Apples Value Falls: మొబైల్ దిగ్గజ సంస్థ ఆపిల్‌కు మరో షాక్ తగిలింది. కంపెనీ విలువ 2 ట్రిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. ఏడాది కిందట 3 ట్రిలియన్ డాలర్ల క్యాపిటలైజేషన్ మార్క్ అందుకుని, ఆ ఘనత సాధించిన తొలి కంపెనీగా అవతరించిన ఆపిల్ విలువ… 33 శాతం పతనమై ఇప్పుడు 1.98 ట్రిలియన్ డాలర్లకు చేరింది. 2021 మార్చి తర్వాత ఆపిల్ కంపెనీ విలువ 2 ట్రిలియన్ డాలర్లకన్నా తక్కువకు పడిపోవడం ఇదే తొలిసారి.
ఆపిల్ రేటింగును అవుట్ పెర్మార్మ్ నుంచి తటస్థంగా మార్చిన తర్వాత… కంపెనీ షేరు విలువ 4 శాతం క్షీణించి 124.6 డాలర్లకు చేరింది. ఐఫోన్ అతిపెద్ద తయారీదారు అయిన ఫాక్స్‌కాన్ కంపెనీల్లో ఉత్పత్తి తగ్గిపోవడం, సరఫరాలో సమస్యలు తలెత్తడం వల్ల… ఈ ఏడాది ఐఫోన్ల ఉత్పత్తిని 245 మిలియన్ యూనిట్ల నుంచి 224 మిలియన్ యూనిట్లకు తగ్గించడం కూడా… ఆపిల్ షేరు విలువ పతనం కావడానికి కారణం. ప్రస్తుత స్టాక్ ధర ప్రకారం ఆపిల్ విలువ 1.98 ట్రిలియన్ డాలర్లు. మైక్రోసాఫ్ట్ కన్నా ఆపిల్ విలువ ఇప్పుడు కేవలం 0.2 ట్రిలియన్ డాలర్లు మాత్రమే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ విలువ 1.78 ట్రిలియన్ డాలర్లు.
గ్లోబల్ ఎకానమీలో మందగమనం, అధిక ద్రవ్యోల్బణం… ఆపిల్ ఉత్పత్తుల డిమాండ్‌ను దెబ్బతీస్తాయని భావిస్తున్న ఇన్వెస్టర్లు… కంపెనీ నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. అంతేకాదు… మూడో త్రైమాసికతం పోలిస్తే నాలుగో త్రైమాసికంలో ఆపిల్ ఆదాయం ఒక శాతం తగ్గిపోవచ్చనే అంచనా కూడా… ఇన్వెస్టర్లు షేర్లు అమ్ముకోవడానికి మరో కారణం. అయితే 2007 నుంచి ఇప్పటిదాకా ఆపిల్ తన పెట్టుబడిదారులకు లాభాలనే పంచింది. కంపెనీ ఆరంభం నుంచి షేర్లు కలిగి ఉన్నవారికి డివిడెండ్‌లతో సహా 4 వేల శాతం కంటే ఎక్కువ లాభాన్ని అందించింది. అంటే ఒక రూపాయి పెట్టుబడికి రూ.40కి పైగా ఆదాయమన్న మాట.