Google : అవును. గూగుల్లోనూ గుబులు మొదలైంది. అంచనాల మేరకు ఆదాయం రాకపోవడంతో… కోతలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా నాలుగో క్వార్టర్లో నియామకాల్లో కోత విధించాలని, ఖర్చులు తగ్గించుకోవాలని గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ నిర్ణయించింది.
మూడో త్రైమాసిక ఫలితాలు ఆల్ఫాబెట్ ను తీవ్రంగా నిరాశ పరిచాయి. ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలతో జనం ఖర్చులకు వెనుకాడుతున్న పరిస్థితుల్లో… ఆల్ఫాబెట్ ప్రకటనల ఆదాయంలో వృద్ధి అంతంత మాత్రంగానే నమోదైంది. నిరుడు యాడ్స్ ద్వారా 53.13 బిలియన్ డాలర్ల ఆదాయం రాగా… ఈ ఏడాది స్వల్పంగా పెరిగి… 54.48 బిలియన్లకు చేరింది. నిరుడు 65.12 బిలియన్ డాలర్లుగా ఉన్న కంపెనీ మొత్తం ఆదాయం… ఈ ఏడాది 69.09 బిలియన్ డాలర్లకు చేరింది. ఆదాయం 70 బిలియన్ డాలర్లకు పైగా రావొచ్చని అంచనా వేయగా… 69 బిలియన్ డాలర్లకే పరిమితమైంది. ముఖ్యంగా వీడియో ప్లాట్‌ఫాం అయిన యూట్యూబ్ ద్వారా 7.42 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా.. 7.07 బిలియన్ డాలర్లు మాత్రమే వచ్చింది. యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయం నిరుటి కంటే 2 శాతం మేర తగ్గడంతో… అమెరికా స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్ విలువ 6 శాతం మేర క్షీణించింది.
ఆదాయం ఆశించిన మేరకు లేకపోవడంతో… ఆల్భాబెట్ ఖర్చులు తగ్గించుకునే మార్గాలు వెతుకుతోంది. ముఖ్యంగా ప్రకటనల ఆదాయం తగ్గడంతో ఫోర్త్ క్వార్టర్ తో పాటు వచ్చే ఏడాది నియామకాల్లో వేగం తగ్గించాలని ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ నిర్ణయించారు. వృద్ధికి అవకాశం ఉన్న చోట మాత్రమే వనరులు వినియోగించాలని ఆదేశించారు. థర్డ్ క్వార్టర్లో 12,765 మందిని నియమించుకుని మొత్తం ఉద్యోగుల సంఖ్యను 1,86,779కి పెంచుకున్న గూగుల్… ఫోర్త్ క్వార్టర్ లో నియామకాల సంఖ్యను భారీగా కుదించాలని నిర్ణయించింది. థర్డ్ క్వార్టర్లో ఇచ్చిన ఉద్యోగాల్లో సగానికి సగం తగ్గించబోతోంది. క్రిటికల్ రోల్స్‌తో పాటు, దృష్టి కేంద్రీకరించిన విభాగాల్లో మాత్రం యథావిధిగా నియామకాలు చేపట్టనుంది. కోతల్లో భాగంగా… నెక్ట్స్ జెనరేషన్ పిక్సల్ బుక్ ల్యాప్‌ట్యాప్ ప్రణాళికను గూగుల్ రద్దు చేసింది. ఏరియా 120 పేరుతో పెట్టిన స్టార్టప్ ఇంక్యుబేటర్‌కు ఇచ్చే నిధుల్లోనూ కోత పెట్టింది.