New one is Better: ట్విట్టర్ కొన్నది మొదలు ఎలాన్ మస్క్ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోతున్న యూజర్లు… ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. వెరిఫైడ్ యూజర్లకు ఇప్పటికే నెలకు 8 డాలర్లు వసూలు చేస్తానన్న మస్క్… త్వరలో యూజర్లందరికీ నెలవారీ ఛార్జీలు విధించవచ్చన్న ప్రచారం ప్రారంభం కావడంతో… ఇతర సోషల్ మీడియా యాప్స్ కోసం వెతుకుతున్నారు. దాంతో… లక్షల కొద్దీ కొత్త యూజర్లతో ట్విట్టర్ ప్రత్యర్థులు పండుగ చేసుకుంటున్నారు.
మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ మాస్టోడాన్ దాదాపు ట్విట్టర్ లాగే పనిచేస్తుంది. యూజెన్ రోచ్కోచే అనే వ్యక్తి 2016లో దీన్ని స్థాపించారు. ద్వేష పూరిత ప్రసంగాలను, పోస్ట్‌లను నియంత్రిస్తూ… ఉచితంగా సేవలందిస్తోంది… మాస్టోడాన్. ట్విటర్ మస్క్ చేతుల్లోకి వెళ్లాక నెలకొన్న గందరగోళం నేపథ్యంలో… జర్నలిస్టులు, నటులు, ఇతర సెలబ్రిటీలు మాస్టోడాన్‌కి భారీగా షిప్ట్ అవుతున్నట్లు చెబుతున్నారు. మాస్టోడాన్ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన యూజెన్ ట్వీట్ ప్రకారం… ఈ ప్లాట్‌ఫామ్‌లో అంతకుముందెన్నడూ లేని విధంగా యూజర్లు పెరిగారు. అక్టోబర్ 27న మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేయకముందు మాస్టోడాన్‌కు 6,55,000 మంది నెలవారీ వినియోగ దారులుండగా, మస్క్ ట్విట్టర్ కొన్న వారానికే 2,30,000 మందికి పైగా కొత్త యూజర్లు మాస్టోడాన్‌కు జతయ్యారు.
ఇక… ట్విటర్ ఫౌండర్, మాజీ సీఈవో జాక్ డోర్సే వారం కిందట లాంచ్ చేసిన బ్లాక్‌చెయిన్ ఆధారిత కొత్త సోషల్ మీడియా బ్లూ స్కైలో… 2 రోజుల్లోనే 30,000 మందికి పైగా సైన్ అప్ అయ్యారు. భారత్ కు చెందిన బహుళ-భాషా మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ‘కూ’ యాప్ కూడా ఇటీవల 50 మిలియన్ల డౌన్‌లోడ్‌లను దాటేసింది. ఈ ఏడాది జనవరి నుంచి వినియోగదారులు, గడిపిన సమయం, ఎంగేజ్మెంట్‌లో ‘కూ’ భారీ వృద్ధిని సాధించింది. 2020లో ప్రారంభమైన ‘కూ’ యాప్…10 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. దేశంలో దాదాపు అన్ని ప్రభుత్వరంగ శాఖలు, ఉన్నతాధికారులు, ప్రభుత్వోద్యోగులు ‘కూ’ యాప్ యూజర్లుగా ఉండటం విశేషం.