Civils: దేశంలో చాలా కష్టతరమైన ఎగ్జామ్ సివిల్స్. చాలా మంది అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలు సాధించడానికి నెలల తరబడి చదువుతుంటారు. సివిల్ సర్వీసెస్ పరీక్షను అధిగమించడం అనేది చాలా మందికి అసాధ్యమైన కలలా కనిపిస్తుంది. మీరు డిప్రెషన్ లేదా ఇతర మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే, ఈ లక్ష్యం సాధించడం మరింత కష్టంగా అనిపించవచ్చు. అయితే, ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. భారతదేశంలోని రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ (ఆర్‌పీడబ్ల్యూడీ) చట్టం- 2016 ప్రకారం, డిప్రెషన్, బైపోలార్ డిసార్డర్, స్కిజోఫ్రెనియా, ఓసీడీ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు వైకల్యాలుగా పరిగణించనున్నారు. మీ మానసిక స్థితి 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యాన్ని కలిగిస్తుందని సర్టిఫైడ్ అయితే, మీరు PwBD (పర్సన్స్ విత్ బెంచ్‌మార్క్ డిసబిలిటీ) కేటగిరీ-4 కింద ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు.
పీడబ్ల్యూబీడీ కేటగిరీ-4 కింద ప్రయోజనాలు
PwBD కేటగిరీ-4 కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అనేక ప్రయోజనాలు వర్తిస్తాయి..
1. రిజర్వేషన్ సీట్లు: సివిల్ సర్వీసెస్‌లో PwBD (దివ్యాంగ) అభ్యర్థుల కోసం 4శాతం సీట్లు రిజర్వ్ చేసి ఉంటాయి. ఇందులో కేటగిరీ-4 కింద ఉన్నవారికి ప్రత్యేక రిజర్వేషన్ కూడా ఉంటుంది.
2. తక్కువ కట్-ఆఫ్ మార్కులు: పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు కట్-ఆఫ్ మార్కులు సాధారణ కేటగిరీ కంటే చాలా తక్కువగా ఉంటాయి. ఎగ్జాంపుల్.. 2022 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో జనరల్ కేటగిరీ కట్-ఆఫ్ 960 ఉండగా, PwBD-4 కేటగిరీ కింద 835 మార్కులుగా ఉంది.
3. పరీక్షలో అదనపు సహాయం: పరీక్ష సమయంలో అదనపు సమయం, వారికి పరీక్ష సమయంలో అవసరమైన ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు.
4. వయస్సు: ఇతర రిజర్వేషన్ కేటగిరీల మాదిరిగానే, PwBD అభ్యర్థులకు వయసు పరిమితిలో సడలింపు ఉంటుంది.
5. ఎగ్జామ్స్ ప్రయత్నాల సంఖ్య: పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పరీక్ష ప్రయత్నాల సంఖ్యలో కూడా సడలింపు ఉంటుంది.
పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ ఎలా పొందాలి?
ఈ సౌకర్యాలను పొందడానికి మీకు చెల్లుబాటు అయ్యే బెంచ్‌మార్క్ డిసబిలిటీ సర్టిఫికేట్ అవసరం:
ప్రభుత్వ ఆసుపత్రిలో డయాగ్నసిస్: ప్రభుత్వ ఆసుపత్రిలో సైకియాట్రిస్ట్ వద్ద మానసిక ఆరోగ్య పరీక్ష చేయించుకోండి.
వైకల్యం అంచనా: IDEAS స్కేల్ వంటి ప్రమాణాలను ఉపయోగించి ఫార్మల్ డిసబిలిటీ అసెస్‌మెంట్ ప్రక్రియలో పాల్గొనండి.
సర్టిఫికేట్ జారీ: మీ వైకల్యం 40% లేదా అంతకంటే ఎక్కువగా డిసబిలిటీ ఉంటే.. పోటీ పరీక్షల కోసం ఉపయోగించగల సర్టిఫికేట్ జారీ చేయనున్నారు.
UPSC దరఖాస్తు ఫారమ్‌లో, PwBD విభాగంలో “అవును” అని ఎంచుకొని, మీ సర్టిఫికేట్‌ను అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది..
మానసిక సమస్యలకు భయపడొద్దు
మానసిక ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని సివిల్స్ ఎగ్జామ్ కు అనర్హులుగా చేయలేవు. అంతే గాకుండా.. అవి మీకు సహాయం అందించే అర్హతను కూడా ఇస్తాయి. మీరు డిప్రెషన్‌తో బాధపడుతూ.. IAS అధికారి కావాలనే కలను కలిగి ఉన్నట్లయితే ఇది తప్పక గుర్తుంచుకోండి. మీకు స్పెషల్ రైట్స్ ఉన్నాయి. మీకు మద్దతు ఇచ్చే వ్యవస్థ ఉంది. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మానసిక సమస్యలు ఉంటే ఇప్పుడే పీడబ్ల్యూడీ సర్టిఫికెట్ ను పొందండి. మీ ప్రిపరేషన్ ను ప్రారంభించండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.