తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలిరోజు ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. సభలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు వెళ్లి కరచాలనం చేసి.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చాలా కాలం తర్వాత అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్.. చిరునవ్వుతో స్పందిస్తూ రేవంత్ పలకరింపునకు బదులిచ్చారు.
కృష్ణా జలాల కేటాయింపులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం. 246ను సాక్ష్యంగా చూపుతూ.. కృష్ణా బేసిన్‌లో కేవలం 45 టీఎంసీల వాటాకు అప్పట్లోనే ఆ పార్టీ అంగీకరించిందని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా తాను ఎందుకు లేఖ రాస్తానని ప్రశ్నిస్తూ.. విపక్షాలు అబద్ధాలతో బురదజల్లుతున్నాయని మంత్రి ధ్వజమెత్తారు.
టీడీపీ నేతల ఆరోపణలపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పులివెందుల మున్సిపల్ సమస్యలపై ఆర్డీవోను కలిసిన వారిని వెటకారం చేయడం తగదన్నారు. నిరుపేదల ఇళ్ల కాలనీల్లో అభివృద్ధి శూన్యమని.. రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని మండిపడ్డారు.
టీడీపీ సీనియర్ నేత సాయిబాబా మృతి పట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బేగంపేటలోని ఆయన నివాసానికి వెళ్లి సాయిబాబా పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయిబాబా కుటుంబ సభ్యులను పరామర్శించారు.
రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఓర్వలేక పేర్ని నాని వంటి నేతలు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ తన పిల్లలను లండన్‌లో చదివిస్తూ.. కార్యకర్తలను మాత్రం నేరాలకు ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్ జనచైతన్య ఫేజ్-2లో ఐశ్వర్య అనే నవవధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఫిడ్స్ రావడంతో ఆమె చనిపోయిందని భర్త రాజు చెబుతుండగా.. తమ బిడ్డను అల్లుడే చంపాడని ఐశ్వర్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన విద్యార్థిని సాయి సుదిష్ణ జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జనవరి 1వ తేదీ నుంచి జరిగే అండర్-19 పోటీల్లో ఆమె పాల్గొననున్నారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన మేఘన, భావన అనే ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు. విహారయాత్రకు వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు లోయలో పడటంతో ఈ దారుణం జరిగింది.
రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ వాసుదేవ రెడ్డి కాలనీలో నిత్యశ్రీ అనే పాపపై వీధి కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో గాయపడిన చిన్నారి మొహంపై 18 కుట్లు పడ్డాయి. అధికారులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినా స్పందించలేదని.. వారి నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ నాచారంలో శివాలయం ప్రహరీ గోడ కూల్చివేతపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. రోడ్డు మరమ్మతుల పేరుతో అధికారులు ఈ చర్యకు పూనుకోవడాన్ని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
అనకాపల్లి జిల్లా యలమంచిలి రైలు ప్రమాద సమయంలో సంభవించిన మంటల వల్ల సుమారు 500 మీటర్ల మేర విద్యుత్ వైర్లు కరిగిపోయి తెగిపడ్డాయి. దీనివల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా రైల్వే సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో విషాదం నెలకొంది. ఆడబిడ్డకు జన్మనిచ్చి నజ్మా అనే తల్లి అనంతపురం ఆసుపత్రిలో కన్నుమూసింది. ఆమె మృతదేహాన్ని, పసికందును అంబులెన్స్‌లో హిందూపురం తరలిస్తుండగా.. పొగమంచు వల్ల అంబులెన్స్ లారీని ఢీకొంది. ఈ ఘటనలో చిన్నారి కూడా మరణించింది.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కెమికల్ ఫ్యాక్టరీల వల్ల నీరు కలుషితమవుతోందని ఆటోనగర్ వాసులు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. మున్సిపల్ ఛైర్మన్‌ను అడ్డుకుని నినాదాలు చేశారు. ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఛైర్మన్ హామీ ఇచ్చినా.. స్పష్టమైన పరిష్కారం చూపే వరకు ఆందోళన విరమించేది లేదని బాధితులు తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఒక వ్యక్తిని కిరాతకంగా హత్య చేసిన నిందితులను పోలీసులు భారీ బందోబస్తు మధ్య పట్టణ ప్రధాన వీధుల్లో ఊరేగించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి సద్భావన సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, పరిగి రోడ్డు మీదుగా చిన్న మార్కెట్ వరకు నిందితులను నడిపిస్తూ తీసుకెళ్లారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారికి హెచ్చరికగా పోలీసులు ఈ చర్య చేపట్టారు.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వైకుంఠ ఏకాదశి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఉత్తర గోపురం ద్వారా స్వామివారి దర్శనం ప్రారంభం కానుంది. భక్తుల రద్దీ దృష్ట్యా డీఎస్పీ ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో బంకర్‌లో దాక్కోవాలని తనకు సూచన వచ్చిందని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ వెల్లడించారు. నా మిలిటరీ భద్రతా సిబ్బంది నా దగ్గరకు వచ్చి యుద్ధం మొదలైంది. మీరు బంకర్‌లోకి వెళ్లండని చెప్పారు. అయితే త్యాగం చేయాల్సి వస్తే మేమే ముందుంటామని వారికి చెప్పా. నాయకులు బంకర్లలో చనిపోకూడదని, యుద్ధ రంగంలో మరణించాలని స్పష్టం చేశారన్నారు.
డెహ్రాడూన్‌లో త్రిపుర యువకుడు అంజెల్ చక్మా జాతి వివక్ష హింసకు బలికావడంపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన ఆమోదయోగ్యం కాదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామిని కోరారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా 200 విమానాలు ఆలస్యమయ్యాయి. 6 విమానాలు రద్దయ్యాయి. విమాన కార్యకలాపాలు దెబ్బతినడంతో ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి సంస్థలు ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి.
ఐసీసీ పిచ్ రేటింగ్‌లపై టీమ్ఇండియా దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర విమర్శలు చేశారు. 2025 యాషెస్ సిరీస్‌లో పెర్త్, మెల్‌బోర్న్ టెస్టులు రెండు రోజుల్లోనే ముగియడాన్ని ఆయన ప్రస్తావించారు. 36 వికెట్లు పడిన మెల్‌బోర్న్ పిచ్‌కు కూడా గుడ్ రేటింగ్ ఇస్తారేమో అని వ్యాఖ్యానించారు.
ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ చిత్రం జనవరి 9 విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం ఒక ఎమోషనల్ మ్యాష్‌అప్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ప్రభాస్ సినీ ప్రస్థానం.. ఆయన సినిమాలపై అభిమానుల సందడి.. డార్లింగ్ గురించి ఇతర ప్రముఖులు చెప్పిన మాటలను పొందుపరిచారు.