డాక్టర్ బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, భారత రాజ్యాంగ నిర్మాత సేవలను స్మరించుకున్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్క్‌లో నాటు తుపాకులతో జింకలను వేటాడి చంపిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్ద్ విక్రమ్ సింగ్ తెలిపారు. సత్తుపల్లి అటవీ శాఖ రేంజ్ పరిధిలో గత నెల 24 న అశ్వరావు పేట మాజీ ప్రజాప్రతినిధి మెచ్చా నాగేశ్వరరావు అన్న కొడుకు మెచ్చా రఘు, అతని స్నేహితులు అటవీ శాఖ ఔట్‌సోర్స్ ఉద్యోగి గోపికృష్ణ సహకారంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు.
మంత్రి సీతక్క స్వగ్రామంలో సర్పంచ్ పదవి ఏకగ్రీవం అయ్యింది. సీతక్క స్వగ్రామం ములుగు జిల్లాలోని జగ్గన్నపేట గ్రామానికి సర్పంచ్‌గా అర్రెం వెంకన్న నియమితులయ్యారు. ఎన్నికల్లో పోటాపోటీ ఖర్చులు లేకుండా ఏకగ్రీవం చేయడం పట్ల గ్రామ పెద్దలను అభినందించారు సీతక్క. పార్టీలకు అతీతంగా గ్రామ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సర్పంచ్‌కు సూచించారు.
శ్రీశైలం స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా శివ దీక్ష తీసుకున్న ఆయన, నేడు ఇరుముడితో శ్రీశైలం విచ్చేసి దీక్ష విరమణ చేశారు. ఆలయ రాజగోపురం వద్ద అధికారులు, అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
వైద్య పరంగా ఆపదలో ఉన్నవారు ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు చీరాల ఎమ్మెల్యే కొండయ్య. చీరాల టీడీపీ కార్యాలయంలో 87 మంది లబ్ధిదారులకు 73 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. పేదలకు మేలు చేయాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు ఈ నిధులను అందిస్తున్నారని తెలిపారు ఎమ్మెల్యే కొండయ్య.
రంగారెడ్డి జిల్లా, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్ మంద మల్లమ్మ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతున్న ఓ వృద్ధుడిని పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ ట్యాంకర్‌ను వదిలి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సవిత పాల్గొని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం అంబేద్కర్ కూడలిలోని టీస్టాల్‌లో వ్యాపారి నిసార్‌తో మాట్లాడి, రోజువారీ వ్యాపార వివరాలు తెలుసుకున్నారు.
పవర్ గ్రిడ్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ JC ప్రభాకర్ రెడ్డి. రైతు ఆత్మహత్యాయత్నంపై సీరియస్ అయ్యారు. పవర్ గ్రిడ్ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, వెంటనే వీడనాడాలని సూచించారు. రైతులకు న్యాయం చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈనెల 15న వచ్చి అనంతపురం జిల్లాలో జరిగే పవర్ గ్రిడ్ పనులు అడ్డుకుంటామని హెచ్చరించారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
సికింద్రాబాద్ బోయిన్‌పల్లి మార్కెట్ యార్డులో షాప్ నెంబర్ MBT, B56 వద్ద భారీ చోరీ జరిగింది. దుండగులు సుమారు 2 లక్షల నగదును అపహరించినట్లు యజమాని గుర్తించారు. ఈ ఘటనపై తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సీఎం సహాయ నిధి పేదలకు ఒక వరమని అన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో 55 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల నిమిత్తం 50 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు మంత్రి మండిపల్లి.
ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. ఓ మహిళతో వివాహేతర సంబంధం కారణంగా చిచ్చు రగులుతోంది. ఈ నేపథ్యంలోనే నాగరాజు అనే వ్యక్తిని కత్తులతో నరికి చంపిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి ప్రతీకారంగా నిందితుల ఇళ్లను, వాహనాలను తగులబెట్టారు దుండగులు. ఇంటి ఫర్నీచర్‌ను కూడా బయటవేసి ధ్వంసం చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
గుంటూరులో జరిగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. దేశంలో రాజ్యాంగాన్ని అమలు పరిచే విధంగా.. నేడు ప్రతి ఒక్కరికీ ఫలాలు అందడంలో అంబేద్కర్ కృషి ఎనలేనిదని ఆయన కొనియాడారు. అనంతరం బీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలు సమీపంలోని బుడమేరు కాలువలో యువకుడి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన వ్యక్తి కొండపల్లికి చెందిన షేక్ రఫీగా గుర్తించారు పోలీసులు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
విజయనగరం జిల్లా రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో జీఎంఆర్ఐటీ కళాశాలలో స్కిల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ సహకారంతో మెగా జాబ్‌మేళా జరిగింది. సుమారు 40 కంపెనీలు పాల్గొన్న ఈ మేళాలో 3వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. యువత నైపుణ్యాలను మెరుగుపరుచుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్రలో 5 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రణాళికలు రూపొందించారని ఎమ్మెల్యే సూచించారు.
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని భవానీపురం 42 ప్లాట్ల బాధితులు కలిశారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించగా, ఎమ్మెల్యే వారిని న్యాయ నిపుణులతో మాట్లాడించారు. న్యాయ పోరాటంపై న్యాయవాదుల బృందం చర్చించింది. ఈ వ్యవహారంపై అధికారులతో సుజనా చౌదరి మాట్లాడారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉండి, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే సుజనా చౌదరి.
ఇండియా – సౌతాఫ్రికా మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనే క్రికెట్ అభిమానుల ఆశను కొందరు దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. బ్లాక్ మార్కెట్‌లో టికెట్ల దందా విచ్చలవిడిగా నిర్వహించేందుకు ప్రయత్నించారు. అధికారికంగా 3 వేలు ఉన్న టికెట్‌ను 8 వేలకు అమ్ముతున్నారని పలువురు క్రికెట్ అభిమానులు ఆరోపిస్తున్నారు. బ్లాక్ టికెట్ల దందాను అరికట్టాలని అభిమానులు కోరుతున్నారు.
దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూను దూషించడమే కేంద్రంలోని అధికారపక్షం ప్రధాన లక్ష్యమనని ఆరోపించారు కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ. నెహ్రూ ఘనతలను తుడిచేయడమే కాకుండా ఆయనకు సంబంధించిన సామాజిక, రాజకీయ పునాదులను నాశనం చేయాలని చూస్తోందన్నారు. అయితే ఆమె ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. అంత గౌరవమే ఉంటే.. నెహ్రూ ఇంటి పేరును ఆమె ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఫిఫా శాంతి బహుమతిని ప్రకటిస్తున్నట్లు తెలిపారు ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినో. 2026లో జరగనున్న ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీలకు సంబంధించి వాషింగ్టన్ డీసీలోని కెన్నడీ సెంటర్‌లో డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరించారు. దీనికి ట్రంప్ హజరయ్యారు.
టీమిండియా ప్లేయర్లకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు హైదరాబాద్ స్పీడ్ స్టార్ మహమ్మద్ సిరాజ్. హైదరాబాద్‌లో ఉన్న తన రెస్టారెంట్‌కు మహమ్మద్ షమీతో పాటు ఇతర టీమిండియా క్రికెటర్లను ఆహ్వానించాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ బిర్యానీతో పాటు, తన రెస్టారెంట్ లో ఉన్న స్పెషల్ ఐటమ్స్ వాళ్లతో తినిపించాడు సిరాజ్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్ లో మ్యాచ్‌లు జరుగుతున్నాయి.
అఖండ 2 విడుదలకు సంబంధించి నిర్మాణ సంస్థ అప్‌డేట్ ఇచ్చింది. కొత్త విడుదల తేదీ వివరాలను అతి త్వరలోనే ప్రకటిస్తామని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. అఖండ 2 విడుదల కోసం శాయశక్తులా కృషి చేశామని…అయితే ఎంత ప్రయత్నం చేసినా సాధ్యపడలేదని తెలిపింది.