Brs party politics: దమ్ముంటే అరెస్ట్ చేయండి.. మేము రెడీ. మమ్మల్ని అరెస్ట్ చేసే సత్తా మీకు ఉందా.. ఉంటే పోలీసులను పంపండి అంటూ సవాల్ విసురుతున్నారు ఆ పార్టీ నేతలు. ఏదీ లేకపోతే గోదారే దిక్కన్నట్లు.. ఆ పార్టీకి ఇప్పుడు అరెస్ట్ ల అవసరం ఎంతైనా ఉంది. దానికి కారణం కంటెంట్ కోసమేనట. కటకటాల పాలైతే చాలు.. తమ పార్టీకి ఫుల్ కంటెంట్ దొరుకుతుందని వారి అభిప్రాయమో ఏమో కానీ, పోలీసులను చూస్తే చాలు ‘సై నా రాజా సై సై’ అనేస్తున్నారు. ఇక మీడియా కెమెరాలు ఆ టైమ్ లో కనిపించాయా మరీ రెచ్చిపోతున్నారట. ఇలా అరెస్ట్ కోసం పాకులాడుతున్న తీరు బీఆర్ఎస్ లో ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇంతకు ఆ అభిప్రాయానికి తావిచ్చిన ఘటనలు ఏవో, ఎందుకిలా తెలుసుకుందాం.
తెలంగాణలో పదేళ్ల పరిపాలన సాగించిన పార్టీ బీఆర్ఎస్. ఆ పార్టీని బీట్ చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అద్యక్షుడిగా ఉండి, పాదయాత్ర చేసి పార్టీని బలోపేతం చేసుకున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కడితే సోనియా, రాహుల్ గాంధీలు రేవంత్ రెడ్డిని సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. గత బీఆర్ఎస్ చేయలేని అభివృద్దిని అనతికాలంలోనే సీఎం రేవంత్ సర్కార్ ప్రజలకు రుచి చూపింది.
అంతేకాదు ఓ వైపు ఆరు గ్యారంటీలు, మరో వైపు జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ పాలన కొనసాగిస్తున్నారు. అలాగే గత ప్రభుత్వం రుణమాఫీని అదిగో ఇదిగో.. అంటూ తాత్సారం చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రూ. 2 లక్షల వరకు మాఫీ చేయడం విశేషం. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఫ్రీ బస్సు, గృహ జ్యోతి, రూ. 500 కే సిలిండర్, 54 వేలకు పైగా ఉద్యోగాలు, సన్న బియ్యంకు రూ. 500 బోనస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు ఉన్నాయి. ఇక్కడే బీఆర్ఎస్ కు దిమ్మతిరిగిందని చెప్పవచ్చు.
తాము పదేళ్లు పరిపాలన చేసిన కాలంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు అష్టకష్టాలు పడితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో పథకాలు అమలు చేసి ప్రజాదరణ పొందడంతో బీఆర్ఎస్ తలలు పట్టుకుంది. ప్రతిపక్ష హోదాలో ఉన్న తాము ఉనికి కాపాడుకోకపోతే, ఇక అంతే సంగతులన్న అభిప్రాయం బీఆర్ఎస్ అధినాయకత్వం వద్ద చర్చ సాగిందట. ఏది ఏమైనా ప్లాన్ – ఏగా సోషల్ మీడియాను పావుగా వాడుకొని కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డిలపై బురదజల్లే యత్నానికి శ్రీకారం చుట్టింది. ఈ మాటలకు ఆధారం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు ఈ విషయంపై కామెంట్స్ చేయడమే. ఆ ప్రభావం కూడా ప్రజలపై చూపకపోవడంతో, ప్లాన్ బీ అమలుకు బీఆర్ఎస్ తెగ ప్రయత్నాలు చేస్తోందట.
ప్లాన్ బీ ఏమిటో తెలుసా కటకటాలకు వెళ్లడమే. రోజురోజుకు ఉనికిని కోల్పోతున్న క్రమంలో ఆత్మవిమర్శలో పడ్డ బీఆర్ఎస్ ప్లాన్ బీని మాత్రం అమలు చేయడంలో కాస్త సక్సెస్ అయిందనే చెప్పవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై అవినీతి ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఫార్ములా ఏ1 కార్ రేసింగ్ లో అవినీతి, భూముల ఆక్రమణ ఇలా ఎన్నో కీలక అంశాలపై బీఆర్ఎస్ పార్టీ విమర్శలను, విచారణలను ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో ఫార్ములా కార్ రేసింగ్ కి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ పేరు తెరమీదికి రావడంతోనే.. నేను రెడీ, జైలుకు వెళ్తా, పుస్తకాలు చదువుకుంటా, జిమ్ ప్రాక్టీస్ చేస్తా అరెస్ట్ చేస్తే చేసుకోండి అంటూ కేటీఆర్ ప్రకటన ఇచ్చేశారు.
అలాగే అదే పార్టీకి చెందిన ఎమ్మేల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి చిందులు వేశారు. అలా చిందులు వేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారన్న విషయం కూడా తెలిసీ ఎమ్మేల్యే అలా ఎందుకు చేశారన్నది సమాధానం లేని ప్రశ్న. చివరకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్క అరెస్ట్ తో బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లేందుకు కావాల్సినంత కంటెంట్ ఇచ్చారు కౌశిక్ రెడ్డి. కౌశిక్ అరెస్ట్ సమయంలో అయితే హరీష్ రావు రూటే సపరేట్. ఆందోళన అన్నారు.. నిరసన అన్నారు.. ఏకంగా పోలీస్ జీప్ ఎక్కి రెడీ తీసుకు వెళ్ళండి అంటూ హంగామా చేశారు.
Also Read: Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి..
ఇలాంటి ఘటనలను దృష్టిలో ఉంచుకున్న రాజకీయ విశ్లేషకులు ఇది కదా పాలి’ట్రిక్స్’ అంటూ తమ అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. ఛాన్స్ దొరికితే చాలు.. అరెస్ట్ కు రెడీ అనడం బీఆర్ఎస్ నేతలకు ఫ్యాషన్ గా మారిందని, కటకటాల్లోకి వెళ్లైనా తమ పార్టీకి కంటెంట్ ఇవ్వాలన్నది బీఆర్ఎస్ ప్లాన్ గా పొలిటికల్ టాక్. కంటెంట్ సంగతి దేవుడెరుగు.. ముందు మీ అవినీతి బాగోతాలు, డ్రామాలు ప్రజలకు పూర్తిగా తెలుసంటూ కాంగ్రెస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ ప్లాన్ బీని తిప్పికొడుతోంది. ప్రతిదానికి టైం వస్తుంది.. ప్లీజ్ వెయిట్ అంటున్నారు కాంగ్రెస్ లీడర్స్. ఏదిఏమైనా కంటెంట్ కోసం కటకటాలకు వెళ్లాలని ప్లాన్ ఎలా తోచిందో కానీ, బీఆర్ఎస్ లీడర్స్ నేను రెడీ.. నేను రెడీ అంటూ ప్రకటనలు ఇచ్చేయడం విశేషం.