E-Paper
Advertisement

Top 20 News: అన్నమయ్య జిల్లాలో భారీ చోరీ.. 30 తులాల బంగారం స్వాహా, గెలిచిన మరుసటి రోజే హామీ నెరవేర్చిన సర్పంచ్

Top 20 News: అన్నమయ్య జిల్లాలో భారీ చోరీ.. 30 తులాల బంగారం స్వాహా, గెలిచిన మరుసటి రోజే హామీ నెరవేర్చిన సర్పంచ్

1. కేంద్ర మంత్రితో సీఎం భేటీ

ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్‌కు IIM మంజూరు చేయాల‌ని ధ‌ర్మేంద్ర ప్రధాన్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. IIM ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించామని.. వెంటనే తరగతులు ప్రారంభించడానికి ట్రాన్సిట్ క్యాంపస్ కూడా సిద్ధంగా ఉంద‌ని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

2. కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలపై అడ్లూరి స్పందన

జగిత్యాల జిల్లాలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. ఎన్నికల ప్రచారంలో ఈశ్వర్ తన ఓటమి గురించి మాట్లాడారని, అందుకే ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నానని తెలిపారు. గత ప్రభుత్వంలో సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసినా ఈశ్వర్ ఎస్సీ, మైనార్టీలకు భవనాలు కట్టలేదని విమర్శించారు మంత్రి అడ్లూరి.

3. ఉస్మానియా యూనివర్సిటీలో ఏసీబీ దాడులు

ఉస్మానియా యూనివర్సిటీలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో బిల్డింగ్ డివిజన్ డిఈ శ్రీనివాస్ ఒక కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపు క్లియర్ చేయడం కోసం శ్రీనివాస్ లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి.

4 . మూడో విడత ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

జోగులాంబ గద్వాల జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్, కౌంటింగ్‌పై వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ ఉంటుందని, ఆటంకం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

5.  గెలిచిన మరుసటి రోజే హామీ నెరవేర్చిన సర్పంచ్

రాజన్న సిరిసిల్ల జిల్లా కందికట్కూరు సర్పంచ్ చింతపల్లి విజయమ్మ, గెలిచిన మరుసటి రోజే ఎన్నికల హామీని నెరవేర్చారు. గ్రామంలో ఏళ్లుగా వేధిస్తున్న కోతుల బెడదను వదిలించేందుకు నిపుణులను రప్పించి 113 కోతులను బోనుల్లో బంధించారు. ఒక్కో కోతికి 500 రూపాయలు చెల్లిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు.

6. ఏడేళ్ల కూతురుని చంపిన తల్లి

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి వసంత్‌పురి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. తల్లి మోనాలిసా తన ఏడేళ్ల కూతురు షారోను మేరిని బిల్డింగ్‌ పైనుంచి తోసి చంపింది. రెండు రోజుల క్రితం భర్తతో జరిగిన గొడవ, ఆమె మానసిక వ్యాధితో బాధపడుతుండటం ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.

7. ఆసుపత్రి ఎదుట ఆందోళన

మంచిర్యాల జిల్లా ప్రైవేట్ ఆసుపత్రిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాగజ్ నగర్‌కు చెందిన గర్భిణీకి సరైన సమయంలో ఆపరేషన్ చేయకపోవడం వల్ల శిశువు మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యమే శిశువు మృతికి కారణమంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

8. ఆకస్మిక తనిఖీలు

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో లీగల్ మెట్రాలజీ శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలతో స్వర్ణకారుల దుకాణాల్లో కలకలం రేగింది. తూనికల యంత్రాల ధ్రువీకరణ, కొలతలలో లోపాల పరిశీలన కోసం అధికారులు రాగా, ముందస్తు సమాచారంతో వ్యాపారులు భారీ జరిమానాల భయంతో తమ షాపులను మూసివేసి ఉడాయించారు. దీంతో పట్టణంలో పలు బంగారు దుకాణాలు మూతపడ్డాయి.

9. మెుబైల్ ఫోన్లు పంపిణీ.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి

టెక్నాలజీని జోడించి పిల్లల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 2,270 మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు 5జీ మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. పిల్లలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందించడం, అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

10. అన్నమయ్య జిల్లాలో భారీ చోరీ.. 30 తులాల బంగారం స్వాహా

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఊటుకూరులో టీచర్ శ్రీనివాస్ నివాసంలో భారీ చోరీ జరిగింది. కుటుంబం తిరుమలకు వెళ్లిన సమయంలో నలుగురు దుండగులు 30 తులాల బంగారు నగలు, లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

11. ప్లేట్లు పట్టుకుని సిబ్బంది నిరసన

నారాయణఖేడ్ డివిజన్‌లో మూడో దశ స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో ఉన్న పోలింగ్ సిబ్బందికి భోజనం సరిపోకపోవడంతో గందరగోళం నెలకొంది. కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యంపై సిబ్బంది ప్లేట్లు పట్టుకుని నిరసన తెలిపారు. అదనపు భోజనం ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

12. అర్జున్ రెడ్డికి నోటీసులు జారీ

కృష్ణాజిల్లా గుడివాడ పోలీసులు వైసీపీ అధినేత జగన్ సమీప బంధువు అర్జున్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. సీఎం, డిప్యూటీ సీఎం చిత్రాలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వ్యాప్తి చేసిన కేసులో ఆయన నిందితుడు. గతంలో విదేశాలకు పారిపోయిన అర్జున్ రెడ్డి తిరిగి రాగా.. ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఏపీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని సీఆర్‌పీసీ సెక్షన్ 41A కింద నోటీసులు జారీ చేశారు.

13. వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి బిగ్ షాక్

ఎన్టీఆర్ జిల్లా నందిగామ వైసీపీ మాజీ ఎమ్మెల్యే జగన్మోహనరావుకు బిగ్ షాక్ తగిలింది. ఇటీవల మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగా.. ప్రస్తుత ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై పర్సనల్ కామెంట్స్ చేశారనీ, దీంతో ఆమె వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిందని టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద జగన్మోహనరావుపై కేసు నమోదు చేశారు నందిగామ పోలీసులు.

14. కూటమిపై విమర్శలు

విజయనగరం ZP చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విద్య, వైద్యాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌తో పోల్చడంపై స్పందించారు. ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేసింది కూటమి ప్రభుత్వమేనని ఆరోపించారు. జగన్ పిలుపు మేరకు నిన్న నిర్వహించిన భారీ ర్యాలీలో మేధావులు, విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొన్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సకాలంలో ఇవ్వడంలేదని విమర్శించారు.

15.రాజకీయ రగడ

వరంగల్ తూర్పు కాంగ్రెస్ ఇంఛార్జ్, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మధ్య రాజకీయ రగడ చోటుచేసుకుంది. కొండా సురేఖ పర్యటన సమయంలోనే, సారయ్య 41వ డివిజన్‌లో కొండా అనుచరులతో భేటీ అయ్యారు. దీనిపై కొండా సురేఖ తీవ్రంగా స్పందిస్తూ, తమను ఢీ కొనలేక కొందరు తమ వెనుక గోతులు తవ్వుతున్నారని ఆరోపించారు. అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని పరోక్షంగా హెచ్చరించారు.

16. అగ్రస్థానంలో కాంగ్రెస్

రాష్ట్ర వ్యాప్తంగా రెండు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ 61.24 శాతంతో అగ్రస్థానంలో ఉందని ములుగులో మంత్రి సీతక్క అన్నారు. 42శాతం రిజర్వేషన్లు, కులగణన కోసం అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం అడ్డుకోవడం వల్లే 3 వేల కోట్ల రూపాయల నిధులు ఆగిపోయాయని విమర్శించారు. మూడో విడతను కూడా విజయవంతం చేయాలని కోరారు.

17. జోర్డాన్‌లో మోదీ పర్యటన

జోర్డాన్‌లో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీని యువరాజు హుస్సేన్ బిన్ అబ్దుల్లా స్వయంగా కారు డ్రైవ్ చేస్తూ మ్యూజియానికి తీసుకెళ్లారు. మొహమ్మద్‌ ప్రవక్త కుటుంబానికి చెందిన యువరాజు, మోదీని సాదరంగా ఆహ్వానించడం విశేషం. ఇది ఇరు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుందని విశ్లేషిస్తున్నారు.

18. ప్రియాంక గాంధీ ఫైర్

ఎంజీ నరేగా స్థానంలో కేంద్రం ‘వీబీ-జీ రామ్‌ జీ’ బిల్లును ప్రవేశపెట్టడంపై ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఇది పేదలకు ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరుస్తుందన్నారు. పంచాయతీల హక్కులను దూరం చేస్తూ, కేంద్రం నియంత్రణ పెంచుతోందని విమర్శించారు. గాంధీ పేరు తొలగించే ప్రయత్నం జరుగుతోందని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ దుయ్యబట్టారు.

19. యూషెన్ సిరీస్‌కు దూరం

గాయం కారణంగా ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్ ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. టెస్టుల్లో తరచూ గాయాలపాలవుతుండటంతో, అతని కెరీర్‌పై ప్రభావం పడుతోంది. ఫిట్‌నెస్ దృష్ట్యా, టెస్టులకు వీడ్కోలు పలికి వన్డేలు, టీ20 ఫార్మాట్లపై దృష్టి సారిస్తే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మూడు ఫార్మాట్లు ఆడతానని హాజిల్‌వుడ్ అంటున్నాడు.

20. వారితో జాగ్రత్త

నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తన శరీర మార్పులకు కారణం ప్లాస్టిక్‌ సర్జరీ అని పేర్కొంటూ ఒక వ్యక్తి చేసిన పోస్టును ఖండించారు. తాను కష్టపడి వ్యాయామం చేయడం వల్లే బరువు తగ్గానని, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని స్పష్టం చేశారు. వైద్యులమని చెప్పుకునే ఇలాంటివారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆమె అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×