Big Stories

DRY SHAMPOO EFFECTS : డ్రై షాంపూల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయా?

క్యాన్సర్ కారకాలు ఉన్నాయనే కారణంతో కొన్ని డ్రై షాంపూ బ్రాండులను అమెరికా మార్కెట్ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు యూనిలీవర్ సంస్థ ప్రకటించింది. మార్కెట్‌లో ఆ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేసింది. భారత్‌లో ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హిందుస్తాన్ యూనిలీవర్ కు
మాతృసంస్థ యూనిలీవర్. సబ్బులు, షాంపూలు, రకరకాల బ్యూటీ, పర్సనల్ కేర్ ఉత్పత్తుల్ని తయారు చేసే అతి పెద్ద కంపెనీ ఇది. యూనిలీవర్ నిలిపివేసిన డ్రై షాంపుల్లో డవ్, ట్రెసిమే, నెక్సెస్ లాంటి పాపులర్ బ్రాండ్లు ఉన్నాయి. క్యాన్సర్ కారకం బెంజీన్ ఈ డ్రై షాంపూలలో ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. భారత్‌లో ఆ బ్రాండ్ డ్రై షాంపూల అమ్మకాలు లేవని హిందుస్తాన్ యూనిలీవర్ ప్రకటించింది. కానీ అమెజాన్ వంటి ఆన్‌లైన్ పోర్టల్స్‌లో అందుబాటులో ఉన్నాయని బిజినెస్ ఇండియా కథనాన్ని ప్రచురించింది. డవ్ డ్రై షాంపూ, ఫ్రెష్ కోకొనట్, డవ్ డ్రై షాంపూ స్ప్రే, ఫ్రెష్ అండ్ ఫ్లోరల్ లాంటి బ్రాండ్లు అమెజాన్‌లో అమ్మకానికి ఉన్నాయని వెల్లడించింది. బెంగళూరులోని యునైటెడ్ డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీ అమెరికా నుంచి వాటిని దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది.

- Advertisement -

రెగ్యులర్‌గా వాడే షాంపూలకు, డ్రై షాంపూలకు తేడా ఉంటుంది. మామూలుగా తడి తల మీద షాంపు రుద్దుకుంటాం. కానీ తలను తడపకుండానే జుట్టు ఫ్రెష్‌గా కనిపించడానికి డ్రై షాంపూలను ఉపయోగిస్తారు. ముఖ్యంగా వ్యాయామం తర్వాత తడిగా మారిన తలను పొడిగా చేయడానికి, జుట్టు బౌన్సీగా ఒత్తుగా కనపడేందుకు డ్రై షాంపూను వాడతారు. అమెరికా, యూరప్ దేశాలలో ఈ షాంపూల వినియోగం చాలా ఎక్కువ. ఇప్పుడు భారత్‌లోనూ డ్రై షాంపూ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. క్యాన్సర్ భయాలెందుకంటే.. ఈ షాంపూలో బెంజీన్ అనే రసాయనం ఉంటుంది. సాధారణంగా మనం రోజూ వాడే ప్లాస్టిక్, రబ్బర్లు, హెయిర్ డై, డిటర్జెంట్లు, మందులు, రసాయనాల తయారీలో బెంజీన్ ఉపయోగిస్తారు.డ్రై షాంపూలను జుట్టు పై స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఆ స్ప్రే నుంచి వెలువడే తుంపర్లు శ్వాస ద్వారా శరీరం లోపలకు పోతాయి. బెంజీన్ వల్ల శరీరంలోని ఎర్ర రక్త కణాలు తగ్గిపోతాయి. శరీరంలో బెంజీన్ ఎక్కువగా చేరితే లుకేమియా, బ్లడ్ కాన్సర్, బోన్ మారో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇతర దీర్ఘకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకటించింది.

- Advertisement -

డ్రై షాంపూల్లో, ఇతర సౌందర్య ఉత్పత్తులలో బెంజీన్‌ను అధిక మోతాదులో వినియోగించడం దురదృష్టకరమని అమెరికాలోని వాలిష్యుర్ లేబోరేటరీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ అన్నారు. మరికొన్ని ప్రొడక్టులను కూడా పరిశీలిస్తామని తెలిపారు. యునిలీవర్‌కు చెందిన కొన్ని డ్రై షాంపుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని వాలిష్యుర్ లేబోరేటరీ పరిశోధనలో తేలింది. గతంలో కొన్ని బ్యూటీ, పర్సనల్ కేర్ ప్రొడక్ట్‌లను కంపెనీలు వెనక్కి తీసుకున్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ 2023 నుంచి ప్రపంచవ్యాప్తంగా తమ టాల్కం పౌడర్ అమ్మకాలు నిలిపివేస్తున్నామని ఇప్పటికే ప్రకటించింది. అమెరికా, కెనడాలో 2020 నుంచే అమ్మకాలు ఆపేసింది. దీనికి కారణం కూడా ఆ పౌడర్‌లో కాన్సర్ కారకాలుండటమే. గతేడాది పీ అండ్ జీ కంపెనీ కూడా ఇవే కారణాలతో 30కి పైగా పర్సనల్ కేర్ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News