Mumbai Boat Accident : ముంబయి సముద్ర తీరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సరదా గా సముద్రంలో పర్యాటకులతో విహారానికి వెళ్లిన ఓ ఫెర్రీని భారత నేవీకి చెందిన స్పీడ్ బోట్ ఢీ కొట్టడంతో.. ఫెర్రీ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. ప్రమాద విషయం తెలియడంతో.. మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు నేవీ అధికారులు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు.
ముంబయిలోని ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ నుంచి ఎలిఫెంటా గుహలకు నీల్‌కమల్ అనే ఫెర్రీ.. దాదాపు 100 మందికి పైగా పర్యటకులతో బయలుదేరింది. బంగాళా ఖాతంలోని ఈ ఫెర్రీ ప్రయాణిస్తుండగా..సాయంత్రం 4 గంటల సమయంలో నేవీ స్పీట్ బోట్ ఢీ కొట్టింది. సముద్ర తీరంలో గస్తీ తిరిగే భారత నేవీ బోట్లు నిత్యం ఇక్కడ పహారా కాస్తుంటాయి. వాటిలో ఒకటి.. వేగంగా వచ్చి ప్రయాణికుల బోట్ ను ఢీ కొట్టింది. దాంతో.. ఫెర్రీ తీవ్రంగా దెబ్బతినడంతో, సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా.. 101 మందిని సహాయక బృందాలు కాపాడాయి. అయితే.. ఈ ఘటన సమయంలో ఫెర్రీతో పాటు నేవీ బోటులో ఎంత మంది ఉన్నారనే విషయంపై స్పష్టత లేదు.
ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే రెస్క్యూ బృందాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. 11 నేవీ పడవలతో సహా తీర ప్రాంత దళాలకు చెందిన మూడు పడవలు, నాలుగు హెలికాప్టర్లు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. పోర్టు అధికారులు, కోస్ట్‌గార్డ్, మత్స్యకారులు సహాయక చర్యల్లో పాల్గొని 101 మంది ప్రయాణికుల్ని, నేవీ సిబ్బందిని కాపాడి.. ఒడ్డుకు చేర్చారు.
ప్రమాద ఘటనపై స్పందించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనలో 13 మంది మృత దేహాల్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన సీఎం.. మృతుల్లో 10 మంది పర్యటకులు, ముగ్గురు నేవీ సిబ్బంది ఉన్నట్లు ప్రకటించారు.
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన బోటు.. నేవీదా లేక కోస్టు గార్డుకు చెందినదా అనేది తెలియాల్సి ఉందని, స్పీడుపై నియంత్రణ తప్పడంతో ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నట్లు తెలిపారు.