Google : ప్లే స్టోర్ మార్కెట్‌లో గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ… 4 రోజుల వ్యవధిలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెండు దఫాలుగా విధించిన 2,274 కోట్ల రూపాయల జరిమానాపై కోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తోంది… గూగుల్. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వ్యవహారంలో కోర్టును ఆశ్రయించాలని ఆ కంపెనీ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీసీఐ నిర్ణయాల వల్ల ఇతర అంశాల్లోనూ సంస్థకు ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని గూగుల్ ఆందోళన చెందుతోందని చెబుతున్నారు. అందుకే… వచ్చే వారం సీసీఐ ఉత్తర్వులను కోర్టులో సవాల్ చేయాలని గూగుల్ నిర్ణయించిందని అంటున్నారు. కానీ… గూగుల్ మాత్రం ఈ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.
తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు… ప్లే స్టోర్ పాలసీ నిబంధనల్ని తుంగలో తొక్కుతోందని… పేమెంట్ యాప్స్ అండ్ పేమెంట్ సిస్టంను ప్రమోట్ చేస‍్తోందని గూగుల్ కు ఓసారి 1,337 కోట్లకు పైగా… మరోసారి 936 కోట్లకు పైగా జరిమానా విధించింది… సీసీఐ. వెంటనే తీరు మార్చుకోవాలని హెచ్చరించింది. గూగుల్ కు భారత్ లో ఇలాంటి ఎదురుదెబ్బ తగలడం తొలిసారే అయినా… గతంలో యూరోపియన్ యూనియన్ కూడా గూగుల్ కు 3 వేల కోట్ల ఫైన్ వేసింది. ఆండ్రాయిడ్ మొబైళ్లు తయారు చేసే కంపెనీలకు గూగుల్ పరిమితులు విధిస్తోందంటూ భారీ జరిమానా వడ్డించింది. దీనిపై గూగుల్ కోర్టుకు వెళ్లినా… ఊరట లభించలేదు. మరి ఇప్పుడు గూగుల్ భారత్ లో కోర్టుకెక్కితే ఎలాంటి వాదన చేస్తుంది? కోర్టు తీర్పు ఎలా వస్తుంది? అన్న అంశంపై అందరిలో ఆసక్తి పెరుగుతోంది.