IIM Bangalore: దేశంలో ఐఐఎంలు రూటు మార్చాయా? మాస్టర్స్ స్థాయిలో కంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు మాంచి డిమాండ్ ఉన్నట్లు గుర్తించాయా? ఇప్పుడు వాటికి ప్రయార్టీ ఇవ్వడం మొదలు పెడుతున్నాయా? ఈ విషయంలో ఐఐఎం బెంగుళూరు ముందుందా? అవుననే అంటున్నారు విద్యార్థులు. తాజాగా బెంగుళూరు ఐఐఎం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను శ్రీకారం చుట్టింది.
ట్రెండ్‌కు అనుగుణంగా అడుగులు వేయకుంటే వెనకబడిపోతాం. వ్యక్తులే కావచ్చు లేకుంటే ఉన్నతస్థాయి ఎడ్యుకేషన్ సంస్థలైనా ఒకటే విధానం. ర్యాంకింగ్స్‌లో కనిపించకుంటే ఇబ్బందులు తప్పవు. పరిస్థితి గమనించిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూరు, సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లకు శ్రీకారం చుట్టింది.
వచ్చే ఏడాది ఆగస్టు రెండు కోర్సులను ప్రవేశ పెడుతోంది. చెప్పుకోవాలంటే విద్యావ్యవస్థలో ఇదొక మార్పు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నవాటిలో డేటా సైన్స్, ఎకనామిక్స్‌లో రెండు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను ఏర్పాటు చేయనుంది. నాలుగేళ్ల రెసిడెన్షియల్ స్థాయి ప్రోగ్రామ్‌లు. రెండురోజుల కిందట మీడియాతో మాట్లాడిన బెంగుళూరు ఐఐటీ ఆర్గనైజర్లు, ఈ విషయాన్ని బయటపెట్టారు.
ఇన్స్టిట్యూట్ స్కూల్ ఆఫ్ మల్టీ డిసిప్లినరీ స్టడీస్ కింద అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ప్రతి కోర్సుకు 40 మంది విద్యార్థులు చొప్పున ఏడాదికి ఈ రెండు కోర్సుల్లో 80 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. మౌలిక సదుపాయాలు విస్తరిస్తున్నకొద్దీ 2031 నాటికి ఈ సంఖ్యను 640 మందికి పెంచాలని ప్రణాళికలు వేసింది.
ALSO READ: డిగ్రీ, బీటెక్ స్టూడెంట్స్ తీపి కబురు.. ఇంకెందుకు ఆలస్యం
ప్రవేశ ప్రక్రియలో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ఉంటుంది. అందులో సెలక్ట్ అయినవారిని ఇంటర్వ్యూ ఉంటాయి. అందులో సెలక్ట్ అయితే సీటు వస్తుంది. తొలి బ్యాచ్ అడ్మిషన్లు సెప్టెంబర్ 2025లో ప్రారంభమవుతాయి. దరఖాస్తుదారులు ఆగస్టు ఒకటి, 2025 నాటికి 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులకు 22 ఏళ్లు మించకూడదు.
10వ తరగతిలో 60 శాతం స్కోర్ చేసి ఉండాలి. ఇంటర్‌లో ముఖ్యంగా మేథ్స్‌లో కనీసం 60 శాతం మార్కులు రావాలి. వారు మాత్రమే అర్హులు. ఐఐఎం స్థాయికి తగ్గట్టుగానే ఏడాది ఫీజు రూ. 8.5 లక్షలు ఉంటుంది. విద్యార్థికి ఆర్థిక సహాయం అందించబడుతుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో విద్యార్థులను వారి వారి శక్తి సామర్థ్యాలతో సన్నద్ధం చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.
దేశానికి సహకార- డేటా ఆధారిత పద్ధతుల ద్వారా సంక్లిష్ట సమస్యలను పరిష్కరించగల నైపుణ్యం కలిగిన యువకులు అవసరమన్నారు. ఇప్పటికే గయ, ఇండోర్, రోహతక్, జమ్మూకాశ్మీర్ ఐఐఎంలు ఇంటర్ తర్వాత ఐదేళ్ల కోర్సులను అందిస్తున్నాయి. ఇప్పుడు బెంగుళూరు ఐఐఎం రూటు మార్చి డిమాండ్ ఉన్న కోర్సులపై ఫోకస్ చేసింది. వీటి దారిలో మిగతా ఐఐఎంలు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. రీసెంట్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదల ర్యాంకింగ్స్ బెంగుళూరు ఐఐఎం మెరుగైన ర్యాంకు సాధించిన విషయం తెల్సిందే.