కూడబలుక్కుని ఇలా ప్రవర్తిస్తున్నారో, లేక ఎవరికి వారే ఇలాంటి సెంటిమెంట్ సీన్లు రక్తి కట్టిస్తున్నారో తెలియదు కానీ.. ఏపీలో లిక్కర్ స్కామ్ నిందితులు వారానికొకరు కోర్టులో కంటతడి పెడుతున్నారు. సరిగ్గా వారం రోజుల క్రితం వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన తప్పేమీ లేకపోయినా శిక్ష అనుభవిస్తున్నానంటూ కంటతడి పెట్టారు. తాజాగా ఈ కేసులో కీలక నిందితుడు ఏ-1 గా ఉన్న రాజ్ కెసి రెడ్డి కూడా న్యాయమూర్తి ఎదుట కన్నీటి పర్యంతం అయ్యారు. తనకు సంబంధం లేకపోయినా కొన్ని విషయాల్లో సిట్ తన పేరు తీసుకొస్తోందని అన్నారు. ఇటీవల 12 అట్టపెట్టెల్లో దొరికిన 11 కోట్ల రూపాయల వ్యవహారంలో తనకు సంబంధమేమీ లేదన్నారు కెసిరెడ్డి. విజయవాడ ఏసీపీ ప్రత్యేక న్యాయస్థానంలో ఆయన న్యాయమూర్తి ముందు తన వాదన వినిపించారు. ఓ దశలో కన్నీరు పెట్టుకున్నారని తెలుస్తోంది. తనకు సంబంధం లేకపోయినా 11 కోట్ల రూపాయలు తనవే అని సిట్ లింకులు పెడుతోందని కెసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు, ఆ 11 కోట్ల రూపాయల కరెన్సీ నోట్లపై ఉన్న నెంబర్లను రికార్డ్ చేయాలంటూ న్యాయమూర్తికి ఆయన విజ్ఞప్తి చేశారు. 2024 జూన్ లో ఆ డబ్బు తాను వరుణ్ కి ఇచ్చినట్టు చెబుతున్నారని, అసలు ఆ నోట్లు RBI ఎప్పుడు ముద్రించిందనేది తేలాలన్నారు. అందుకే ఆ నెంబర్లను రికార్డ్ చేసి పెట్టాలన్నారు. కోర్టు కూడా కీలక ఆదేశాలు జారీ చేయడం విశేషం. ఆ నగదుని ఫొటోలు తీసి భద్రపరచాలని ఏసీబీ కోర్టు జడ్జి ఆదేశాలిచ్చారు.
నేను బినామీనా..?
తన వయ 43 ఏళ్లని, అయితే 45 ఏళ్ల క్రితం కొన్న ఆస్తులకు కూడా తాను బినామీ అంటూ పోలీసులు ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు రాజ్ కెసిరెడ్డి. తను పుట్టకముందు వేరే వారికి తానెలా బినామీ అవుతానని ప్రశ్నించారు. ఇటీవల పట్టుబడిన 11 కోట్ల రూపాయల నగదు ఉన్న బాక్సుల్ని తానే వేరొకరికి అందించినట్టు పోలీసులు చెబుతున్నారని, ఆ పెట్టెలపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ తీసి భద్రపరచాలన్నారు. ఇవన్నీ చేస్తే తాను తప్పు చేయలేదనే విషయం తేలిపోతుందన్నారాయన. లిక్కర్ స్కామ్ లో ఛార్జిషీట్ వేసిన సమయంలో తమపై దర్యాప్తు ముగిసినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో చెప్పారని.. ఇప్పుడు కొత్త కొత్త విషయాల్లో కూడా తమకు సంబంధం ఉందని ఆరోపిస్తున్నారని అన్నారు రాజ్ కెసిరెడ్డి.
రిమాండ్ పొడిగింపు..
ఇక ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు తాజాగా రిమాండ్‌ను పొడిగించింది. ఈ నెల 13 వరకు వారందరికీ రిమాండ్ విధిస్తున్నట్లు తెలిపింది. ఈ కేసులో ఇప్పటివరకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్.. 12 మందిని అరెస్ట్ చేసింది. ఆ 12మందిలో 9మంది విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు. వారిని సిట్ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తీసుకువెళ్లారు. ఏ-1 రాజ్ కెసిరెడ్డితోపాటు, వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, పైలా దిలీప్, వెంకటేష్ నాయుడు, బూనేటి చాణక్య, బాలాజీ గోవిందప్ప, సజ్జల శ్రీధర్ రెడ్డిని కోర్టులో ప్రవేశ పెట్టారు. ఇక గుంటూరు జిల్లా జైలులో మరో ఇద్దరు నిందితులు ఉన్నారు. వారిని కూడా విజయవాడకు తెచ్చారు. రాజమండ్రి జైలులో ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కూడా ఈరోజు కోర్టుకి తెచ్చారు. వీరందరికీ ఈనెల 13 వరకు కోర్టు రిమాండ్ విధించింది.