Siddique Arrested : ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిఖీ (Siddique) ఎట్టకేలకు లైంగిక వేధింపుల కేసులో అరెస్టయ్యాడు. నవంబర్ 19న ఆయనకు సుప్రీం కోర్ట్ మధ్యంతరం బెయిల్ మంజూరు చేసిన తర్వాత, సిద్ధిఖీ అరెస్టు కావడం అన్నది ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
కొన్నాళ్ల క్రితం మలయాళ ఇండస్ట్రీలో హేమా కమిటీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నివేదికలో భాగంగా ఇండస్ట్రీలో పెద్ద మనుషుల ముసుగులో అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్న చాలామంది ప్రముఖుల పర్లు బయట పడ్డాయి. అయితే ఇది జరుగుతుండగానే, మరోవైపు ప్రముఖ నటుడు సిద్ధిఖీ (Siddique) పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు కాగా, సిద్ధిక్ కొంతకాలం పరారీలో ఉన్నారు. ఆ తరువాత అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ మంజూరయ్యాక నవ్వుతూ మీడియాకు ఫోజులు ఇచ్చారు. ఇక అప్పటి నుంచి అరెస్ట్ ను ఏదో ఒక రకంగా తప్పించుకుంటూ వచ్చిన సిద్ధిఖీ, తాజాగా అరెస్టు అయినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరచబోతున్నారు. కానీ త్వరలోనే సిద్ధిఖీ మళ్లీ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో సిద్ధిఖీ (Siddique) వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కేరళ హైకోర్టు రిజెక్ట్ చేసింది. సుప్రీం కోర్టులో చివరి సెషన్లో ఈ విషయంపై ఎనిమిదేళ్లుగా మౌనంగా ఉన్నందుకు బాధితురాలిని ప్రశ్నించారు జడ్జి. ఆమె దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి బదులుగా, సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడంపై ధర్మాసనం మండిపడింది. జస్టిస్ బేలా ఎంత్రివేది నేతృత్వంలోని సెషన్ కోర్టు “మీకు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసే ధైర్యం ఉంది. కానీ పోలీస్ స్టేషన్ వెళ్ళే ధైర్యం మాత్రం లేదా?” అని మందులించింది. రేవతి తరపు న్యాయవాది మాట్లాడుతూ హేమ కమిటీ నివేదిక ఫలితాలు బయటకు వచ్చే వరకు నిజం బయట పడుతుందని, పోలీసులు తన కంప్లైంట్ ను వింటారనే నమ్మకం తనకు రాలేదని చెప్పుకొచ్చారు.
ఇక కొంతకాలం క్రితమే సిద్ధిఖీ (Siddique) తరపు న్యాయవాది రేవతిని ఆయన ఒకే ఒకసారి కలిశారని, కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో లైంగిక వేధింపులు ఎదురయ్యే ప్రశ్నే లేదని ఆయనను వెనకేసుకొచ్చారు. గతంలో సిద్ధిఖీ తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను కొట్టి పారేశారు. బాధితురాలితో తన మొదటి మీటింగ్ ఆమె తల్లిదండ్రుల సమక్షంలోనే జరిగిందని గుర్తు చేశారు. పైగా గడిచిన ఎనిమిదిన్నర ఏళ్లలో లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలేమి జరగలేదని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కేరళ పోలీసులకు ఆయన ఒక బహిరంగ లేఖని రాశారు. అందులో ఆమెను తాను ‘సుఖమయిరికట్టే’ అనే సినిమా ప్రివ్యూ స్క్రీనింగ్ రోజున మాత్రమే చూసానని, అది 2016 జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగిందని చెప్పుకొచ్చారు. అదేరోజు ఆమె తన తల్లిదండ్రుల సమక్షంలో తనతో మాట్లాడిందని, తనపై ఆమె చేసిన ఆరోపణల్లో నిజం లేదని వెల్లడించారు. మరిప్పుడు సిద్ధిఖీ విషయంలో కోర్టు ఏం తేలుస్తుంది? అనేది చూడాలి.