Hydra: నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతం జూబ్లీహిల్స్. అక్కడ గజం స్థలం రూ. 2 లక్షల నుంచి రూ,3 లక్షల మధ్య ఉంటుంది. అలాంటి ప్రైమ్ ఏరియాలోని పార్కును 150 గజాల మేర కబ్జా చేశాడో ప్రబుద్ధుడు. ఏకంగా రూ. 3 కోట్ల విలువైన భూమిని సొంతం చేసుకోవాలనుకున్నాడు. అలాగే హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌కు చేరువలోని ఖానామెట్ ప్రాంతం. ఐటీ కారిడార్ లోని ఇక్కడ ఎకరం రూ. 200 కోట్ల వరకు విలువ చేస్తుంది. 5 ఎకరాలను వెలమ సంఘానికి గతంలో ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమి విలువ రూ. వెయ్యి కోట్లు ఉంటుందని అంచనా. ఆ కేటాయింపులపై కొంత మంది అభ్యంతరం చెప్పడంతో కోర్టు స్టే ఇచ్చింది. ఇదే అదనుగా ఆక్రమణల పర్వానికి కొందరు కబ్జారాయుళ్లు తెరదీశారు. ఈ రెండు కబ్జాలపై హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదులందాయి. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో హైడ్రా అధికారులు పరిశీలించారు. కబ్జాలను నిర్ధారించుకుని బుధవారం ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్ వేశారు. ఇలా మొత్తం రూ. 1003 కోట్ల ప్రభుత్వ ఆస్తిని హైడ్రా కాపాడింది.
Also Read: Weightloss Roti: బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని రోటీలు తినాలి? ఏ పిండితో చేసిన రోటీ తింటే మంచిది?
ఆ కబ్జాల వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి ఔట్ గేట్‌కు ఎదురుగా ఇళ్ల మధ్య దాదాపు 2 ఎకరాల మేర పార్కు ఉంది. అక్కడ ఓ ఇంటిని కిరాయికి తీసుకుని లేడీస్ హాస్టల్ నడుపుతున్న వ్యక్తికి ఆ పార్కు స్థలంపై కన్ను పడింది. ఇంకేముంది 150 గజాల మేర పార్కును ఆక్రమించేశాడు. కాంపౌండ్ దాటి పార్కులోకి 50 గజాల మేర జరిగి పాత భవనానికి ఆనుకుని మరో నిర్మాణం చేపట్టాడు. ఒక్కో అంతస్తులో 4 బెడ్లు పట్టినట్టు గదులు నిర్మించాడు. ఇంటి యజమాని కూడా ఈ కబ్జాలపై మౌనం వహించారు. పార్కు వైపు గేటు పెట్టి వంద గజాల మేర ఫార్మ్ హౌజ్ మాదిరి సొంత పార్కును అభివృద్ధి చేసుకుని వాడుకుంటున్నాడు. స్పందించిన ఇరుగు పొైరుగు వారు పార్కు కబ్జాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని హైడ్రా ప్రజావాణిలో అక్కడి నివాసితులు ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో హైడ్రా పరిశీలించింది. పార్కులోకి 50 గజాల మేర జరిగి నిర్మాణం చేపట్టినట్టు నిర్ధారించుకుంది. మరో 100 గజాల మేర హద్దులు వేసుకుని ఆక్రమణ చేసినట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో బుధవారం 3 అంతస్తుల నిర్మాణాన్ని తొలగించారు. పార్కు కబ్జా ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఫెన్సింగ్ వేశారు. కబ్జాకు పాల్పడిన వారిపై పోలీసు స్టేషన్ లో కేసు పెట్టినట్లు హైడ్రా వెల్లడించింది.
హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు సమీపంలోని ఖానామెట్‌లో ఆలిండియా వెలమ సంఘానికి 5ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలం చుట్టూ ప్రీకాస్ట్ వాల్‌తో ప్రహరీ నిర్మిస్తుండగానే, కుల సంఘాలకు స్థలాలు కేటాయించడంపై కొంత మంది కోర్టుకెక్కడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. ఇదే అదనుగా ఆ స్థలాన్ని వెనుక వైపు నుంచి అక్కడ ఉన్న స్థానికులు మట్టిపోస్తూ కబ్జాచేస్తుండగా, ఇదేమని అడిగితే వాచ్‌మ్యాన్‌పై దాడి చేస్తున్నారని ఆ సంఘం ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కోర్టు తీర్పును బట్టి నిర్ణయం ఉంటుంది. ఈ లోగా అక్కడి స్థలం కబ్జాకు గురి కాకుండా చూడాలని హైడ్రాను కోరారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి కబ్జాలకు ఆస్కారం లేకుండా 5 ఎకరాల భూమికి ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది.