భారత ప్రభుత్వ తంతి తపాలా శాఖ భారీ స్థాయిలో చేపట్టిన గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) నియామక ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. దేశవ్యాప్తంగా మొత్తం 28,636 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు ఈ నెల 16వ తేదీతో ముగిసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తమ అప్లికేషన్లలో పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవడానికి పోస్టల్ శాఖ తాజాగా అవకాశం కల్పించింది. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్‌లో కరెక్షన్ విండోను ప్రారంభించింది.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్‌లో గణనీయమైన సంఖ్యలో పోస్టులు ఉన్నాయి. తెలంగాణ సర్కిల్‌లో 608 ఖాళీలు ఉండగా ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 1060 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వేలాది మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. దరఖాస్తు చేసే సమయంలో పేరు తప్పుగా పడటం లేదా మార్కుల నమోదులో పొరపాట్లు దొర్లడం వంటి సమస్యలను అభ్యర్థులు ఎదుర్కొన్నారు. అటువంటి వారు ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ద్వారా వాటిని మార్చుకోవచ్చు.
అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవడానికి రేపు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సమయం ఉంది. గడువు ముగిసిన తర్వాత ఎటువంటి మార్పులకు అవకాశం ఉండదు. తప్పుడు సమాచారంతో దరఖాస్తులు ఉంటే అవి పరిశీలనలో తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ సాయంతో లాగిన్ అయి వివరాలను సరిచూసుకోవాలి.
ముఖ్యంగా అభ్యర్థి పేరు తండ్రి పేరు పుట్టిన తేదీ కమ్యూనిటీ వంటి వివరాలను ఒకసారి చెక్ చేసుకోవడం ఉత్తమం. సర్టిఫికెట్లలో ఉన్న విధంగానే వివరాలు ఉండాలి. వెబ్‌సైట్ https://www.indiapost.gov.in ద్వారా మాత్రమే ఈ సవరణలు చేసుకోవాలని అధికారులు సూచించారు. పదవ తరగతి మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాల ఎంపిక జరుగుతుంది కాబట్టి మార్కుల విషయంలో అభ్యర్థులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) పోస్టులను భర్తీ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించేందుకు ఆసక్తి ఉన్న యువతకు ఇది మంచి అవకాశం. రేపు సాయంత్రం లోపు సవరణ ప్రక్రియ పూర్తి చేయకుంటే పాత డేటానే పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే తమ దరఖాస్తులను సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.