మ్యాథ్స్.. గణితం.. అబ్బో ఈ పేపర్ అంటే మాకు భయం.. అన్ని ఎగ్జామ్స్ లో మెరిట్ స్కోర్ తెచ్చుకుంటాం.. బట్ ఈ పేపర్ లో పాసైతే చాలు.. మిగితా పేపర్లల్లో వందకు 90 పైగానే తెచ్చుకుంటాం.. చాలా మంది స్టూడెంట్స్ మ్యాథ్స్ పేపర్ అనగానే ఇలానే ఆలోచిస్తారు. ఈ ఎగ్జామ్ అనగానే విద్యార్థులకు కాస్త టెన్షణ్.. అన్ని పరీక్షలు బాగానే రాస్తాం.. మ్యాథ్స్ అంటేనే కాస్త తలనొప్పి.. ఇలా ఆలోచించే విద్యార్థులు చాలా మంది ఉంటారు. సాధారణంగా విద్యార్థులకు ఇతర సబ్జెక్టుల కంటే మ్యాథ్స్ అంటేనే ఒక రకమైన భయం ఉంటుంది. అయితే.. తాజాగా జరిగిన సీబీఎస్‌ఈ మ్యాథ్స్ ఎగ్జామ్ విద్యార్థులను ఆ భయానికి గురిచేయడమే కాకుండా ముప్పతిప్పలు పెట్టింది. దేశవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షలో క్వశ్చన్ పేపర్ ఊహించిన దానికంటే అత్యంత క్లిష్టంగా రావడంతో విద్యార్థులు నానా ఇబ్బందులకు గురయ్యారు. నేరుగా అడిగే ప్రశ్నల కంటే.. విద్యార్థుల సహనాన్ని పరీక్షించేలా తిక్కమక పెట్టే ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల నుండి బయటకు వచ్చిన చాలా మంది విద్యార్థులు గందరగోళానికి గురై చాలా మంది స్టూడెంట్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘పేపర్ ఈజీగా వస్తుందని ఆశించాం.. కానీ ప్రశ్నల శైలి చాలా లోతుగా, సమయం సరిపోని విధంగా ఉన్నాయి’ అని విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. ప్రశ్నా పత్రం కాస్త హార్డ్ గా ఉన్న సరే కానీ.. మరీ ఇంత గందరగోళంగా ఉండడంతో స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
⦿ ఎగ్జామ్ రీ- కండక్ట్ చేయాలి…!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇటీవల నిర్వహించిన టెన్త్ మ్యాథ్స్ పేపర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఎగ్జామ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చిన మెజారిటీ స్టూడెంట్స్ ఈసారి పేపర్ చాలా కఠినంగా ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రశ్నలు చాలా లెంగ్తీగా ఉండటంతో పాటు అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరాల్లో వచ్చిన పేపర్ కన్నా ఈసారి అడిగిన ప్రశ్నలు అర్థం కాని రీతిలో ఉన్నాయని అంటున్నారు. అయితే మ్యాథ్స్ పేపర్ ను మళ్లీ నిర్వహించాలని కొంత మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
⦿ పరీక్ష విధానంలో సీబీఎస్ఈ కీలక మార్పులు..
ఈ ఏడాది పరీక్షా విధానంలో సీబీఎస్ఈ బోర్డు కీలక మార్పులు చేపట్టింది. బేసిక్ ప్రశ్నలు అడగకుండా.. విద్యార్థులను కాస్త ఆలోచించేలా క్వశ్ఛన్ పేపర్ ను తయారు చేసింది. ఈ తరహా ప్రశ్నలు స్టూడెంట్స్ విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని టెస్ట్ చేసే విధంగా ఉన్నాయని విద్యా నిపుణులు చెబుతున్నారు. అయితే క్వశ్ఛన్స్ ఊహించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క కాల్యుకేషన్ చేయడానికి సాధారణ సమయం కన్నా పది నిమిషాల సమయం ఎక్కువగా తీసుకునేలా ప్రశ్నలు వచ్చాయని చెబుతున్నారు.
⦿ అసలు సమయం సరిపోలేదు..
దేశ వ్యాప్తంగా పలువురు విద్యార్థులు క్వశ్వన్స్ లెంగ్తీపై ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రశ్నా పత్రం సిలబస్ లో ఉన్న అంశాల నుంచే వచ్చినప్పటికీ వాటిని అడిగిన తీరు మాత్రం చాలా కొత్తగా ఉందని అంటున్నారు. బాగా చదివే విద్యార్థులు సైతం అన్ని ప్రశ్నలను పూర్తి చేయలేకపోయారు. సమయం ఏ మాత్రం సరిపోలేదని వాపోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు విద్యార్థులు వచ్చిన మార్కులకు అదనంగా మార్కులు కలపాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు బోర్డు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నారు.
⦿ బాగా ప్రాక్టీస్ చేసిన వారికి పేపర్ లైట్..
ఈ అంశంపై దేశ వ్యాప్తంగా టీచర్లు కూడా భిన్నాభిప్రయాలను వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరుకు చెందన ఓ మ్యాథ్స్ టీచర్ పేపర్ చాలా క్వాలిటీగా ఉందని అన్నారు. బేసిక్ ప్రశ్నలను అడగకుండా.. విద్యార్థుల్లోని ఆలోచనా శక్తిని వెలికితీయడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని ఆయన సీబీఎస్ఈ బోర్డును సమర్థిస్తూ మాట్లాడారు. చాలా కఠినమైన ప్రశ్నలను సాధన చేసిన విద్యార్థులకు ఈ పేపర్ పెద్ద కష్టమేమీ కాదని పలువురు టీచర్లు అభిప్రాయపడుతున్నారు.
⦿ రాయడానికి వీలుగానే ఉంది.. టాపర్ల వాదన
బేసిక్ ప్రశ్నల నుంచి కొంచెం డెప్త్ ఉన్న ప్రశ్నలను అడుగుతున్నక్రమంలో ఇలాంటి ఇబ్బందులు సహజమని విద్యా నిపుణులు చెబుతున్నారు. అయితే విద్యార్థులకు పేపర్ ఎలా వచ్చిన ఈజీగా రాసేలా టీచర్లు తయారు చేయాలని అంటున్నారు. కొంత మంది విద్యార్థులు మాత్రం పేపర్ హార్డ్ గా ఉన్నప్పటికీ.. రాయడానికి వీలుగానే ఉందని పేర్కొన్నారు.
⦿ సీబీఎస్ఈ బోర్డు స్పందిస్తుందా..?
విద్యార్థుల నుంచి వస్తున్న ఈ ఫీడ్‌బ్యాక్‌పై సీబీఎస్‌ఈ బోర్డు అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఫలితాల వెల్లడించే ముందు బోర్డు సాధారణంగా మోడరేషన్ పాలసీని పరిశీలిస్తుంది. అయితే.. మొత్తంగా ఈ అంశంపై సీబీఎస్ఈ బోర్డు స్పందిస్తుందో చూద్దాం…..
Also Read: తెలంగాణ మోడల్ స్కూల్స్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్.. ఉచిత విద్య, ఉజ్వల భవిష్యత్తు..