Chicken Eggs Rates Hike: నువ్వు ముందా.. నేను ముందా అనే రీతిలో వీటి పరుగుపందెం సాగుతోంది. ఆ పరుగుపందెం కూడా ఎందులో అనుకుంటున్నారు. ధరలలో నేను ఎక్కువ పలుకుతానని ఒకరు, మరొకరేమో నేనే ఎక్కువంటూ ఎవరికి వారు పరుగులు పెడుతున్నారు. ఇంతకు వీరెవరో తెలుసా.. కోడి, కోడి గుడ్డు.
అసలే కార్తీకమాసం ముగిసింది. మొన్నటి వరకు వీటి ధరలు చూస్తే.. భలే మంచి చౌకబేరం అనిపించాల్సిందే. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వీటి ధరలు పలుకుతున్నాయి. కార్తీకమాసంలో మాంసాహారాన్ని భుజించే వారి సంఖ్య అమాంతం తగ్గిపోతుంది. అప్పుడు మాత్రం కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఇప్పుడు మాసం ముగిసింది. మళ్లీ కోడి, అది పెట్టే గుడ్డు ధర అమాంతం పెరిగింది.
ఏపీ, తెలంగాణ పరిధిలో వర్షాలు కూడా కురుస్తున్నాయి. వర్షాల ఎఫెక్ట్ కూడా వీటి ధరపై ప్రభావం చూపుతుంది. కోళ్లఫారాలు నిర్వహించే వారికి, వర్షాలు కురిసాయంటే చాలు నష్టాలు రాక తప్పదు. అందుకు ప్రధాన కారణం చలిగాలులను తట్టుకొనే శక్తి కోళ్లకు ఉండక పోవడమేనంటారు యజమానులు. ఈ కారణంగా తాము ధరలను పెంచక తప్పదని, మొన్నటి వరకు నష్టాలను చవిచూసిన మేము కార్తీకమాసం అనంతరం ధరలు పెంచి విక్రయాలు సాగించాల్సిందే అంటున్నారు వీరు.
Also Read: Tips For White Hair: ఇవి వాడితే.. తెల్లజుట్టు అస్సలు రాదు
అందులోనూ డిసెంబర్ నెలలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు రానున్నాయి. దీనితో ఈ నెలలో చికెన్, గ్రుడ్లకు భారీ డిమాండ్ ఉంటుంది. అందుకే కాబోలు అమాంతం వీటి రేట్లు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయని ప్రజలు తెలుపుతున్నారు. ప్రస్తుతం చికెన్ ధర చూస్తే కేజీ రూ. 220 ఉండగా మరికొద్ది రోజుల్లో రూ. 300 కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కోడి గుడ్డు కూడా నేనేమి తక్కువా అనే రీతిలో రిటైల్ లో రూ. 7 ల వంతున విక్రయాలు సాగుతున్నాయి. దీనిని బట్టి చూస్తే డిసెంబర్ నెలలో వీరి రేట్లకు హద్దులు ఉండవని చెబుతున్నారు కొనుగోలుదారులు. ఏదిఏమైనా అసలే క్రిస్మస్ పండుగ, మరోవైపు న్యూ ఇయర్ వేడుకలు రానున్న నేపథ్యంలో ధర ఎంతైనా తగ్గేదేలే అంటోంది మార్కెట్.