దేశంలో కొన్ని నెలలుగా వాహన ధరలకు రెక్కలు వస్తున్నాయి. టూ వీలర్లతో పాటు కార్ల ధరలూ అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దాంతో… ఇయర్ ఎండింగ్ లో… అంటే నవంబర్, డిసెంబర్లో భారీ ఆఫర్ల కారణంగా కార్ల ధరలు తగ్గుతాయని… అప్పుడు కొందామని చాలా మంది ఎదురుచూస్తున్నారు. కానీ కార్ల ధరలు తగ్గడం కాదు కదా… మళ్లీ పెరిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే… ఓ కంపెనీ కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఓ కంపెనీ ధరల్ని పెంచితే… కాస్త అటూ ఇటుగా మిగతా కంపెనీలు కూడా ధరలు పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ ఏడాది ఇప్పటికే రెండు సార్లు కార్ల ధరలు పెంచిన టాటా… ముచ్చటగా మూడోసారి కూడా వడ్డించింది. విడిభాగాల తయారీ కోసం వాడే ముడిసరుకు ధరలతో పాటు… ట్రాన్స్ పోర్ట్ ఛార్జీలు కూడా భారీగా పెరిగాయని… దాంతో కార్ల ధరలు పెంచక తప్పలేదని టాటా ప్రకటించింది. ఈ నెల 7 నుంచి అన్ని టాటా కార్లపై 0.9 శాతం పెంపు అమల్లోకి వస్తుందని సంస్థ తెలిపింది. గత జూలైలోనూ అన్ని కార్లపై 0.55 శాతం ధర పెంచింది… టాటా.
ఇటీవలి కాలంలో కార్ల ధరల పెరుగుదలపై వినియోగదారులు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లైఫ్ ట్యాక్ భారీగా పెంచారని… ఇప్పుడు కంపెనీలు కూడా ధరల్ని పెంచితే… కార్లు కొనాలనే ఆలోచన ఉన్న వాళ్లు.. కొన్నాళ్లు వాయిదా వేసుకునే అవకాశం ఉందంటున్నారు. కార్ల ధరలు పెరిగినా సంపన్నులు పెద్దగా లెక్కచేయలని… అదే మధ్యతరగతి వాళ్లకు మాత్రం కారు కొనాలంటే భారమేనని అంటున్నారు.