polyester : ప్రస్తుతం భూగ్రహంపై గాలి కాలుష్యం అనేది మోతాదుకు మించిపోయింది. అతికొద్ది ప్రపంచ దేశాల్లో మాత్రమే గాలి అనేది మనుషులకు హాని కలిగించకుండా స్వచ్ఛంగా ఉంది. గాలి కాలుష్యానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కెమికల్ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు పెరిగిపోవడంతో పాటు మనుషులు కూడా గాలి కాలుష్యానికి కారణమవుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా గాలిలో కార్బన్ శాతం పెరగడం అనేది కాలుష్యానికి మేజర్ కారణంగా మారింది. అందుకే కొరియా శాస్త్రవేత్తలు దీనికి ఒక ఉపాయం కనుక్కున్నారు.
కొరియా అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని కెమికల్, బయోమాలిక్యులర్ ఇంజనీర్లు కలిసి ఒక బ్యాక్టీరియా సాయంతో గాలిలోని కార్బన్ డయాక్సైడ్‌ను పాలిస్టర్‌గా మార్చే ప్రయత్నం చేశారు. ఎన్నో గంటలు కష్టపడి వారు ఈ ప్రయోగం విషయంలో సక్సెస్ సాధించారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు అనేవి శాస్త్రవేత్తలను ఎన్నో రకాలుగా ఆలోచింపజేస్తున్నాయి. అందుకే గాలి కాలుష్యాన్ని, వాతావరణ మార్పులను కంట్రోల్ చేయడానికి శాస్త్రవేత్తలు ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలతో ముందుకొస్తున్నారు.
క్యూప్రియావైడస్ నెక్టార్ అనే బ్యాక్టీరియా రకాన్ని ఉపయోగించి గాలి నుండి కార్బన్ డయాక్సైడ్‌ను వేరు చేసి ఒక రకమైన పాలిస్టర్‌ను తయారు చేయగలిగారు కొరియాకు చెందిన శాస్త్రవేత్తలు. వారు ముందుగా చేసిన పరిశోధనల్లో సీ నెక్టార్ బ్యాక్టీరియా ద్వారా బయోడీగ్రేడెబుల్ ప్లాస్టిక్స్ తయారు చేయవచ్చని తెలుసుకున్నారు. కానీ ఆ ప్రక్రియలో బ్యాక్టీరియా చనిపోయే అవకాశం ఉందని కనుగొన్నారు. అప్పటినుండి ఎన్నో విధాలుగా పరిశోధనలు చేసిన తర్వాత కొరియన్ శాస్త్రవేత్తలు ఇప్పటికి సక్సెస్ అయ్యారు.
బ్యాక్టీరియాతో చేసి ప్రక్రియ మొదలయినప్పుడే అందులో సింథటిక్ మెంబ్రేన్‌ను కలపాలి. అప్పుడు అది బ్యాక్టీరియాకు ఏ హాని కలగకుండా చూస్తుంది. ఆ తర్వాత ఈ ప్రక్రియ రెండు రకాలుగా విభజించబడి చివరిగా పాలి 3 హైడ్రాక్సిబటిరేట్ (పీహెచ్బీ) తయారవుతుంది. దాదాపు 18 రోజుల పాటు ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు కష్టపడ్డారు. ఆ క్రమంలో వారు గంటకు 11.5 ఎమ్జీ పీహెచ్బీను తయారు చేయగలిగారు. అయితే ఈ ప్రక్రియ కోసం ఎక్కువగా కరెంటు అవసరం లేకుండా మెరుగుపరుస్తామని శాస్త్రవేత్తలు అంటున్నారు.