
Emergency message : ప్రకృతి విపత్తులు.. అంటే కార్చిచ్చు, వరదలు, తుఫానులు లాంటివి హఠాత్తుగా వచ్చి ఎంతోమంది ప్రాణాలను తీసుకెళ్లిపోతాయి. అయితే ప్రజలకంటే కొంచెం ముందుగానే శాస్త్రవేత్తలకు, ఆ తర్వాత ప్రభుత్వాలకు ఈ ప్రకృతి విపత్తుల గురించి తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలతో వారు ప్రజలను వెంటనే అలర్ట్ చేయాలని ప్రయత్నించినా అది పూర్తిస్థాయిలో సాయంగా నిలవడం లేదు. అందుకే యూకే ప్రభుత్వం ఒక కొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది.
మొబైల్ బ్రాడ్‌కాస్టింగ్ టెక్నాలజీని ఉపయోగించి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు ఎమర్జెన్సీ అలర్ట్స్ అందించాలని యూకే ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఒక ప్రాంతానికి ఏదైనా ప్రమాదం రానుందని ప్రభుత్వానికి సమాచారం అందినప్పుడు ఆ ప్రాంతంలో ఉండే దాదాపు 90 శాతం ప్రజల ఫోన్లకు అలర్ట్ వెళ్లిపోయేలాగా వారు ఒక టెక్నాలజీని డిజైన్ చేశారు. అంతే కాకుండా అలర్ట్‌తో పాటు ఈ ఎమర్జెన్సీలో వారు ఎలా జాగ్రత్తపడాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని కూడా మెసేజ్‌ల రూపంలో పంపనున్నారు.
ఏదైనా ప్రమాదం జరగనుందని తెలిసినప్పుడు ప్రభుత్వం ప్రజలకు ఒక టెక్స్‌ట్ మెసేజ్‌ను పంపుతుంది. దాదాపు 10 సెకండ్ల పాటు ఈ మెసేజ్ వల్ల ఫోన్ సౌండ్‌తో పాటు వైబ్రేట్ కూడా అవుతుంది. ఇప్పటికే ఈ టెక్నాలజీపై పరిశోధకులు పరిశోధనలు చేశారు. భవిష్యత్తులో తుఫానులు, వాతావరణంలో తీవ్రమైన మార్పులు లాంటివి జరిగినప్పుడు ప్రజలకు ఏ మాత్రం ప్రమాదం కలగకుండా ఈ అలర్ట్‌ను వారి ఫోన్లకు పంపించనున్నారు. 2022 ఫిబ్రవరీలో వచ్చినట్టుగా మరోసారి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ టెక్నాలజీ అనేది ప్రజలను అలర్ట్ చేసి వారి ప్రాణాలకు రక్షించుకునేలా చేస్తుంది.
మెసేజ్ వచ్చిన 10 సెకండ్లకు యూజర్లు ఏం చేయకపోయినా.. వైబ్రేషన్ ఆగిపోతుంది. వారు ఈ మెసేజ్‌ను ఓపెన్ చేసి ఓకే అని క్లిక్ చేస్తే చాలు.. ఆ అలర్ట్ మాయమయిపోతుంది. దాని తర్వాత వారు యథావిధిగా ఫోన్‌ను ఉపయోగించవచ్చు. డ్రైవ్ చేసే వారు మాత్రం వెంటనే వారు ఫోన్‌ను చూసుకోవాల్సిన అవసరం లేదని, ఒకవేళ డ్రైవ్ చేస్తూ ఫోన్ చూస్తే 200 యూరోల ఫైన్ పడుతుందని అధికారులు చెప్తున్నారు. నేషనల్ ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ పేరుతో దాదాపు ప్రతీ ఒక్కరికీ ఈ అలర్ట్ వెళుతుందని తెలిపారు.
ఏప్రిల్ 23న ఈ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్ జరగనుంది. దీనికి అందరూ సహకరించాలని ఇప్పటికే యూకేలోని ప్రజలకు ప్రభుత్వం సమాచారాన్ని పంపింది. సిస్టమ్ సరిగా పనిచేస్తుందా లేదా అని అధికారులు పరీక్షించనున్నారు. ఒకవేళ ఈ ఎమర్జెన్సీ అలర్ట్స్ అనేవి తమకు అనవసరం అనిపిస్తే ఫోన్ సెట్టింగ్స్‌లో వాటిని ఆఫ్ చేసుకోవచ్చని కూడా చెప్తున్నారు. ఇప్పటికే కెనడా, అమెరికా, నెథర్‌ల్యాండ్స్, జపాన్ వంటి దేశాల్లో ఈ అలర్ట్ సిస్టమ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా పనిచేస్తోంది.