Washing Machine : బట్టలు ఉతుకుతున్న వాషింగ్ మషీన్ ను చూస్తుంటే… మనుషులకు కూడా ఒక వాషింగ్ మషీన్ ఉంటే ఎంత బాగుండని అనిపిస్తుంది కదూ! అదే సమయంలో భయం కూడా వేస్తుంది. అమ్మో… ఇంత వేగంగా గిరగిరా తిప్పేస్తే ఇంకేమైనా ఉందా? బట్టలను పిండినట్లు మడతపెడితే… అది తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది కదా? కానీ అలాంటి భయాలేమీ అక్కర్లేదంటోంది జపనీస్ కంపెనీ సైన్స్ కో లిమిటెడ్. ఎందుకంటే ఒసాకాకు చెందిన ఈ కంపెనీ మనుషులను ఉతికేసే వాషింగ్ మషీన్ ని తయారుచేస్తోంది.
ఫైన్ బబుల్ టెక్నాలజీతోపాటు పలు సెన్సార్లు, కృత్రిమ మేథస్సు ఆధారంగా దీన్ని రూపొందిస్తోంది. ఒక్కసారి ఆ మషీన్ లోకి దూరి కూర్చుంటే… మషీన్ లో ఉన్న సెన్సార్లు పనిచేయడం ప్రారంభిస్తాయి. ఇవన్నీ మనిషి శరీరాన్ని ఎంతో నాజుగ్గా శుభ్రం చేస్తాయి. మసాజ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఒకవైపు మనసుకు హాయిగొలిపే సంగీతం వినిపిస్తుంది. మరోవైపు వాటర్ రెసిస్టెంట్ డిస్ ప్లేలో వాషింగ్ మషీన్ లో ఉన్న మనిషి ఫొటోలను చూపిస్తుంది. ఒళ్లంతా సబ్బుతో సుతిమెత్తగా రుద్దుతుంటే హాయి హాయిగా అంటూ కూనిరాగం తీస్తూ… స్నానం పూర్తి చేసేయొచ్చు. స్నానం అంటే ఏదో నీళ్లు కుమ్మరించేస్తుందని అనుకోవద్దు. ఎందుకంటే ఒంటికి అంటిన ఇంక్ లాంటి మరకలు, టాటూలకు గుర్తులను చెరిపేసే టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. అన్నట్లు దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు. 15 నిమిషాలు చాలంటున్నారు సైన్స్ కో లిమిటెడ్ కంపెనీదారులు.
నిజానికి మనుషులను ఉతికేసే వాషింగ్ మషీన్ కు రూపకల్పన చేయాలనే ఐడియా కొత్తదేమీ కాదు. ఎప్పుడో 1970లోనే జపనీస్ ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ సాన్యో ఎలక్ట్రిక్ అల్ట్రాసోనిక్ బాత్ పరికరాన్ని రూపొందించింది. ఇది స్నానం చేయించడంతోపాటు మసాజ్ చేసింది. స్నానం తర్వాత తువాలుతో తుడుచుకునే పనిలేకుండా ఆరబెట్టేది. అయితే అప్పట్లో దాని పనితీరుపై సందేహాలు వ్యక్తం కావడంతో అది మార్కెట్లోకి రాకుండానే తెరమరుగైంది. దీన్ని బేస్ చేసుకుని సైన్స్ కో లిమిటెడ్ కంపెనీ ఛైర్మన్ యసాకీ అయోమా లేటెస్ట్ టెక్నాలజీతో ఈ కొత్తతరం పరికరాన్ని తయారు చేసే పనిలో పడ్డారు. అయితే ఈ మనీష్ తో స్నానం చేయాలంటే మాత్రం 2025 దాకా ఆగక తప్పదు.