
Peanuts : సాధారణంగా పల్లీలను మనం చట్నీలు చేసుకోవడానికి ఉపయోగిస్తుంటాం, మరికొందరు స్నాక్స్‌లా వేయించుకుని తింటుంటారు. ఉప్పు వేయకుండా వేయించిన పల్లీలు స్నాక్స్‌గా మంచి ఆహారం అని నిపుణులు అంటున్నారు. ప్రతిరోజు పల్లీలు తినడం వంటికి మంచిది కాదనేది ఓ అపోహ మాత్రమే అని చెబుతున్నారు. ఓ గుప్పెడు పల్లీలు తింటే సమస్య ఏమీ ఉండదని, అంతేకాకుండా శరీరానికి సరిపడా ప్రొటీన్లు, మంచి కొవ్వులతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయని సూచిస్తున్నారు.
గుండె, మెదడు, చర్మం, హార్మోన్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కూడా. హైడ్రోజినేటెడ్ కొవ్వులు, ప్రిజర్వేటివ్‌లతో పాటు సైంధవ లవణం కలిపి మార్కెట్‌లో అమ్మే పల్లీలు మాత్రం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు అంటున్నారు. మామూలుగా అయితే పల్లీల్లో ఉండే బయోటిన్ కేశాల పెరుగుదలకు చాలా ఉపయోగకరం. జుట్టు అధికంగా రాలుతున్నవాళ్లు ప్రతిరోజు గుప్పెడు పల్లీలు తింటే మంచిది. విటమిన్ బి, జింక్ లోపాలు ఉన్నా కూడా ఉపశమనం లభిస్తుంది. పల్లీలలో ఫోలెట్, కాపర్, మాంగనీస్‌తో పాటు చాలా ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరం పెరగడానికి ఎంతో ఉపయోగపడతాయి. గర్భిణులు పల్లీలు ఎక్కువగా తినాలని వైద్యులు చెబుతుంటారు.
ద్రాక్ష పండ్లు, వైన్లో ఉండే రెజ్వెట్రాల్ పల్లీలలో అధికంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, క్యాన్సర్ నిరోధక గుణాలు, యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.. ఇవి రోగ నిరోధక వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫైటిక్ ఆమ్లం మన శరీరం పోషకాలతో పాటు ఐరన్, జింక్‌ను గ్రహించకుండా నిరోధిస్తుంది. అందుకే పల్లీలను వేపుకొని కానీ.. నీళ్లలో నానబెట్టి కానీ తినాలి. ఇలా చేస్తే తొందరగా జీర్ణం అవుతాయి. అందులోని పోషకాలు కూడా మనకు వంటబడతాయి. శరీర జీవక్రియల్లో మార్పుల వల్ల సాయంత్రం కాగానే తియ్యగా, కారంగా ఏదైనా తినాలని అనిపిస్తూ ఉంటుంది. అలాంటివారు జంక్ పుడ్ తినేకంటే పల్లీలను తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభించడంతో పాటు చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి.
పల్లీలకు మర్మరాలు, కూరగాయల ముక్కలు కలిపి బేల్‌గా చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉప్పు వేసి వేయించిన గింజలు, పల్లీలు తినకూడదని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే ఇవి మెదడులో న్యూరోట్రాన్స్‌మిటర్లను ఉత్తేజం చేస్తాయని అంటున్నారు. దాంతో మరింత తినాల్సి వస్తుందని, ఫలితంగా శరీరంలో ఉప్పు అధికంగా పేరుకుంటుందని చెబుతున్నారు. బీసీ పెరగడంతో పాటు గుండెకు కూడా మంచిది కాదని, శరీరంలో నీరు ఉండిపోయేలా చేస్తుంది కాబట్టి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. పల్లీలు మంచివి కదా అని ఎక్కువ మోతాదులో తీసుకోవద్దని, బరువు పెరగడంతో పాటు అలర్జీలకు కూడా కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు.