Lagacharla Incident Case : లగచర్ల కేసులో అధికారులపై దాడులు చేసి జైలు పాలైన 26 మందిలో 24 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరిలో ఏ1 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డి కూడా ఉన్నారు. ఇతనితో పాటు మరో 23 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. మిగతా వారి కేసులో వాదనలు జరుగుతున్నాయి.
ఫార్మా సిటీ నిర్మాణం కోసం ప్రభుత్వం తలపెట్టిన భూముల సేకరణ అంశాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనలో ఏకంగా జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఘటనకు ప్రధాన సూత్రధారులుగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డి సహా కీలక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్ని నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేసింది.
మొత్తం 26 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించగా.. వారికి తాజాగా బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కీలక నిందితుడిగా.. ఏ1 గా పోలీసులు పేర్కొన్న పట్నం నరేంద్ర రెడ్డికి సైతం బెయిల్ మంజూరు కాగా.. ఏ2 గా సురేష్ కు ఇంకా బెయిల్ రాలేదు. దాడులకు ప్రజల్ని రెచ్చగొట్టింది. కలెక్టర్ కు మాయమాటలు చెప్పి గ్రామంలోకి తీసుకువెళ్లిన సురేష్.. బెయిల్ పిటిషన్ పై రేపు వాదనలు జరగనున్నాయి.
షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. 3నెలల వరకు పోలీసులు దర్యాప్తుకు సహకరించాలని సూచించింది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డికి రూ.50 వేల చొప్పున రెండు పూచికత్తులు, మిగతా వారికి రూ. 20 వేల ష్యూరిటీలు సమర్పించాలని సూచించిన కోర్టు.. వారి విడుదలకు ఆదేశాలు జారీ చేసింది.