Fruits and Vegetables Peel Benefits : సాధారణంగా మనం చాలా పండ్లు, కూరగాయలను వాటి తోలు తీసి తింటుంటాం. ఇలా తొక్కే కదా అని తీసి పారేయొద్దంటున్నారు నిపుణులు, పండ్లలో కంటే వాటి తొక్కలోనే ఎన్నో పోషకాలు ఉన్నాయని చెబుతున్నారు. మామూలుగా అయితే పండ్ల తొక్కలు రుచి ఉండవనో లేక వాటిపై కెమికల్స్ ఉంటాయనో తీసేస్తుంటాం. పండ్లతో దొరికే పోషకాల్లో 30 శాతం వాటి తొక్కల్లోనే ఉంటాయని నిపుణులు అంటున్నారు. కూరగాయల్లో ఉండే ఫైబర్‌లో 31 శాతం పొట్టులోనే ఉంటుందట. నారింజ తొనల కంటే తొక్కలలో విటమిన్-సి రెండు రెట్లు అధికంగా ఉంటుంది. విటమిన్ బి6, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, రైబోఫ్లావిన్‌లాంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. నారింజ తొక్క త్వరగా జీర్ణం కాదు. చేదుగా కూడా ఉంటుంది. వీటిని కట్ చేసుకుని సలాడ్లలో వినియోగించుకోవచ్చు. ఎండబెట్టి పొడి చేసుకొని వంటకాల్లో వాడటం వల్ల పోషకాలు పూర్తిగా శరీరానికి అందుతాయి. పుచ్చకాయ లోపలి గుజ్జు తినేసి బయట చెక్క పడేస్తాం. వీటి తొక్కలో సిట్రులిన్ అనే అమైనో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాల నొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది. రక్తంలోంచి నైట్రోజన్‌ను తొలగించడానికి కూడా బాగా సహాయపడుతుంది. పుచ్చకాయ తొక్కను కూరగాయల్లా వేయించుకొని తినొచ్చు. అంతేకాకుండా పచ్చడి కూడా చేసుకోవచ్చు, ఈ తొక్కతో వడియాలు, జామ్ కూడా చేసుకోవచ్చు. యాపిల్‌ను పొట్టుతో పాటు తింటే విటమిన్ కె 332 శాతం, విటమిన్ ఎ 142శాతం, విటమిన్ సి 115శాతం, క్యాల్షియం 20శాతం, పొటాషియం 19శాతం లభిస్తాయి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ క్వెర్‌సెటిన్ బ్రెయిన్, లంగ్స్‌కు ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా మనం కీరా దోసను తొక్క తీసి తింటుంటాం. కీరా తొక్కలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు సంవృద్ధిగా ఉంటాయి. ఎముకలు బలంగా మారడానికి, రక్తంలో గడ్డలు ఏర్పడకుండా విటమిన్ కె కూడా ఇందులో ఉంటుంది. మన చర్మాన్ని రక్షించే సిలికా, జీర్ణక్రియ మెరుగుపర్చే ఫైబర్ ఈ కీరాదోస పొట్టులో అధికంగా ఉంటాయి. బంగాళాదుంప పొట్టులో కూడా అధిక పోషకాలు ఉంటాయి. పొట్టు తీయకుండా ఉడికిస్తే విటమిన్ సి 175శాతం, పొటాషియం 115శాతం, ఫోలేట్ 111శాతం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ 110శాతం అధికంగా ఉంటాయి. ఇందులోని ఫైబర్ ఆకలిని అదుపులో ఉంచుతుంది. దీంతో బరువు కూడా తగ్గవచ్చు. మామిడిపండ్ల తొక్కలో కూడా ఎన్నో పోషకాలు, పీచుపదార్థాలు ఉంటాయి.