రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా.. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు పరిశ్రమలు ముందుకు వచ్చాయి. తెలంగాణ రైజింగ్ సదస్సులో.. వీటిని ప్రకటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు 14 కంపెనీలు ముందుకు వచ్చాయి.
మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిన్నెల్లి సోదరులపై 16 కేసులు పెట్టారని జగన్ చెప్పారు. ఇలా అక్రమ కేసులు పెడితేనే నక్సలైట్లు పుడతారని కామెంట్ చేశారు. విశాఖలో మా పార్టీకి చెందిన విద్యార్థి నేతను.. గంజాయి కేసులో ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్.
తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం తీరుపై కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని బీజేపీ నిన్న గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించినా, కీలక నేతలు స్పందించకపోవడంపై గాంధీభవన్‌లో చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సాధారణంగా చెప్పిన వ్యాఖ్యలను కాంట్రవర్సీ.. చేయాలని చూస్తున్నా నేతలు ఎందుకు స్పందించడం లేదని కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో 6వ వార్డు మెంబర్ అభ్యర్థి భర్త శ్రీకాంత్ వినూత్న ప్రచారం చేపట్టారు. తన భార్య శివానిని వార్డు మెంబర్‌గా గెలిపిస్తే, ఆ ఐదేళ్ల పాటు వార్డు ప్రజలకు ఉచితంగా కటింగ్, షేవింగ్ సేవలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ హామీ స్థానికంగా చర్చనీయాంశమైంది.
కర్నూలు జిల్లా పెద్దతుంబ్లం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. తమ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, గ్రామస్తులు, వ్యాపారులు భారీ ఎత్తున రోడ్డెక్కారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో పాటు, స్వచ్ఛందంగా షాపులు మూసేసి నిరసన తెలిపారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది. తమ డిమాండ్‌ను ప్రభుత్వం నెరవేర్చాలని వారు నినాదాలు చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా ఆమడగూరు మండలం మహమ్మదాబాద్‌లో చైన్ స్నాచింగ్ జరిగింది. టిఫిన్ తీసుకొని వెళ్తున్న వృద్ధురాలిని మాటల్లో పెట్టి బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని బంగారు చైన్‌ను లాక్కెళ్లారు. వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు వెంబడించిన దుండగులు తప్పించుకుని పారిపోయారు. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో ఎన్నికల వేళ ఓ వినూత్న దృశ్యం కనిపించింది. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి వనపర్తి రామారావు గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్, సీపీఐ, టీడీపీ నాయకులు ఒకే వేదికపై కలసి నామినేషన్ వేశారు. గ్రామాభివృద్ధి కోసం పార్టీ భేదాలు పక్కనపెట్టి ఏకమయ్యామని నేతలు ప్రకటించారు. నాలుగు పార్టీల జెండాలతో సాగిన ఈ అరుదైన ప్రచారం గ్రామస్తుల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
అమరావతి మండలం యండ్రాయి గ్రామంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్‌పై మంత్రి నారాయణ, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ రైతులతో భేటీ అయ్యారు. రైతుల కోరిక మేరకే క్యాబినెట్ ల్యాండ్ పూలింగ్‌కు ఆమోదం తెలిపిందని మంత్రి అన్నారు. రైల్వే లైన్, రింగ్ రోడ్ల కోసం ఇది అవసరమని, 90% మంది రైతులు సానుకూలంగా ఉన్నారని, ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యేల దృష్టికి తేవాలని మంత్రి సూచించారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం ప్రముఖ పుణ్యక్షేత్రం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం మహా పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. వందలాది మంది హనుమాన్ మాలదారులు ఇరుముడులు సమర్పించి, రామ భజనలు చేశారు. తెల్లవారుజాము నుండే భక్తులు స్వామి దర్శనానికి బారులు తీరారు. అనంతరం ఆలయ అధికారులు భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో రోడ్ల వెడల్పు కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ మురళీ శ్రీకారం చుట్టారు. రోడ్లు ఇరుకుగా ఉండటం వలన వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఈ చర్యలు చేపట్టామని తెలిపారు. రోడ్డుకి ఇరుపక్కల ఉన్న చిరు వ్యాపారుల షెడ్లను తొలగించే క్రమంలో నోటీసులు ఇవ్వకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ మున్సిపల్ సిబ్బందితో వ్యాపారులు వాగ్వాదానికి దిగారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సొంత నిధులతో నగరవనం పార్క్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 380 ఎకరాల్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనులతో నడక మార్గాలు, వ్యాయామ ఏర్పాట్లు, ట్రెక్కింగ్ ప్లేస్ వంటి సౌకర్యాలు కల్పిస్తారు. ఇది జిల్లాలోనే ప్రత్యేక ఆకర్షణగా, ప్రజలకు విశ్రాంతికి అద్భుత వేదికగా మారుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తో నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతంలో ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రంతా కుండపోత వర్షం కురవడంతో అనేక తీర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది
పంచాయతీ ఎన్నికల నిర్వహణలో మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ సింగ్ తీరుపై స్థానిక ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినా జాబితా విడుదల చేయకపోవడం, మీడియాకు సమాచారం ఇవ్వడానికి నిరాకరించడంపై వారు మండిపడ్డారు. కలెక్టర్ అత్యుత్సాహంపై స్థానిక ప్రజా ప్రతినిధులు సీఎస్‌కు ఫిర్యాదు చేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం వీఐపీ బ్రేక్ సమయంలో సినీ ప్రముఖులు సంగీత దర్శకుడు థమన్, యాంకర్ ఓంకార్, నటుడు అశ్విన్ బాబులు దర్శించుకున్నారు. అలాగే ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీనివాస్, ఏపీ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామిలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
హిడ్మా ఎన్కౌంటర్‌పై మావోయిస్టులు మరో లేఖ విడుదల చేశారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరిట ప్రకటన వచ్చింది. హిడ్మా, శంకర్లను ఎన్కౌంటర్ చేయలేదు… ఇది పూర్తిగా భూటకపు హత్య అని ఆరోపించారు. పట్టుకుని వారం రోజులు చిత్రహింసలు పెట్టి చంపేశారని లేఖలో ఆరోపించారు. ఏపీకి చెందిన కలప వ్యాపారుల ద్రోహంతో పట్టుబడ్డారని అందులో ఉంది.
ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు DGCA సమన్లు జారీ చేసింది. విమానాల రద్దు, ఆలస్యంపై DGCA వివరణ కోరింది. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ నుంచి 30కి పైగా, హైదరాబాద్‌లో 33 విమానాలు రద్దు అయ్యాయి. వింటర్ షెడ్యూల్ మార్పులు, వాతావరణం, సాంకేతిక లోపాలే కారణంగా చూపిస్తున్నారు. కొత్త FDTL నిబంధనలతో పైలట్ల కొరత తీవ్రతరమైనట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి హెచ్1బీ వీసా జారీపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని నెలల క్రితం హెచ్-1బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచిన ట్రంప్ యంత్రాంగం.. తాజాగా వెట్టింగ్ నిబంధనలు మరింత కఠినతరం చేసింది. ఆ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారి లింక్డిన్ పేజీలు, రెజ్యూమోలను సమీక్షించాలని దౌత్యవేత్తలకు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆదేశాలు ఇచ్చింది.
ఫీల్డ్ మార్షల్ జనరల్ ఆసిమ్ మునీర్ విధానాలు దేశానికి వినాశకరమైనవని పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఆఫ్ఘనిస్తాన్‌తో ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలు పెంచుతున్నారని, ఉగ్రవాదం అదుపు తప్పి పెరిగిపోతోందని ఆయన విమర్శించారు. జైలులో తన సోదరిని కలిసిన మరుసటి రోజు ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
త్రిగుణ్, హెబ్బాపటేల్ కీలక పాత్రల్లో రూపొందిన హారర్ థిల్లర్ మూవీ ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో ఈ మూవీ రూపోందుతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈమూవీ డిసెంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేశారు.
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20, టెస్ట్ క్రికెట్‌కు తమ రిటైర్మెంట్లను ప్రకటించారు. ప్రస్తుతం వారు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. వీరు వన్డే వరల్డ్ కప్ 2027లో ఆడాలని న్యూజిలాండ్ క్రికెటర్ టిమ్ సౌథీ అభిప్రాయం వ్యక్తం చేశారు. వారు బాగా ఆడినంత కాలం జట్టులో కొనసాగాల్సిందే, వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని సౌథీ పేర్కొన్నాడు.