Telangana Crime: నిజామాబాద్‌లో CCS కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యాడు. కానిస్టేబుల్ ప్రమోద్‌ను రియాజ్ అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఓ చోరీ కేసులో రియాజ్‌ను ఎంక్వైరీ చేసిన కానిస్టేబుల్.. బైక్‌పై పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తుండగా వెనకనుంచి చాతిలో పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ప్రమోద్ మృతితో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దుండగుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు స్థానికులు.
పూర్తి వివరాలు..
ప్రమోద్ డ్యూటీలో భాగంగా హైదరాబాద్ వెళ్లి, శుక్రవారం సాయంత్రం నిజామాబాద్‌కు తిరిగి వచ్చాడు. సీసీఎస్‌లో రిపోర్టు చేసిన తర్వాత, పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న నాగారం ప్రాంతానికి చెందిన రియాజ్‌ను అరెస్టు చేయడానికి వెళ్లాడు. ప్రమోద్‌తో పాటు అతని అల్లుడు, ఎస్సై విఠల్, మరో కానిస్టేబుల్ ఉన్నారు. వారు రెండు బైక్‌లపై వెళ్లారు. ప్రమోద్, అల్లుడు ఒక బైక్‌పై, రియాజ్‌ను మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. ఎస్సై విఠల్, మరో కానిస్టేబుల్ మరో బైక్‌పై వెనుకాలే వచ్చారు.
నాగారం నుంచి బయలుదేరిన తర్వాత, వినాయక్ నగర్ చేరుకోగానే రియాజ్ ప్రమోద్ మెడను చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. దీంతో బైక్ అదుపు తప్పి కింద పడిపోయింది. అప్పుడు రియాజ్ తన దుస్తుల్లో దాచుకున్న పదునైన కత్తితో ప్రమోద్ ఛాతీలో పొడిచాడు. వెంటనే అక్కడికి వచ్చిన ఎస్సై విఠల్‌ను కూడా దాడి చేసి, ఆయన చేతికి గాయం చేశాడు. ప్రమోద్ అల్లుడు కూడా గాయపడ్డాడు. అనంతరం రియాజ్ అక్కడి నుంచి పారిపోయాడు.
తీవ్ర గాయాలతో కుప్పకూలిన ప్రమోద్‌ను అటుగా వెళ్తున్న మోపాల్ ఎస్సై తన వాహనంలో జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ, మార్గమధ్యంలోనే ప్రమోద్ మరణించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుని, ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. రియాజ్ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు.
రియాజ్ నేర చరిత్ర
రియాజ్ చిన్నప్పటి నుంచే నేరాల్లో మునిగిపోయాడు. సమద్ గ్యాంగ్ సభ్యుడిగా ఉన్నాడు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్, గొడవలు, అల్లర్లలో ప్రధాన నిందితుడు. ఆయనపై వంద వరకు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అతనిని రౌడీ షీటర్‌గా నమోదు చేశారు. అయితే బైక్ చోరీ కేసుల్లో అరెస్టు చేయడానికి వెళ్లినప్పుడు ఈ దాడి జరిగింది.
Also Read: కదం తొక్కిన బీసీలు.. తెలంగాణలో బంద్ స్టార్ట్..
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమోద్ మరణం పోలీసు శాఖలో విషాదాన్ని నింపింది. ఆయన కుటుంబానికి పోలీసు అధికారులు సానుభూతి తెలిపారు. నిందితుడిని త్వరలో పట్టుకుని న్యాయస్థానం ముందు హాజరుపరచాలని స్థానికులు డిమాండ్ చేయడంతో.. పోలీసులు నిందితుడి కదలికలపై నిఘా పెంచారు. రియాజ్‌ను పట్టుకోవడానికి పక్క జిల్లాల్లో కూడా అలర్ట్ జారీ చేశారు. ప్రమోద్ మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం నుంచి సాయం అందించాలని కోరుతున్నారు.