E-Paper
Advertisement

Top 20 News: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఈటెల కామెంట్స్, ఎన్టీఆర్ జిల్లాలో ట్రాక్టర్ బీభత్సం..

Top 20 News: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఈటెల కామెంట్స్, ఎన్టీఆర్ జిల్లాలో ట్రాక్టర్ బీభత్సం..

1. ఉప్పల్ స్టేడియం వద్ద బందోబస్తు

ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ రాక సందర్భంగా ఉప్పల్ స్టేడియం వద్ద బందోబస్తును సమీక్షించారు డీజీపీ శివధర్ రెడ్డి. కోల్‌కత్తా ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు, ఎలాంటి లోపాలు జరగకుండా భద్రతను పటిష్టం చేశామని డీజీపీ తెలిపారు. అభిమానులు గ్రౌండ్‌లోకి చొచ్చుకుపోకుండా నిరోధించడానికి మొత్తం 20 రోప్ పార్టీలను ఏర్పాటు చేశామన్నారు.

2. ఫ్యాన్స్ ఫైర్

అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ లియోనల్ మెస్సీ కోల్‌కతాలోని సాల్ట్‌ లేక్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్ నుంచి త్వరగా వెళ్లిపోవడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్సీ పూర్తి మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోవడంపై స్టేడియంలో గందరగోళం చెలరేగింది.

3. 5 కిలోల గంజాయి స్వాధీనం

హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ ఆధ్వర్యంలో H-NEW టీమ్, టాస్క్ ఫోర్స్, లంగర్ హౌస్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. అంతర్రాష్ట్ర హాష్ ఆయిల్ నిందితుడితో సహా ఐదుగురిని అరెస్ట్ చేశామని టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ తెలిపారు. వీరి నుంచి 5 కిలోల హాష్ ఆయిల్, 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

4. సర్పంచ్ ఎన్నికల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

నిజామాబాద్ జిల్లా వల్లభాపూర్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. పట్టణ జీవితాన్ని వదిలి.. తన గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా బరిలో నిలిచారు ఎడ్ల చిన్నయ్య. ఉన్నత చదువులు చదివి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ సంస్థను స్థాపించారు చిన్నయ్య. తాను పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేయాలని.. ఆకాంక్షతో ఉన్నానన్నారు చిన్నయ్య. తాను సర్పంచ్‌గా గెలిస్తే.. గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని హామీ ఇచ్చారు చిన్నయ్య. మాక్లూర్ మండలంలోనే వల్లభాపూర్‌ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చుదిద్దుతానన్నారు.

5. రహదారిపై కాపు కాసి సర్పంచ్ పై కర్రలు, రాళ్లతో దాడి

ఖమ్మం జిల్లా లం మల్లారం సర్పంచ్ పూనెం రమేష్ గెలుపును జీర్ణించుకోలేని స్వతంత్ర అభ్యర్థి మడకం మంజు భార్గవి కుటుంబీకులు కక్షగట్టి దాడి చేశారని రమేష్ ఆరోపించారు. తమను చంపుతామని బెదిరిస్తూ, రహదారిపై కాపు కాసి కర్రలు, రాళ్లతో దాడి చేసి కార్యకర్తల తలలు పగలగొట్టారని తెలిపారు. తమకు ప్రాణహాని ఉందని, రౌడీయిజం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

6. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఈటెల కామెంట్స్

హుజురాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పారని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాయన్నారు. పేదల ఇళ్లను కూలుస్తూ, సింగరేణి డబ్బులతో అనవసర ఖర్చులు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. దోపిడీ ఆరోపణలున్న బీఆర్‌ఎస్ నేతలపై చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించారు. స్వంత ఊరు కమలాపూర్‌లో తనను అణగదొక్కాలని చూసినా, ప్రజలు తన అభ్యర్థులను గెలిపించారని ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

7. కుటుంబానికి అండగా స్నేహితులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శాత్రాజ్ పల్లిలో ఇటీవల గుండెపోటుతో మరణించిన వనపర్తి మహేందర్ కుటుంబానికి చిన్ననాటి స్నేహితులు బాసటగా నిలిచారు. మహేందర్ కూతురు శ్రీనిధి భవిష్యత్తు కోసం స్నేహితులు, గ్రామస్తులు 2 లక్షల రూపాయల నగదును పోగు చేసి, ఆమె పేరుపై ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి మృతుని భార్య సుమశ్రీకి అందజేశారు. వారి స్నేహపూర్వక చర్యను పలువురు అభినందించారు.

8. తండావాసులు ధర్నా

సర్పంచ్ ఏకగ్రీవాన్ని వ్యతిరేకిస్తూ కామారెడ్డి కలెక్టరేట్ ముందు తండావాసులు ధర్నాకు దిగారు. గాంధారి మండలం సోమ్లా నాయక్ తండా సర్పంచ్ ఏకగ్రీవాన్ని వ్యతిరేకిస్తూ.. అదే పంచాయతీ పరిధిలోని పంతులు నాయక్ తండావాసులు నిరసన చేపట్టారు. మద్యం, డబ్బులు ఇచ్చి ఏకగ్రీవాన్ని చేశారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నోడల్ అధికారికి తండావాసులు వినతిపత్రం అందజేశారు.

9. వినూత్న ప్రచారం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగిలో మూడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బోయ ఇందిరా సంజీవ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నాయకులు ఓటర్ల ఇళ్ల వద్ద గడ్డాలు గీస్తూ, ఇందిరా సంజీవ స్వయంగా టిఫిన్ సెంటర్‌లో పూరీలు వేస్తూ, ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు.

10. ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లు.. ఎస్పీ సమీక్ష

నిర్మల్ జిల్లాలో రేపు జరగనున్న రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ జానకి షర్మిల సమీక్షించారు. ఎన్నికలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆమె సూచించారు. బందోబస్తు సిబ్బంది గ్రామ ప్రజలతో సమన్వయంగా వ్యవహరించి, ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని, ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యేలా చూడాలని ఆమె తెలిపారు.

11. మరో ట్విస్ట్

నెల్లూరులో రాజకీయం మలుపులు తిరుగుతోంది. తాజాగా 42 వార్డు కార్పొరేటర్ కరీముల్లా టీడీపీలో చేరారు. అమరావతిలో మంత్రి నారాయణ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు కరీముల్లా. ఈ నెల 18న నెల్లూరు మేయర్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.

13. టెట్ పరీక్ష రాసేందుకు వెళ్తూ యవతి మృతి

టెట్ పరీక్ష రాసేందుకు వెళ్తూ ఓ యువతి రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటన అనకాపల్లి జిల్లాలోని సుంకరమెట్ట జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. ఎన్‌ఏడీ జంక్షన్‌కు చెందిన సునీత.. ఉదయం 9 గంటలకు అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో జరగాల్సిన పరీక్షకు హాజరయ్యేందుకు, తన తండ్రి లక్ష్మణరావు నడుపుతున్న ఆటోలో ఇంటి నుంచి బయలుదేరింది. సుంకరమెట్ట జంక్షన్ స్పీడ్ బ్రేకర్ వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో నుంచి సునీత జారిపడడంతో ఆమె పైనుంచి ఆటో వెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి లక్ష్మణరావు సురక్షితంగా బయటపడ్డాడు. కళ్లముందే కూతురు చనిపోవడంతో ఆ తండ్రి రోదించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. కూతురి మృతదేహాన్ని తండ్రి వేరే వాహనంలో ఆసుపత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

14. ఎన్టీఆర్ జిల్లాలో ట్రాక్టర్ బీభత్సం..

ఎన్టీఆర్ జిల్లాలో ఓ ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. మైలవరంలోని లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద వేగంగా వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఆ తర్వాత కళాశాల పార్కింగ్ ఆవరణలోకి దూసుకెళ్లి, అక్కడ పార్క్ చేసిన బైక్‌లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

15. అడ్డుకుంటున్నారు!

భారత కబడ్డీ ప్రపంచకప్ జట్టుకు తనను ఎంపిక చేయకుండా అడ్డుకున్నారంటూ కబడ్డీ ప్లేయర్ గౌరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఒలింపిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె.పి. రావుపై తాడేపల్లిగూడెం పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రం తరఫున నేషనల్స్ ఆడినప్పటికీ.. ప్రపంచ కప్‌నకు సెలక్ట్ కాకుండా అడ్డుకున్నారంటూ ఇటీవల డీజీపీ, డిప్యూటీ సీఎ పవన్ కల్యాణ్‌లకు ఆమె ఫిర్యాదు చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం పోలీసులు కె.పి. రావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

16. షిప్ సీజ్

గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత 60 లక్షల లీటర్ల చమురును అక్రమంగా తరలిస్తున్న ఒక నౌకను ఇరాన్ సీజ్ చేసింది. ఈ నౌకలోని మొత్తం 18 మంది సిబ్బందిలో భారతీయులు, బంగ్లాదేశ్, శ్రీలంక వాసులు కూడా ఉన్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అక్రమ ఇంధన రవాణాను అడ్డుకునే క్రమంలో ఇరాన్ ఈ చర్య తీసుకుంది. ఇరాన్ నుండి చమురును అక్రమంగా ఎగుమతి చేయడం ద్వారా లాభాలు ఆర్జించడాన్ని నిరోధించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నారు.

17. మూడున్నర గంటలే.. మోదీ

తాను ఇన్నేళ్ల వృత్తి జీవితంలో ఒక్క అధికారిపైనా కోప్పడిన సందర్భం లేదని, అందుకు కారణం తాను అనుసరించే విధానమేనని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. తాను రోజుకి నిద్రపోయేది మూడున్నర గంటలేనని, బయటివారికి ఇది తక్కువగా కనిపించినా గాఢనిద్రలోకి వెళ్తాను కాబట్టి తనకు పూర్తిగా సరిపోతుందని ఎన్డీయే ఎంపీలతో అన్నారు.

18. మాటలతో గెలవలేం

మాటలతో యుద్ధాలు గెలవలేమని, స్పష్టమైన చర్యల ద్వారానే విజయం సాధ్యమని CDS జనరల్ అనిల్ చౌహాన్ పాకిస్థాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో జరిగిన గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ఈ స్పందన వచ్చింది. భారతదేశానికి ఉన్న స్థిరమైన ప్రజాస్వామ్య వ్యవస్థ, సాయుధ దళాల నైపుణ్యం బలం అని ఆయన అన్నారు.

19. సూర్యకుమార్ యాదవ్‌పై చోప్రా విమర్శలు

టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గత కొన్ని నెలలుగా ఫామ్‌లో లేకపోవడంపై మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించారు. కెప్టెన్ పని కేవలం టాస్ వేయడం కాదని, టాప్‌-4లో బ్యాటింగ్ చేస్తూ పరుగులు చేయడం కూడా ప్రధాన బాధ్యతేనని అన్నారు. సూర్యకుమార్ గత 20 ఇన్నింగ్స్‌లలో అర్ధ శతకం చేయలేకపోయాడని, 17 ఇన్నింగ్స్‌లలో అతని సగటు కేవలం 14 మాత్రమేనని చోప్రా పేర్కొన్నారు.

20. 65వ వసంతంలోకి వెంకటేశ్ ఎంట్రీ

విభిన్న కథలతో ప్రేక్షకులను మెప్పించే అగ్రకథానాయకుడు వెంకటేశ్‌ నేడు 65వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సురేశ్ ప్రొడక్షన్స్ ఆయన సినిమాల డైలాగ్‌లు, ఇతర హీరోల కామెంట్‌లతో కూడిన మ్యాష్‌అప్‌ వీడియోను షేర్ చేసింది. వెంకటేశ్‌ ఆవకాయ లాంటి వారని, ఆయనను ఇష్టపడని ప్రేక్షకులు ఉండరని హీరో నాని ప్రశంసించారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×