Big Stories

India at 75 : హిమానీ నదాలు కరిగితే గంగానదికి ముప్పు తప్పదా?

India at 75 : భారతదేశానికి పెట్టని కోటలు హిమాలయ పర్వతాలు. కానీ గత కొన్నాళ్లుగా హిమాలయ పర్వతాల్లోని మంచు వేగంగా కరుగుతోంది. వాతావరణంలో మార్పులు, వేడి గాలుల కారణంగా హిమాలయాల్లో ఉన్న గ్లేసియర్లు అంటే హిమానీ నదాలు
చాలా వేగంగా కరిగిపోతున్నాయని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఇదే విషయాన్ని తాజాగా జర్మనీలోని జీన్ కు చెందిన ఫ్రెడ్ రిచ్ షిల్లర్ యూనివర్సిటీ అధ్యయనం కూడా వెల్లడించింది. ప్రతీరోజు ప్రతీక్షణం హిమాలయాల్లోని గ్లేసియర్లు కరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు ఆ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.
ముఖ్యంగా గంగానది జన్మస్థానమైన గంగోత్రి వద్ద గ్లేసియర్లు చాలా వేగంగా కరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రభావం గంగా నదిపై పడుతుందేమోననే ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే గంగానది పవిత్రమైన జీవనది. భారత దేశంలోని దాదాపు 5 కోట్ల మంది దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరందరికీ గంగానది నీరే సాగునీరు, తాగునీరుగా ఉపయోగపడుతోంది. ఒకవేళ గంగా నదికి ఏదైనా సమస్య వస్తే తమ పరిస్థితి ఏంటని తీర ప్రాంత ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది.
మరి ఈ పరిస్థితి ఎందుకు వస్తోంది? అంటే దీనికి కారణం భూమి వాతావరణం వేడెక్కుతుండడం, వాతావరణంలో వేగంగా వస్తున్న మార్పులే కారణమంటారు పరిశోధకులు. ఈ ప్రభావంతో వరదలు కూడా వస్తున్నాయి. 2013లో వచ్చినటువంటి వరదల్లో దాదాపు 5వేల మంది నిరాశ్రయులయ్యారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల వచ్చిన వరదలకు 71 మంది చనిపోయినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే మరికొన్ని సంవత్సరాల్లో గ్లేసియార్లు పూర్తిగా కరిగిపోయినా ఆశ్చర్యపోనక్కరలేదని పరిశోధకులు అంటున్నారు. హిమానీ నదాలు కరిగిపోతే ఎడారుల నుంచి వచ్చే వేడిని, వేడి గాలులను దేశంలోని ప్రజలు తట్టుకోవడం కష్టం. అలాగే నీటికి కూడా తీవ్ర కొరత ఏర్పడుతుందని
నీతిఆయోగ్ కూడా హెచ్చరించింది. ప్రస్తుతం భారత దేశ జనాభా 141 కోట్లకు చేరింది. వచ్చే ఏడాది జనాభాలో చైనాను మించిపోనుంది. జనాభా పరంగా భారతదేశం ప్రపంచ జనాభాలో 17% ఉంది. కానీ నీటి లభ్యత విషయంలో నాలుగు శాతం మాత్రమే. ఫలితంగా భవిష్యత్తులో దేశంలోని 60 కోట్ల మంది ప్రజలు నీటి సమస్యను ఎదుర్కొనున్నట్లు నీతిఆయోగ్ హెచ్చరించింది. బొగ్గు వాడకంలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. ఇక కర్బన ఉద్గారాల్లో ప్రపంచంలో మూడో స్థానంలో ఉందంటున్నారు పరిశోధకులు. వీటి ఫలితంగానే భూమి వాతావరణం వేడెక్కి హిమాలయాల్లోని గ్లేసియర్లు కరగడానికి కారణమవుతున్నాయని అంటున్నారు. దీన్ని అరికట్టాలంటే కాలుష్యాన్ని తగ్గించే చర్యలు చేపట్టాల్సిన బాధ్యత దేశం ప్రజలందరిపై ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News