Minister Sitakka: ప్రజలను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని మంత్రి సీతక్క ఫైరయ్యారు. ఇవాళ గాంధీభవన్‌లో మంత్రి సీతక్క సమక్షంలో ఆదిలాబాద్ జిల్లా బోత్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బోత్ ఇంచార్జ్ ఆడే గజేందర్ నేతృత్వంలో స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, నేతలు భారీగా గాంధీ భవన్ కు చేరుకున్నారు.
ఈరోజు గాంధీభవన్లో కార్యకర్తలు భారీగా హస్తం పార్టీలో చేరారు. మంత్రి సీతక్క వారికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. చేరికల కార్యక్రమంలో బీఆర్ఎస్ పై మంత్రి సీతక్క నిప్పులు చెరిగారు. ప్రజలను రెచ్చగొట్టేలా భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. ‘దిగజారుడు రాజకీయాలను బీఆర్ఎస్ మానుకోవాలి. రైతు భరోసా నిధులను రైతు ఖాతాల్లో జమ చేస్తున్నాం. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అబద్ధాలు ఎంతో కాలం నిలవవు. ప్రజలకు వాస్తవాలు తెలుసు.. మేము రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తున్నాం. అధికారం పోగానే బీఆర్ఎస్ నేతలు అక్కస్సు వెళ్లగక్కుతున్నారు. రాష్ట్రంలో సమస్యల అన్నింటికి బీఆర్ఎస్ పార్టీనే కారణం. పదేళ్లు ప్రజలను, అభివృద్ధి పనులు పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో సమస్యలు తిష్ట వేశాయి’ అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.
‘బీఆర్ఎస్ పార్టీనే రాష్ట్రానికి అతిపెద్ద సమస్య. తప్పుడు లెక్కలు చెప్పటంలో బీఆర్ఎస్ దిట్టమైన పార్టీ. 1200 మంది అమరవీరులు చనిపోయారని చెప్పి.. తెలంగాణ వచ్చిన తర్వాత 400 మందికి కుదించారు. అధికారులు శాస్త్రీయంగా ఇంటింటికి వెళ్లి సర్వే చేసి కులాల లెక్కలను తేల్చారు. ప్రజల్లో మంచి పేరు వస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. అణగారిన వర్గాల దశాబ్దాల సమస్యను సీఎం రేవంత్ రెడ్డి పరిష్కారం చూపారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మంత్రులను, కీలక నాయకులను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. అబద్దానికి పుట్టిందే బీఆర్ఎస్. అబద్దానికి బ్రాండ్ అంబాసిడర్ బీఆర్ఎస్. దీన్ని వెంటనే ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతుంటే బీఆర్ఎస్ కుట్రలు పన్నుతోంది. బీఆర్ఎస్ కు కుల గణన చేపట్టటం చేతకాలేదు. ఎస్సీ వర్గీకరణ చేయలేదు. లింకా బుక్ ఆఫ్ రికార్డు కోసం ఒకరోజు సర్వే హడావుడి చేశారు. ఆ సర్వే నివేదికలో నిజం లేదు కాబట్టే అసెంబ్లీలో పెట్టలేదు. దానికి చట్టబద్ధత కల్పించలేదు’ అని చెప్పుకొచ్చారు.
Also Read: Palamuru-Ranga Reddy project: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్రం కీలక నిర్ణయం..
‘ఇంటింటికి వెళ్లి పకడ్బందీగా చేసిన సర్వే పై ఇప్పుడు కూని రాగాలు తీస్తున్నారు. సర్వేలో ఎక్కడా లోపం లేదు.. బీసీ జనాభా 56.33% గా వచ్చింది. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలన నచ్చి ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. సంక్షేమ రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. పార్టీలో చేరిన బోథ్ ప్రజలకు ధన్యవాదాలు. ఇంకా మాకు నాలుగు సంవత్సరాలు సమయం ఉంది. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం. బీఆర్ఎస్ పార్టీకి 10 ఏళ్లు అధికారం అప్పజెప్పినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. పారదర్శకంగా గ్రామ సభలోనే అర్హులని ఎంపిక చేస్తున్నాం’ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.