SBI : ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ SBI.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెకండ్ క్వార్టర్లో సరికొత్త రికార్డును సృష్టించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్ క్వార్టర్లో రూ. 14,572 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది బ్యాంక్ చరిత్రలోనే అత్యధికం కాగా… సెకండ్ క్వార్టర్లో దేశీ కార్పొరేట్ చరిత్రలోనే అత్యధిక లాభంగా రికార్డు సృష్టించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సాధించిన రూ. 13,656 కోట్ల లాభాన్ని, HDFC ఆర్జించిన రూ.11,125 కోట్ల రాబడిని అధిగమించి… SBI సరికొత్త రికార్డు నెలకొల్పింది.
నిరుడు ఇదే క్వార్టర్లో ఆర్జించిన రూ. 8,890 కోట్లతో పోలిస్తే… SBI లాభం ఏకంగా 74 శాతం పెరిగి రూ.13,265 కోట్లకు చేరింది. రుణాల మంజూరు, వడ్డీ ఆదాయంలో వృద్ధితో పాటు ప్రొవిజన్లు తగ్గడం బ్యాంక్ కు కలిసొచ్చింది. సెకండ్ క్వార్టర్లో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.1,01,143 కోట్ల నుంచి రూ.1,14,782 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 13 శాతం పెరిగి రూ. 35,183 కోట్లకు చేరింది. దేశీ నికర వడ్డీ మార్జిన్లు స్వల్పంగా బలపడి 3.55 శాతానికి చేరాయి. స్థూల మొండిబకాయిలు… అంటే NPAలు 4.9 శాతం నుంచి 3.52 శాతానికి, నికర NPAలు 1.52 శాతం నుంచి 0.80 శాతానికి దిగి రావడం… మొండి రుణాలకు ప్రొవిజన్లు రూ.2,699 కోట్ల నుంచి తగ్గి రూ. 2,011 కోట్లకు పరిమితమవడం SBIకి బాగా కలిసొచ్చింది. అందుకే బ్యాంక్ చరిత్రలోనే ఒక క్వార్టర్లో రికార్డు స్థాయి లాభాలను ఆర్జించి… ప్రైవేట్ దిగ్గజ కంపెనీలకు కూడా షాకిచ్చింది… SBI.