సిద్దిపేట కాంగ్రెస్‌లో వర్గపోరుపై మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్గత గ్రూపు రాజకీయాల వల్ల పార్టీకి నష్టం, బీఆర్ఎస్‌కు లాభం చేకూరుతుందని ఆయన హెచ్చరించారు. నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి తాను కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
తెలంగాణలో రైతు యాంత్రీకరణ పథకాన్ని జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పునఃప్రారంభించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ పథకం ద్వారా 1,31,000 మంది రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు అందజేయనున్నారు.
హైదరాబాద్ మియాపూర్‌లోని గోకుల్ ప్లాట్స్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. జల్సాలకు బానిసైన రాజు, తన ప్రవర్తన గురించి కుటుంబ సభ్యులకు చెప్పడానికి వెళ్తున్న భార్య విజయలక్ష్మిని నడిరోడ్డుపై అడ్డగించి పిడిగుద్దులతో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రమణగుట్ట వద్ద విషాదం చోటుచేసుకుంది. క్రిస్మస్ సెలవుల సందర్భంగా ఈతకు వెళ్లిన తొమ్మిదో తరగతి విద్యార్థులు అబ్దుల్ సహాని, శశాంక్ సాగర్ ప్రధాన కాలువలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు బోట్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
జోగులాంబ గద్వాల జిల్లా నందిన్నె మాజీ సర్పంచ్ చిన్న భీమా రాయుడు హత్య కేసులో ప్రధాన నిందితుడు ఈశ్వర్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. గత నెలలో బొలెరో వాహనంతో ఢీకొట్టి, దీనిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించారు. ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
కామారెడ్డి జిల్లా సోమారంపేటలో పంచాయతీ భవనం కేటాయింపుపై వివాదం చెలరేగింది. సోమారంపేట, దాని నుంచి విడిపోయిన సోమారంపేట తండా పాలకవర్గాలు ఒకే భవనం కోసం పట్టుబట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు నచ్చజెప్పినా ఇరువర్గాలు వినకపోవడంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌లో మంత్రి శ్రీధర్ బాబు పర్యటనలో ముత్తారం ఎస్సై మహేందర్ వివాదాస్పదంగా ప్రవర్తించారు. మంత్రి పాల్గొన్న కార్యక్రమంలో దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులను అడ్డుకోవడమే కాకుండా, వారి సెల్‌ఫోన్లను లాక్కునేందుకు ప్రయత్నించారు.
విశాఖ రుషికొండ ప్యాలెస్ వినియోగంపై మంత్రివర్గ ఉపసంఘం కీలక చర్చలు జరిపింది. ప్రస్తుత భవనాలను అంతర్జాతీయ స్థాయి హాస్పిటాలిటీ కేంద్రంగా మార్చేందుకు మొగ్గు చూపుతుంది. తాజ్, లీలా ప్యాలెస్ వంటి సంస్థలు లీజుకు ఆసక్తి చూపగా, అదనపు నిర్మాణాల అవసరముందని కమిటీ భావిస్తోంది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో విలీనమైన 27 మున్సిపాలిటీల అభివృద్ధిపై కమిషనర్ కర్ణన్ ప్రత్యేక దృష్టి సారించారు. నగరానికి అనుసంధానంగా ఉన్న అప్రోచ్ రోడ్లపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. శివారు ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణానికి రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్‌లో విధి నిర్వహణలో అమరుడైన జవాన్ రాజశేఖర్ భౌతికకాయం ఆయన స్వగ్రామం ఆలమూరు చేరింది. అధికార లాంచనాలతో జరిగిన అంతిమయాత్రలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, తోటి జవాన్లు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘన నివాళులర్పించారు. ప్రభుత్వం ఆయన కుటుంబానికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం తుంబకుప్పంలో అమానుష ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన పసిబిడ్డను ఒక తల్లి చెరువులో పడేయడంతో ఆ శిశువు మృతి చెందింది. నీటిపై తేలుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ హృదయ విదారక ఘటనపై ఐసీడీఎస్, పోలీసు అధికారులు విచారణ చేపడుతున్నారు.
బెంగళూరు ఉల్లాల్ మెయిన్ రోడ్డులో నవీన్ కుమార్ అనే యువకుడు తన ప్రేమను నిరాకరించిందని ఒక యువతిపై నడిరోడ్డుపై అమానుషంగా దాడి చేశాడు. బాధితురాలు గట్టిగా ప్రతిఘటించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, 24 గంటల్లోనే నిందితుడిని జ్ఞానభారతి పోలీసులు అరెస్ట్ చేశారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పలు లాడ్జీల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో శ్రీ ఆంజనేయ రెసిడెన్సీపై దాడి చేసి, ఐదు జంటలను, పలువురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, లాడ్జీని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని బండగానిపల్లి ఘాట్ రోడ్డు వద్ద పెద్ద పులి సంచరిస్తున్నట్లు వస్తున్న వార్తలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కనుమ బావి సమీపంలో పులి కనిపించిందన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. అక్కడ లభించిన పాదముద్రలను సేకరించి విశ్లేషణ కోసం ఉన్నతాధికారులకు పంపారు.
తైవాన్‌లోని తైతూంగ్ కంట్రీ హాల్ సమీపంలో రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూమికి 12 కిలోమీటర్ల లోతులో కేంద్రం ఉన్నట్లు గుర్తించిన అధికారులు, అక్కడ లెవెల్ 5 తీవ్రత నమోదైనట్లు తెలిపారు. ఈ ప్రకంపనలకు అనేక ప్రాంతాలు వణికిపోయినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్ట వివరాలు అందలేదు.
అమెరికాలో గూగుల్‌లో పనిచేస్తున్న హెచ్-1బీ వీసాదారుల గ్రీన్ కార్డు కల నెరవేరనుంది. నిలిచిపోయిన గ్రీన్ కార్డు స్పాన్సర్‌షిప్ ప్రక్రియను వచ్చే ఏడాది నుంచి వేగవంతం చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ముఖ్యంగా కీలకమైన పెర్మ్ దరఖాస్తుల ప్రక్రియను పునఃప్రారంభించి, త్వరగా ప్రభుత్వ ఆమోదం పొందేలా చర్యలు తీసుకోనుంది.
ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో, విమానయాన రంగంలో పోటీని పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్ సంస్థలకు తాజాగా నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు మంజూరు చేసింది. సామాన్యులకు తక్కువ ధరకే ప్రయాణాన్ని చేరువ చేయడమే లక్ష్యమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఢిల్లీలో జరిగిన ఐబీ శతాబ్ది స్మారక ఉపన్యాసంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. జన్ భాగీదారి భద్రతకు మూలస్తంభమని, ప్రజలు కేవలం ప్రేక్షకులుగా ఉండకుండా తమ పరిసరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. నిజమైన సమాచారాన్ని అందించే క్రియాశీల వినియోగదారుల సంఘాలు ఏర్పడాలని ఆమె ఆకాంక్షించారు.
విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. ఆంధ్ర నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 15 ఏళ్ల తర్వాత దేశవాళీ వన్డేల్లోకి పునరాగమనం చేసిన కోహ్లీ.. 83 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, మొత్తం 131 పరుగులు సాధించాడు.
కర్నూలు జిల్లా మంత్రాలయంలో కాంతార హీరో రిషబ్ శెట్టి సందడి చేశారు. కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మ, శ్రీ రాఘవేంద్రస్వామి మూలబృందావనానికి ప్రత్యేక పూజలు చేసి.. మొక్కులు తీర్చుకున్నారు.