E-Paper
Advertisement

Top 20 News: కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత ఫైర్, నిర్మల్ జిల్లాలో విషాదం.. సర్పంచ్ అభ్యర్ధి సూసైడ్

Top 20 News: కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత ఫైర్, నిర్మల్ జిల్లాలో విషాదం.. సర్పంచ్ అభ్యర్ధి సూసైడ్

1. కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత ఫైర్

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి కిరికిరిరెడ్డిగా మారారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి కాకుండా కాళ్లలో కట్టెలు పెడుతున్నారని ఫైరయ్యారు. కేటీఆర్ మాట్లాడే చిట్టీలను చూసి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. రాష్ట్రానికి కిషన్ రెడ్డి తెచ్చింది ఏమైనా ఉందా..? అంటూ ప్రశ్నించారు.

2. అక్రమాస్తులపై ఏసీబీ సోదాలు

రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ అక్రమాస్తుల కేసులో భాగంగా.. మహబూబ్ నగర్ జిల్లాలోని శ్రీనివాస్ ఇళ్లు, బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఆస్తుల పత్రాలు, బంగారం, ఇతర కీలక డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. నారాయణపేట జిల్లా గూడబల్లూరులోని వసుధ రైస్ మిల్లును బినామీ పేరుతో శ్రీనివాస్ నడుపుతున్నట్లు అనుమానంతో, అక్కడ కూడా ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి.

3. కిడ్నాప్ కలకలం.. గురుకులం నుంచి పదో తరగతి అమ్మాయి..

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో కిడ్నాప్ కలకలం రేగింది. ఠాణేలంక గురుకుల పాఠశాల నుంచి పదో తరగతి బాలిక కిడ్నాప్ అయింది. మోకా గిరి అనే వ్యక్తి బాలికకు మాయమాటలు చెప్పిన గురుకులం నుంచి తీసుకెళ్లాడు. తన బంధువైన యువతి ద్వారా బాలికను ట్రాప్ చేసి హాస్టల్ నుండి బయటకు తీసుకువెళ్లాడు. వార్డెన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

4. నిర్మల్ జిల్లాలో విషాదం.. సర్పంచ్ అభ్యర్ధి సూసైడ్

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్వచింతల్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బండారి పుష్ప భర్త బండారి రవీందర్ తన ఇంటి సమీపంలోని కొట్టంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

5. దక్షిణాఫ్రికాలో యువకుడు మిస్సింగ్

శ్రీ సత్యసాయి జిల్లా, తలుపుల మండలం, కొవ్వూరు వాండ్లపల్లికి చెందిన రామచంద్ర అనే యువకుడు దక్షిణాఫ్రికాలో మిస్సింగ్ అయ్యాడు. నవంబర్ 23న రామచంద్రను నక్సల్స్ కిడ్నాప్ చేశారని కంపెనీ యాజమాన్యం కుటుంబ సభ్యులకు తెలిపింది. సరైన సమాచారం లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనలో చెందుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్పందించి, తమ బిడ్డ ఆచూకీ తెలుపాలని వేడుకుంటున్నారు.

6. కోడి తల, కాళ్లు కోసం.. చికెన్ షాపులో హల్‌చల్

బాపట్లలోని ఇమ్మడిశెట్టివారిపాలెంలో చికెన్ షాపులో మందుబాబుల హల్‌చల్ చేశారు. మరుప్రోలువారిపాలెం గ్రామానికి చెందిన దాసు అనే వ్యక్తి చికెన్ షాపు యజమాని గోపితో ఫోన్‌లో మాట్లాడి, కోడి తల, కాళ్లు కావాలని అడిగాడు. అయితే, షాపులో పనిచేసే కుర్రాడు చికెన్ ఇచ్చి, తల, కాళ్లు లేవని చెప్పడంతో దాసు ఆ కుర్రాడిని చితకబాదాడు. అంతేకాక, చికెన్ కొట్టే కత్తితో హల్‌చల్ చేసి భయభ్రాంతులకు గురిచేశాడు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు

7. మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు

హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్‌లోని శ్లోక స్కూల్లో బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసింది. BKR ఫౌండేషన్, మమత హాస్పిటల్ సౌజన్యంతో బిగ్‌టీవీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. స్థానికులకు ఉచిత వైద్యం అందించి, ఫ్రీగా మందులు పంపిణీ చేశారు. పేదలకు వైద్యం అందడమే ప్రధాన లక్ష్యంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశమన్నారు BKR ఫౌండేషన్ అధినేత కిషోర్ రెడ్డి.

8. ఊపందుకున్న పంచాయితీ ఎన్నికల ప్రచారం

నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయితీ ఎన్నికల ప్రచారం పర్వం ఊపందుకుంది. మొదటి విడత అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ప్రకటించారు అధికారులు. తొలి విడతలో 184 గ్రామ పంచాయితీల్లో 29 ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 155 సర్పంచ్ స్థానాలకు 466 మంది అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. వీటికి ఈనెల 11న పోలింగ్ జరగనుంది. రెండో విడత నామినేషన్ల పరిశీలన కూడా పూర్తి అయింది.

9. అమరావతిలో పనులను పరిశీలించిన మంత్రి

నారా లోకేశ్ అమరావతిలో తన నివాస భవన నిర్మాణ పనులను పరిశీలించారు. తమ మూడు తరాల ఇల్లు ఇప్పుడు ప్రజా రాజధాని అమరావతిలోనే ఉందని తెలిపారు. బలమైన పునాది, పంచుకున్న విలువలతో పురోగతి మొదలవుతుందని పేర్కొన్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి ప్రజా రాజధానిగా అభివృద్ధి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.

10. విద్యార్థినిపై అసభ్య ప్రవర్తన..టీచర్ సస్పెండ్

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగర్రు ప్రాథమికోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల స్కూల్ అసిస్టెంట్ తెలుగు టీచర్ రవికుమార్ అసభ్యంగా ప్రవర్తించాడు. నవంబర్ 21న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థినిపై చేయివేసి అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు రావడంతో, విచారణ అనంతరం రవికుమార్‌ను నవంబర్ 26వ తేదీన డీఈవో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

11. తప్పిన ప్రమాదం.. కంటైనర్ లారీ, స్కూల్ బస్సు ఢీ

ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ హోటల్ సమీపంలో స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కంటైనర్ లారీ సడెన్ బ్రేక్ వేయడంతో వెనకాల ఉన్న స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆటో అడ్డురావడంతో లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్‌ వేయాల్సి వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భారీ వాహనం వెళ్తున్నప్పుడు కనీస దూరం పాటించకపోవడం వల్లే స్కూల్ బస్సు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది.

12. జాతీయ రహదారి.. పనులు వేగవంతం

సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతం అయ్యాయి. మియాపూర్ నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు చేపట్టిన ముంబాయి జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. రహదారిని వంద అడుగుల వరకు విస్తరిస్తున్నారు.

13. ఎన్నికలను రద్దు చేయాలంటూ గ్రామస్థులు డిమాండ్

జగిత్యాల జిల్లా యామాపూర్ గ్రామ సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక వివాదాస్పదమైంది. గ్రామాభివృద్ధి కమిటీ ఒప్పందం ప్రకారం 4 లక్షలు చెల్లించిన కనుక నగేష్ ఏకగ్రీవ అభ్యర్థిగా ఎంపికయ్యారు. నామినేషన్ ఉపసంహరించుకున్న ఎలాల గోపాల్ రెడ్డికి 2 లక్షలు చెల్లించడంపై మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్థులు ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మెట్‌పల్లి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీఓ, డీఎస్పీలకు ఫిర్యాదు చేశారు.

14. రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీతో కలిసి 2.90 కోట్లతో జీ.కన్వెన్షన్ నుంచి వలసపాకల వరకు నిర్మించనున్న రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పుతో పాలన అప్పగించినా, కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి పనులు చేస్తుందని అన్నారు నానాజీ. ఈ రోడ్డు నిర్మాణం వలన నగరంలో వాహనాల రద్దీ తగ్గుతుందని తెలిపారు.

15. క్షమాపణలు చెప్పిన సింగర్

ఎంకోనె పాటపై సింగర్ చిన్మయి శ్రీపాద క్షమాపణలు చెప్పారు. స్వరకర్త ఘిబ్రాన్ కార్యాలయం నుంచి పిలుపు రావడంతో పాడానని, రికార్డింగ్ సమయంలో పాట నేపథ్యం గురించి తనకు తెలియదని తెలిపారు. పాటలోని భావజాలం తన సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధమని, ముందే తెలిసి ఉంటే ఈ సహకారం అందించేదాన్ని కాదని ఆమె స్పష్టం చేశారు. దీనికి దర్శకుడు మోహన్.జి స్పందించారు. తమతో మాట్లాడకుండానే చిన్మయి వ్యాఖ్యలు చేయటం ఆశ్చర్యంగా ఉందని, దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని లేదా ట్వీట్‌ను తొల‌గించాల‌ని ఆయన కోరారు.

16. ఢిల్లీలో వాయు కాలుష్యంపై సోనియా గాంధీ ఆందోళన

ఢిల్లీలో వాయు కాలుష్యంపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాల నిరసనలో ఆమె, మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. మాస్కులు ధరించి, చర్యలపై దృష్టి పెట్టాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కాలుష్యంతో పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని, వృద్ధులు అవస్థలు పడుతున్నారని, ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

17. భారత్‌లో పుతిన్.. భద్రత కట్టుదిట్టం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు భారత్‌కు చేరుకోనున్నారు. ఆయన పర్యటన కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. అయితే మన దేశంలో ఉన్నా పుతిన్‌ చుట్టూ రష్యా భద్రతా సిబ్బంది ఎప్పుడూ మోహరించి ఉంటారు. పటిష్ఠ రక్షణ వలయాన్ని వారు ఏర్పాటు చేస్తారు.

19. గర్వంగా ఉంది

చిత్ర పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు గర్వంగా ఉందని తెలిపారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ. ఆయన, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ 2 తాండవం సినిమా ప్రమోషన్‌లో భాగంగా చెన్నైలో మాట్లాడారు. మద్రాస్‌ నాకు జన్మభూమి అయితే, తెలంగాణ కర్మభూమి. ఆంధ్రప్రదేశ్‌ నా ఆత్మభూమి అన్నారు.

20. రూమర్లను పట్టించుకోను

నటుడు జాకీ భగ్నానీ దివాలా తీశారంటూ వచ్చిన వార్తలను నటి రకుల్ ప్రీత్ సింగ్ ఖండించారు. జాకీ కంపెనీ మూసివేయలేదని, అయితే నిర్మాతగా అతని మూడు సినిమాలు ఆదరణ పొందకపోవడంతో ఆర్థికంగా నష్టపోయారన్నది వాస్తవమేనని రకుల్ స్పష్టం చేశారు. ఈ నష్టాలు పరిశ్రమలో సహజమని, ఇది ఎదుగుదలలో ఒక భాగమని పేర్కొన్నారు. రూమర్లను పట్టించుకోలేదని తెలిపారు రకుల్ ప్రీత్ సింగ్.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×