AP Crime News: అమ్మా.. నన్ను క్షమించు. మిస్ యూ అంటూ స్టేటస్ పెట్టి మరీ ఆ మాజీ వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా, ఈ ఘటన ఆ జిల్లాలో సంచలనంగా మారింది. ఆత్మహత్యకు గల కారణం మాత్రం లవ్ ఫెయిల్యూర్ అంటూ ప్రచారం సాగుతోంది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా రోద్దం మండల కేంద్రంలో జరిగింది.
శ్రీ సత్యసాయి జిల్లా రోద్దం మండల కేంద్రంలో రాచూరు గ్రామానికి చెందిన సోమురెడ్డి గతంలో వాలంటీర్ గా విధులు నిర్వహించాడు. ఆ తర్వాత విధుల నుండి తప్పుకున్నట్లు సమాచారం. అయితే ఆదివారం బొక్సంపల్లి సబ్ స్టేషన్ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.
అనంతరం మృతుడి జేబులో ఉన్న సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఆ సెల్ ఫోన్ లో ఉన్న వివరాలను పోలీసులు గమనించారు. సోమురెడ్డి తన వాట్సప్ స్టేటస్ ద్వార నన్ను క్షమించు అమ్మా అంటూ తన తల్లిని వేడుకున్నాడు. అలాగే మిస్ యూ అంటూ మరి ఎవరిని ఉద్దేశించి స్టేటస్ పెట్టాడు. ఈ మిస్ యూ.. స్టేటస్ ఎవరిని ఉద్దేశించి పెట్టాడో పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. అంతేకాకుండ మరో స్టేటస్ కూడ సోమురెడ్డి మొబైల్ ఫోన్ లో పోలీసులకు కనిపించిందట.
నా ఆత్మహత్యకు సంబంధించి ఎవరినీ నిందించకండి అంటూ కూడ వాట్సప్ స్టేటస్ పెట్టడం విశేషం. పోలీసులు మాత్రం స్టేటస్ లను గమనించి, తల్లికి విషయాన్ని చెప్పగా ఆ తల్లి రోదించిన తీరు అందరినీ కన్నీటి పర్యంతం చేసింది. సోమురెడ్డి ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.
ప్రేమలో ఫెయిల్ అయినందుకే ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రచారం సాగుతుండగా, పోలీసులు ఆ తరహాలో కూడ దర్యాప్తు సాగిస్తున్నారు. మొత్తం మీద మాజీ వాలంటీర్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. అసలు ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది.