Big Stories

India:’ఇండియా ఎ బ్రైట్ స్పాట్’… బడ్జెట్‌కు ముందు ఐఎంఎఫ్ కితాబు..

India:కేంద్ర బడ్జెట్‌కు ముందు భారతదేశానికి సంబంధించి ఐఎంఎఫ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి దారుణంగా పడిపోయే పరిస్థితుల్లోనూ… భారత ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ఢోకా ఏమీ లేదని ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ వృద్ధి 3.4 శాతం నుంచి 2.9 శాతానికి పడిపోవచ్చని అంచనా వేసిన ఐఎంఎఫ్, భారత్ వృద్ధి రేటు మాత్రం 6.1 శాతానికి పైగానే ఉంటుందని వెల్లడించింది. ఇది చైనా కంటే దాదాపు ఒక శాతం ఎక్కువ కావడం విశేషం.

- Advertisement -

ఐఎంఎఫ్ విడుదల చేసిన లేటెస్ట్ వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ ప్రకారం… ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.8 శాతం. ప్రపంచ ఆర్థిక మందగమనం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ కూడా కాస్త నెమ్మదిస్తుందని… అయితే స్థిరమైన దేశీయ డిమాండ్ కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.1 శాతానికి పైగానే ఉంటుందని… ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఆ తర్వాత 2024 ఆర్థిక సంవత్సరంలో మళ్లీ భారత వృద్ధి రేటు 6.8 శాతానికి చేరుతుందని వెల్లడించింది. 2022లో 3.4 శాతంగా ఉన్న ప్రపంచ వృద్ధి రేటు 2023లో 2.9 శాతానికి తగ్గినా… మళ్లీ 2024లో 3.1 శాతానికి చేరుతుందని అంచనా వేసింది.

- Advertisement -

ఇక ఆసియా విషయానికొస్తే 2023లో 5.3 శాతం, 2024లో 5.2 శాతం ఆర్థిక వృద్ధి నమోదవుతుందని ఐఎంఎఫ్ వెల్లడించింది. ఇక చైనాలో 2022లో ఆర్థిక వృద్ధి రేటు 3 శాతానికే పరిమితమవుతుందని… ప్రపంచ ఆర్థిక వృద్ధితో పోలిస్తే చైనా ఆర్థిక వృద్ధి తక్కువగా నమోదు కావడం గత 40 ఏళ్లలో ఇదే తొలిసారి అని ఐఎంఎఫ్ వెల్లడించింది. 2023లో చైనా ఆర్థిక వృద్ధి 5.2 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేసింది. మొత్తమ్మీద ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటులో సగం వాటా… భారత్, చైనాలదే అని ఐఎంఎఫ్ వ్యాఖ్యానించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News