Shock to Jeff Bezos : అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఓవైపు… చరిత్రలో ఎన్నడూ ఓ సంపన్నుడు ఓ ఏడాదిలో కోల్పోని సంపదని కోల్పోయాడు… జెఫ్ బెజోస్. మరోవైపు థర్డ్ క్వార్టర్లో అమెజాన్ ఆదాయం ఆశించినంత మేర లేకపోవడంతో… అమెరికా స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ షేరు విలువ భారీగా పతనమైంది.
బ్లూమ్‌బెర్గ్ వెల్త్ ఇండెక్స్ ప్రకారం… బెజోస్ భారీ మొత్తంలో సంపద కోల్పోయారు. వరుస సెలవుల కారణంగా షాపింగ్ జోరుగా సాగుతున్నా… అమెజాన్ సేల్స్ తగ్గిపోవడం, థర్డ్ క్వార్టర్ ఫలితాలు ఆశించిన మేర లేకపోవడంతో… గురువారం ఒక్కరోజే కంపెనీ షేరు విలువ 13 శాతం పడిపోయింది. దాంతో… జెఫ్ బెజోస్ ఒక్కరోజే 23 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. ఈ ఏడాది మొత్తమ్మీద జెఫ్ బెజోస్ సంపద ఏకంగా 58 బిలియన్ డాలర్లకు పైగా కరిగిపోయింది. చరిత్రలో ఒక ఏడాదిలో మరే సంపన్నుడి సంపదా ఈ రేంజ్ లో తగ్గిపోలేదు. గతంలో మార్క్ జుకర్‌బర్గ్, ఎలాన్ మస్క్, చాంగ్‌పెంగ్ జావో భారీగా సంపద కోల్పోయినా… ఇంత భారీగా కాదు.
మరోవైపు… ఆదాయం ఆశించిన మేర లేకపోవడంతో… నియామకాలను కూడా తగ్గించుకోవాలని అమెజాన్ నిర్ణయించింది. అమ్మకాల్లో క్షీణత, మాంద్యం భయాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక ఉద్యోగులు ఉన్న కంపెనీల జాబితాలో అమెజాన్ రెండో స్థానంలో ఉంది. అన్ని దేశాల్లో కలిపి అమెజాన్ కు 15 లక్షల 23 వేల మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు.