Microsoft Employees: 2023లో మొదలైంది.. 2024లో కొనసాగింది.. పోనీ 2025లో అయినా పరిస్థితి సెట్ అవుతుంది అనుకుంటే.. సెట్ అవ్వడం పక్కన పెట్టి మరింత దిగజారుతోంది. మనం మాట్లాడుకునేది టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కొత గురించి. ప్రముఖ కంపెనీల్లో హైరింగ్ కొనసాగుతున్నా.. అంతకంటే ఎక్కువ కోతలే ఉంటున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకే లక్ష మంది ఉద్యోగులను తొలగించాయి కంపెనీలు. వినడానికి కాస్త కష్టంగా.. భయంగా అనిపించినా ఇది నిజం.
ఏడాదిలోనే 6 వేల ఉద్యోగుల తొలగింపు..
ఈ ఏడాది మేలో 6 వేల మంది ఉద్యోగులను తొలగించిన మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు ఏకంగా 9 వేల 100 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాదిలో ఒక్క మైక్రోసాఫ్ట్‌లోనే ఉద్యోగాల కోత సంఖ్య 15 వేలు దాటనున్నట్టు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల 28 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. అంటే ఇప్పుడు తొలగింపులు 4 శాతం అన్నమాట. ఎక్స్‌బాక్స్, గేమింగ్, సేల్స్‌లో ఉన్న ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుంది మైక్రోసాఫ్ట్. 2023 నుంచి చూస్తే మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్‌లో ఇదే అత్యధికమని చెప్పవచ్చు.
చిప్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం..
ఇక ఇంటెల్‌లో 20 శాతం ఉద్యోగులకు కోత పడనుంది. ఇంటెల్ జులైలో అంటే ఈనెలలో ఇప్పటికే 107 మందిని తొలగించింది. వీరంతా ఇంటెల్ హెడ్‌క్వార్టర్స్‌లోని ఉద్యోగులే. ఇక జర్మనీలోని చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ను మూసేసింది. దీంతో ఈ ఒక్క నెలలోనే 20 శాతం ఉద్యోగులకు కోత పెట్టినట్టైంది. చిప్ డిజైన్, క్లౌడ్ ఆర్కిటెక్చర్, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల తొలగింపుపై దృష్టిపెట్టింది ఇంటెల్. వీరిలో చిప్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ ఉద్యోగులపైనే ఎక్కువ ప్రభావం పడనుందని తెలుస్తోంది.
అమెజాన్ నాలుగోసారి లేఆఫ్స్:
అమెజాన్ ఈ ఏడాదిలో నాలుగోసారి లేఆఫ్స్ చేపట్టేందుకు రెడీ అయ్యింది. ఈ సారి అమెజాన్ బుక్ బిజినెస్‌పై ఫోకస్ చేసింది. ప్రస్తుతం ఉన్నపళంగా 100 మంది ఉద్యోగులను తొలగించనుంది. చూసేందుకు ఈ నెంబర్ చిన్నగానే కనిపిస్తున్నా.. ఇప్పటికే డివైజ్‌లు, సర్వీస్ గ్రూప్, కమ్యూనికేషన్ యూనిట్స్ ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 14 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు అమెజాన్ సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మేనేజర్ల సంఖ్యను 92 వేలకు తగ్గించాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
ఇక 8 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు IBM సిద్ధమైంది. ముఖ్యంగా HR ఉద్యోగులకు ఫోకస్ చేసింది. ఇప్పటికే 200 మంది HR రోల్స్‌ను AIతో రీప్లేస్ చేసింది IBM. ఇన్ఫోసిస్ కూడా 240 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. అయితే వీరంతా కూడా ఎంట్రీ లెవల్ ఉద్యోగులే అని తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 300 మంది ఫ్రెషర్‌లను తొలగించింది ఇన్ఫోసిన్.
AI రాకతో.. ఉద్యోగులు ఔట్
గూగుల్ కూడా ఉద్యోగాల కోతపై దృష్టి పెట్టింది. ఈ సారి ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్ డివిజన్‌లలో ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. క్లౌడ్, HR యూనిట్స్‌లో కూడా ఈ కొత ఉండనుంది. అంతేకాదు వాలంటరీ ఎగ్జిట్ అనే కాన్సెప్ట్‌ను కూడా తీసుకొచ్చింది గూగుల్. మెటా కూడా 5 శాతం ఉద్యోగులను తొలగించనుంది. మొత్తం 3 వేల 600 మంది ఉద్యోగులను లో పర్ఫామెన్స్ చేస్తున్నారని చెప్పి తొలగించనుంది. వీరిని AIతో రీప్లేస్ చేయనుంది. ఈ కంపెనీలు మాత్రమే కాదు.. ఆటెమెట్టిక్, టిక్‌టాక్, ఒలా , HP, సేల్స్‌ఫోర్స్, బ్లూ ఆరిజిన్, కాన్వా, సైమన్స్, మ్యాచ్ గ్రూప్, క్రౌడ్ స్ట్రైక్ ఇలా అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నాయి.
Also Read: దాని గురించి నేను మాట్లాడను! భర్త పంచాయతీపై సురేఖ రియాక్షన్
కరోనా కారణంగా ప్రారంభమైన ఈ ఉద్యోగుల కోత.. ఆ తర్వాత కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి ఆనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులను AIతో రీప్లేస్ చేయడం ఒక కారణంకాగా.. పెరుగుతున్న ద్రవ్యోల్భణం, కన్జ్యూమర్ డిమాండ్ తగ్గిపోవడం.. వడ్డీ రెట్లు పెరిగిపోవడం.. ఇలా అనేక కారణాల వల్ల కంపెనీలు ఆర్థికంగా కాస్త ఒడిదొడుకులు చూస్తున్నాయి. అదే సమయంలో హైరింగ్ కూడా జరుగుతున్నా.. కోతలు మాత్రం భారీ స్థాయిలో ఉంటున్నాయి. ప్రస్తుతం AI రిలేటెడ్ రోల్స్, ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్‌కు సంబంధించిన డివిజన్స్‌లో చేరికలు పెరుగుతున్నాయి.