⦿ ఫడ్నవీస్ అనే నేను..
⦿ మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం
⦿ డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్
⦿ ముంబైలో ఘనంగా ప్రమాణస్వీకారోత్సవం
⦿ ప్రధాని మోదీ, సీఎంలు చంద్రబాబు, యోగి హాజరు
ముంబై, స్వేచ్ఛ: Maharashtra New CM: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ముంబైలోని ప్రఖ్యాత ఆజాద్ మైదానంలో అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు. బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా విచ్చేశారు. మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.. ఫడ్నవీస్‌తో ప్రమాణం చేయించారు. దీంతో ఎమ్మెల్యేగా ఏకంగా ఆరుసార్లు విజయం సాధించిన ఫడ్నవీస్.. ముచ్చటగా మూడవసారి మహారాష్ట్ర పగ్గాలు చేపట్టారు.
డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఇద్దరూ ప్రమాణస్వీకారం చేశారు. ఫడ్నవీస్ అనంతరం వీరిద్దరితో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. నిజానికి డిప్యూటీ సీఎంగా ఏక్‌నాథ్ షిండే అంగీకరిస్తారా లేదా అనే సస్పెన్స్ చివరి వరకు కొనసాగింది. డిప్యూటీ సీఎంగా ఆయన సుముఖంగా లేరని కథనాలు వెలువడ్డాయి. అయితే శివసేన పార్టీ ఎమ్మెల్యేలు, శ్రేణుల ఒత్తిడి మేరకు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆయన నిర్ణయించారు. ఇదే విషయాన్ని తన పార్టీకి చెందిన సీనియర్ నేతలతో కబురు పంపించారు. ఆ తర్వాత అన్ని చకచకా జరిగిపోయాయి. ప్రభుత్వ నేతలుగా బాధ్యతలు స్వీకరించిన ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్‌లకు ప్రధాని మోదీ, ఇతర నేతలు అభినందనలు తెలిపారు