E-Paper
Advertisement

Top 20 News: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు, డ్వాక్రా సంఘాల ఉద్యోగుల భారీ మోసం

Top 20 News: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు, డ్వాక్రా సంఘాల ఉద్యోగుల భారీ మోసం

1. ఏపీకి చేయూతనివ్వండి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏపీ సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. పూర్వోదయ, సాస్కీ పథకాల గురించి కేంద్ర మంత్రి వద్ద చంద్రబాబు ప్రస్తావించారు. ఆ పథకాల ద్వారా ఏపీకి చేయూతనివ్వాలని సీఎం కోరారు. కేంద్ర పథకాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న నిధులు విడుదల చేయాలని కేంద్రమంత్రికి విన్నవించారు.

2. అభినందనలు

బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కలిసి అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో నబీన్ అనుభవం, నిబద్ధత పార్టీ బలోపేతానికి దోహదపడతాయని ఆయన ఆకాంక్షించారు. ఈ కొత్త బాధ్యతల్లో నితిన్ నబీన్ మరిన్ని విజయాలు సాధించాలని బండి సంజయ్ ఆకాంక్షించారు.

3.  భార్యను కొట్టిన చంపిన భర్త

వికారాబాద్ జిల్లా తాండూరులో భార్యను భర్త కొట్టి చంపిన ఘటనలో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డైన దృశ్యాలు చూస్తే ఆ కిరాతకుడు ఎంత దారుణంగా తన భార్యను కొట్టి చంపింది ఎవరికైనా అర్థమవుతుంది. చేతికి అందిన పెద్ద కర్రను తీసుకొని అతడు తన భార్యను కొట్టిన తీరు చూసిన వాళ్లను కంట తడిపెట్టిస్తోంది.

4. డ్వాక్రా సంఘాల ఉద్యోగుల భారీ మోసం

పల్నాడు జిల్లాలో మెప్మా, డ్వాక్రా సంఘాల ఉద్యోగులు భారీ మోసానికి పాల్పడ్డారు. గ్రూపు సభ్యులకు తెలియకుండా పెద్దమొత్తంలో లోన్లు తీసుకున్నారు. గ్రూప్ సభ్యులు చెల్లించిన సొమ్మును బ్యాంక్‌లో జమ చేయకుండా కాజేశారు. నరసరావుపేట మండలంలోని జొన్నలగడ్డ, పెట్లూరివారిపాలెం, చిన్నతురకపాలెం గ్రామాల్లో సుమారు 50 లక్షల రూపాయలు కాజేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

5.  కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కలెక్టర్లు, ఎస్పీలపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కలెక్టర్ల సమావేశంలో సీఎం, డిప్యూటీ సీఎంల వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు.

6. పాల డెయిరీ వద్ద ఉద్రిక్తత

నంద్యాల జిల్లాలోని విజయ పాల డెయిరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ముత్యాలపాడు గ్రామ సొసైటీ ఎన్నికల్లో గెలిచిన భూమా విఖ్యాత్ రెడ్డి.. విజయ పాల డెయిరీ ఉన్న అప్పును చెల్లించాలంటూ డీఫాల్ట్ నోటీసులు ఇచ్చింది డెయిరీ యాజమాన్యం. వివరణ ఇచ్చేందుకు ఆయన డెయిరీకి రాగా, యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో డెయిరీ వద్ద హై టెన్షన్ నెలకొంది.

7.  వడియాలు, అన్నం  తిన్న తర్వాత అస్వస్థతకు గురైన చిన్నారులు

మహబూబాబాద్ జిల్లా ఇటుకాలగడ్డ తండా అంగన్‌వాడీ కేంద్రంలో అస్వస్థతకు గురై ఇద్దరు చిన్నారులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. వడియాలు, అన్నం తిన్న తర్వాత అస్వస్థతకు గురైన చైత్ర గత నెల 29న, చికిత్స పొందుతున్న నిత్య ఇవాళ మరణించారు. ఈ విషాద ఘటనతో గత 20 రోజులుగా కేంద్రానికి తాళం వేశారు. నెల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చిన్నారులు మృతి

8. మర్చిపోలేని అనుభూతి

బ్రెజిల్‌లో జరిగిన 11వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్‌కు సంబంధించిన పుస్తకాన్ని సీఎం చంద్రబాబుకి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అందజేశారు. ఈ ప్రచురణలో తన ప్రసంగాలు, ఫోటోలు ఉండటం గర్వకారణమని ఆమె అన్నారు. ప్రపంచ వేదికపై మహిళా సాధికారత, వాతావరణ మార్పులపై భారతదేశ గొంతుకను వినిపించడం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని తెలిపారు.

9. కాంగ్రెస్ సర్పంచ్ భర్త పై దాడి

వికారాబాద్ జిల్లా కోటపల్లి కాంగ్రెస్ సర్పంచ్ భర్త సంగయ్యపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలైన ఆయన్న కుటుంబీకులు హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను నిరసిస్తూ గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలిసిన ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ బాధితుడిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

10. పుట్టెడు దు:ఖంలో..

నెల్లూరులో ఆత్మహత్యకు పాల్పడిన పదో తరగతి విద్యార్థిని లావణ్య కుటుంబ సభ్యులు గొప్ప మనసు చాటుకున్నారు. పుట్టెడు దుఃఖంలోనూ లావణ్య కళ్లను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. వారి నిర్ణయంతో రమాయమ్మ ఇంటర్నేషనల్ ఐ బ్యాంక్ ప్రతినిధులు నేత్రాలను సేకరించారు. ఆ చిన్నారి మరణించినా, మరొకరికి చూపునిచ్చి ఆదర్శంగా నిలిచిందని పలువురు కొనియాడారు.

11. కాంట్రాక్టర్ల హడావిడి

రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్ సర్కిల్ కార్యాలయంలో కాంట్రాక్టర్ల హడావిడి మితిమీరుతోంది. ఇంజనీరింగ్ సెక్షన్‌లోకి ప్రవేశం అనుమతి లేదన్న బోర్డులను బేఖాతరు చేస్తూ, బిల్లుల కోసం అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. తమకు అనుకూలమైన వారికే చెల్లింపులు చేస్తున్నారని గతంలో ఆందోళనలు కూడా జరిగాయి. రాజకీయ ఒత్తిళ్లు, కాంట్రాక్టర్ల జోక్యంతో స్వేచ్ఛగా పని చేయలేకపోతున్నామని అధికారులు వాపోతున్నారు.
కాంట్రాక్టర్ల హడావిడి

12. వైన్స్ తొలగించాలి.. కాలనీ వాసుల ధర్నా

యాదాద్రి భువనగిరి పట్టణం మీనా నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీరేణుకా వైన్స్, స్క్రాబ్ దుకాణం తొలగించాలని కోరుతూ కాలనీ వాసులు ధర్నా చేపట్టారు. రోడ్డును ఆక్రమించి దుకాణాలు నడపడం వల్ల, మందుబాబుల అల్లర్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వీటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ దుకాణం ఎదుట నిరసన తెలిపారు.

13. రిమాండ్ పొడిగింపు

ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్ ముగిసింది. దీంతో నిందితులను సిట్ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. జనవరి 2వ తేదీ వరకు ఏసీబీ కోర్టు నిందితులకు రిమాండ్ పొడిగించింది. లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, వెంకటేష్ నాయుడు, అనిల్ చోక్రా, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ, చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డిలను కోర్టులో హాజరు పరిచారు.

14. ఆసుపత్రి సిబ్బందిపై కలెక్టర్ సీరియస్

యాదాద్రి భువనగిరి జిల్లా ఆసుపత్రి సిబ్బంది 82 మందికి కలెక్టర్ హన్మంతరావు షోకాజు నోటీసులు జారీ చేశారు. మూడు గంటల పాటు ఆస్పత్రిలోని ప్రతి వార్డు కలియతిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలో వివిధ అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయని కాంట్రాక్టర్‌పై సీరియస్ అయ్యారు.

15. మత్స్యకారుల అభివృద్ధి కోసం కృషి.. కొండా సురేఖ

మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ జిల్లా దేశాయిపేటలోని చిన్న వడ్డెపల్లి చెరువులో ఉచితంగా అందించిన చేప పిల్లలను వదిలారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముదిరాజుల సంక్షేమం కోసం ఉచితంగా చేప పిల్లలను అందజేస్తున్నామని తెలిపారు. మట్టెవాడ పారిశ్రామిక సంఘానికి 80 వేల చేప పిల్లలను పంపిణీ చేశామన్నారు.

16.బైకులు ఢీ.. యువకుడు మృతి

కాకినాడ జిల్లా కోరంగి సమీపంలో 216 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు బలంగా ఢీకొన్నాయి. దీంతో ఒక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

17. అవాస్తవం

నంద్యాల జిల్లా నందికొట్కూరు పాఠశాలలో చాక్లెట్లు తిని విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారనే వార్తల్లో నిజం లేదని అధికారులు స్పష్టం చేశారు. తహశీల్దార్ శ్రీనివాసులు, సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటరమణ దీనిపై స్పందించారు. విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించామని, ఎవరికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వెల్లడించారు.
అవాస్తవం

18. ఇన్‌స్టాగ్రామ్ కొత్తరూల్

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ కొత్తరూల్‌ను తీసుకొచ్చింది. హ్యాష్‌ట్యాగ్‌ల వినియోగంపై పరిమితి విధిస్తున్నట్లు తన ఖాతాదారులకు అలర్ట్‌ జారీ చేసింది. కాబట్టి ఇక మీద వాటిని పోస్ట్‌ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్‌స్టాగ్రామ్‌ వాడేవాళ్లకు సూచిస్తోంది.

19. పాక్‌కు దెబ్

అప్పుల ఊబిలో ఉన్న పాకిస్థాన్‌కు IMF చుక్కులు చూపిస్తోంది. జనాభా పెరిగిపోతోందని కనీసం కండోమ్స్, గర్భనిరోధక సాధనాల మీదైనా 18 శాతం GST తగ్గించాలని పాక్ ప్రధాని షరీఫ్ చేసిన అభ్యర్థనను IMF తిరస్కరించింది. పైసా తగ్గించేది లేదంటూ తేల్చి చెప్పింది. శానిటరీ ప్యాడ్లు, డైపర్లపై కూడా తగ్గించలైమంది.

20. చాలా నేర్చుకున్నా..

శ్రీకాంత్‌ తనయుడు, నటుడు రోషన్‌ ఛాంపియన్‌ చిత్రంతో ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రదీప్‌ అద్వైతం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాను చాలా ఏళ్ల తర్వాత సినిమా చేస్తున్నానని అన్నారు. మూడేళ్లలో చాలా నేర్చుకున్నానని.. ఇక ఆగనని రోషన్ అన్నాడు. దర్శకుడు ప్రదీప్‌కి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పాడు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×