మొదలైనట్టే లెక్క. అంటే లాభాల స్వీకరణ గరిష్టంగా జరగాలంటే ఈ వేటు తప్పనిసరి. 14వేల మంది ఉద్యోగుల్ని తొలగిస్తే అమెజాన్ సంస్థకు ప్రతి ఏటా 2.1 బిలియన్ డాలర్ల నుంచి 3.6 బిలియన్ డాలర్ల వరకు మిగులు ఉంటుందట. ప్రస్తుతం అమెజాన్ లో 1,05,770 మంది ఉద్యోగులున్నారు. ఈ తొలగింపుతో ఆ సంఖ్య 91,770కి చేరుతుంది. ఇది కూడా విడతల వారీగా జరుగుతుందని తెలుస్తోంది. ఈ తొలగింపుల ద్వారా కంపెనీ కార్యకలాపాలు జాప్యం కావని సీఈఓ ఆండీ జాస్సీ చెబుతున్నారు. అదే సమయంలో తమ కంపెనీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేస్తామని ఆయన అంటున్నారు.
వాస్తవానికి కరోనా సమయంలో అమెజాన్ ఉపయోగం అందరికీ తెలిసొచ్చింది. ఈ కామర్స్ సంస్థలు ఆ టైమ్ లో భారీగా లాభపడ్డాయి. అదే సమయంలో ఉద్యోగ నియామకాలు కూడా భారీగా జరిగాయి. అమెజాన్ సంస్థ.. 2019లో భారీగా నియామకాలు చేపట్టింది. ఓ దశలో ఉద్యోగుల సంఖ్య 1.6 మిలియన్లకు చేరుకుంది. అయితే ఆ తర్వాత కొవిడ్ తీవ్రత తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో అమెజాన్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించింది. 2022, 2023 సంవత్సరాల్లో కూడా అమెజాన్ లో లే ఆఫ్ లు కొనసాగాయి. ఈ ఏడాది కూడా అవి కంటిన్యూ అవుతున్నాయి.వచ్చే ఏడాది కూడా అమెజాన్ లో తొలగింపులు ఉంటాయని అంటున్నారు. అమెజాన్ సంచలన నిర్ణయంతో ఉద్యోగులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఒకేసారి 14వేలమంది అమెజాన్ నుంచి నిష్క్రమించబోతున్నారు.