అక్రిడిటేషన్, మీడియా కార్డుల మధ్య తేడా లేదని, రెండింటికీ సమాన ప్రయోజనాలు వర్తిస్తాయన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. డెస్క్ జర్నలిస్టులు ఆందోళన చెందవద్దని, త్వరలోనే జీవో 252లో మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం జర్నలిస్ట్ సంఘాలతో సమావేశమై, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
హైదరాబాద్ శివారులో వన్యప్రాణుల అక్రమ రవాణా దందా వెలుగుచూసింది. అత్తాపూర్ పరిధిలోని సులేమాన్ నగర్‌లో జింక మాంసం విక్రయిస్తున్న వ్యక్తిని రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. పెబ్బేరు నుంచి జింకలను తరలించి నగరంలో మాంసాన్ని విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గ్రామపంచాయతీలో సర్పంచ్, ఉపసర్పంచ్ మధ్య వివాదం ముదిరింది. ఉపసర్పంచ్ కుర్చీని సర్పంచ్ గది నుంచి తొలగించడంతో వివాదం మొదలైంది. పంచాయతీ సెక్రటరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు కార్యాలయం ముందు నిరసనకు దిగారు. అందరినీ సమానంగా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సోమనపల్లిలో గుర్తుతెలియని వ్యక్తులు ఎర్రచెరువు తూము కాలువను ధ్వంసం చేయడం కలకలం రేపింది. వందల ఎకరాలకు సాగునీరు అందించే ఈ కాలువ ఆనవాళ్లు లేకుండా పోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, వెంటనే కాలువను పునరుద్ధరించి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను డిమాండ్ చేశారు.
బాపట్ల జిల్లా వెదుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీర పాండ్యన్, కలెక్టర్ వినోద్ కుమార్ సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఓపీ రిజిస్ట్రేషన్, మందుల పంపిణీని పరిశీలించారు. సిబ్బంది హాజరు, పనితీరుపై ఆరా తీస్తూ, హాస్పిటల్‌లోని ల్యాబ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో గుర్తు తెలియని డెడ్‌బాడీ కలకలం రేపింది.రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఉన్న నాలాలో.. గుర్తు తెలియని మృతదేహాం లభ్యమైంది. నాలాలో డెడ్‌బాడీ పడి ఉండటం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్‌బాడీని పరిశీలించారు. మృతుడు వయస్సు 65 నుంచి 70ఏళ్ల మద్యలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మృతుడు ఎవరని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.
విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు పూర్తిగా విఫలమయ్యాయని, ఆరోగ్యశ్రీ సేవలు అందడం లేదని మండిపడ్డారు. హామీల అమలులో విఫలమైన ప్రభుత్వం కేవలం పేర్లు మార్పుకే పరిమితమైందని, అభివృద్ధి శూన్యమని ఆయన ఆరోపించారు.
అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాయచోటిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ముస్లిం మత పెద్దలు, స్థానిక నేతలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల సామాన్యులపై పన్నుల భారం పెరిగిందని, జిల్లా కేంద్రంగా కొనసాగించని పక్షంలో రాయచోటిని తిరిగి కడప జిల్లాలోనే చేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రముఖ శైవ క్షేత్రం మహానందికి భక్తజనం పోటెత్తింది. మహానందిలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని.. వేకువజాము నుంచే కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించారు భక్తులు. స్వామి వారిని, అమ్మవార్లను ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. ఉత్తర ద్వారంలో కొలువుదీరిన సీతా సమేత కోదండ రాములను భక్తులు దర్శించి.. వైకుంఠ ఏకాదశి దర్శన ఫలాన్ని పొందుతున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ప్రొద్దుటూరు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నూతన సంవత్సర, సంక్రాంతి కానుకలు పంపిణీ చేశారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అప్పుల పాలైందని, ఐదు నెలలుగా జీతాల్లేక కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి 12 మంది, భీమవరం మావుళ్ళమ్మ ఆలయానికి 13 మంది సభ్యులతో ట్రస్ట్ బోర్డులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సభ్యులు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. మంగళగిరి బోర్డులో జనరల్ కేటగిరీ కింద మరో సభ్యుడిని నియమించే అవకాశం ఉంది.
ఏపీ గ్రూప్-2 నోటిఫికేషన్లో మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ వంటి విభాగాలకు కేటాయించిన రిజర్వేషన్ పాయింట్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. రోస్టర్ పద్ధతి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని, పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తది ఇవ్వాలని కోరుతూ దాఖలైన విన్నపాలను న్యాయస్థానం తోసిపుచ్చింది.
విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి వార్షిక నేర సమీక్షను విడుదల చేశారు. నగరంలో అత్యాచారాలు 126 నుంచి 63కు తగ్గగా.. హత్యలు 24 నుంచి 35కు పెరిగాయి. దొంగతనం కేసుల్లో 10.56 కోట్ల రూపాయలు, సైబర్ నేరాల్లో 56 లక్షల రూపాయలు రికవరీ చేశారు. గంజాయిపై 40 కేసులు నమోదు చేసి భారీగా స్వాధీనం చేసుకున్నారు.
బీసీలకు చట్టసభల్లో 54 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ హయాంలో దేశం అభివృద్ధి చెందుతున్నా, బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఉద్యోగాల్లో తగిన వాటా దక్కాలని కోరారు. కుల గణన జరగాలని, తెలంగాణలో జరుగుతున్న బీసీ సర్వే లోపభూయిష్టంగా ఉందని విమర్శిస్తూ ప్రధాని సమక్షంలో నిరసన తెలుపుతామని ఆయన హెచ్చరించారు.
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అల్మోరా జిల్లాలోని శిలాపానీ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. మరో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
అమెరికాకు 10 ఏళ్లపాటు వలసలు నిలిపివేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ సలహాదారు స్టీవ్ బానన్ అన్నారు. ఇమిగ్రేషన్ వ్యవస్థలో భారీగా అవినీతి పేరుకుపోయిందని వ్యాఖ్యానించారు. శరణార్థి, క్షమాభిక్ష, ఆశ్రయం కల్పించే కార్యక్రమాలు పూర్తిగా అవినీతిమయం అయ్యాయని విమర్శించారు.
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ఇప్పటికే చాలాసార్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదిర్చారంటూ భారతీయ మూలాలున్న రికీ గిల్ కు ట్రంప్ ప్రభుత్వం అవార్డు ఇచ్చి సత్కరించింది. డిస్టింగ్విష్డ్ యాక్షన్ అవార్డ్‌ను నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆయనకు అందించింది.
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కుమారుడు రేహాన్ వాద్రా త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తన చిరకాల స్నేహితురాలు అవీవా బేగ్‌తో రేహాన్ నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఏడేళ్లుగా స్నేహంలో ఉన్న ఈ జంట పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలపడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సందడి నెలకొంది.
హార్దిక్ పాండ్య టెస్ట్ క్రికెట్‌పై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడికి టెస్ట్ జట్టులో పునరాగమనం చేసే సత్తా ఉందని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ అదే జరిగితే ఆ ఆల్‌రౌండర్‌కు 7వ స్థానం సరిగ్గా సరిపోతుందన్నాడు.
ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం ది రాజాసాబ్ కొత్త ట్రైలర్ విడుదలైంది. మారుతి దర్శకత్వంలో హారర్ ఫాంటసీగా రూపొందిన ఈ సినిమా జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ట్రైలర్‌లోని విజువల్స్, ప్రభాస్ డైలాగ్స్ అభిమానుల్లో అంచనాలు పెంచుతున్నాయి. ఈ మూవీలో సంజయ్ దత్, నిధి అగర్వాల్ కీలక పాత్రల్లో నటించారు.