GHMCలో కొత్తగా మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ మల్కాజ్‌గిరి, గ్రేటర్ సైబరాబాద్ పేరుతో మూడు కార్పొరేషన్లు దాదాపు ఖరారు అయ్యాయి. లీగల్ ఇష్యూస్ వస్తాయన్న కారణంతో ఈ పాలకమండలి ముగిసాక స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
వికారాబాద్ జిల్లా తాండూరులో దొంగలు హల్‌చల్ చేశారు. జానకిరామ్ నగర్‌లో వాహనాల నుంచి పెట్రోల్ దొంగిలించడమే కాకుండా.. షాపులు, ఇళ్లలో ఏసీ కాపర్ పైపులను ముసుగులు ధరించి ఎత్తుకెళ్తున్నారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
సిద్దిపేట జిల్లా నాచారం సమీపంలో దారుణం జరిగింది. రోడ్డు పక్కన మంతూర్ కల్పన అనే మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. శరీరంపై గాయాలు ఉండటంతో, ఆమెను ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడవేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.
కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది అన్నా-చెల్లెళ్ల గట్టు సమీపంలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. జేసీబీ సహాయంతో.. సముద్రంలో మునిగిన జీప్‌తో పాటు, మృతుడు శ్రీధర్ డెడ్‌బాడీని బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గాలిపటం మాంజా తగిలి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. చెన్నూర్ మండలం గంగారాం గ్రామానికి చెందిన మధుకర్ అనే వ్యక్తి బైక్‌పై వెళుతుండగా.. ఓవర్ బ్రిడ్జి వద్ద చైనా మాంజా తగిలి అతడి పెదవికి తీవ్ర గాయమైంది. సంబంధిత అధికారులు షాపుల్లో సరైన తనిఖీలు చేపట్టక పోవడంతోనే ఇలాంటి ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు ఉన్నత పాఠశాలలో విద్యార్థులు 2026 నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. ఇంఛార్జి హెడ్‌మాస్టర్ మద్దిలేటి ఆధ్వర్యంలో విద్యార్థులు “బాయ్ బాయ్ 2025.. వెల్‌కమ్ 2026” అంటూ నిర్వహించిన మానవహారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐక్యత, క్రమశిక్షణను చాటిచెప్పిన ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. బ్రీత్ అనలైజర్ పరీక్షకు నిరాకరిస్తూ పోలీసులతో గొడవకు దిగాడు. అధికారులు ఎంత నచ్చజెప్పినా వినకుండా వాగ్వాదానికి దిగడంతో పోలీసులు కఠినంగా వ్యవహరించారు. నిబంధనలను అతిక్రమించినందుకు అతని వాహనాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేశారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో పెద్దపులి సంచారం తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. రేన్యతండాలో పులి ఆనవాళ్లను అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో కొత్తగూడ అటవీ సమీప గ్రామస్తులను అధికారులు అప్రమత్తం చేశారు. పశువుల కాపరులు అడవుల్లోకి వెళ్లవద్దని సూచించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు జడ్పీహెచ్‌ఎస్ ప్రిన్సిపల్ తీపిరెడ్డి గోపాల్ రెడ్డి పదవీ విరమణ వేడుక ఘనంగా జరిగింది. 40 ఏళ్ల సుదీర్ఘ సేవలు ముగించుకుంటున్న ఆయనను శిష్యులు కారులో కూర్చోబెట్టి, ఆ వాహనాన్ని తాళ్లతో లాగుతూ సభా వేదిక వరకు తీసుకువచ్చి తమ గౌరవాన్ని చాటుకున్నారు.
దువ్వాడ మాధురి, అప్పన్న ఆడియో కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. తన భర్త కనిపించడం లేదంటూ.. శ్రీకాకుళం ఎస్పీకి అప్పన్న భార్య ఫిర్యాదు చేశారు. సోమవారం నుంచి అప్పన్న కనిపించడం లేదని కంప్లయింట్‌లో చెప్పారు. ఎవరో ఇద్దరు వచ్చి తీసుకెళ్లారని ఎస్పీకి తెలిపారు.
ప్రకాశం జిల్లా అద్దంకిలో సైబర్ మోసం వెలుగుచూసింది. హవాలా కేసు పేరుతో రిటైర్డ్ ఉద్యోగి నాగేశ్వరరావును.. సైబర్ నేరగాళ్లు పది రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేశారు. బాధితుడి ఖాతా నుంచి ఏకంగా కోటి 23 లక్షలు కాజేశారు. చివరకు ఇల్లు కూడా అమ్మాలని ఒత్తిడి చేయడంతో అనుమానం వచ్చిన నాగేశ్వరరావు అద్దంకి పోలీసులను ఆశ్రయించారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి కిస్మత్పూర్‌లో గంజాయి మొక్కల సాగు కలకలం రేపింది. కిస్మత్పూర్ నిర్మానుష ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా ఓ యువకుడు గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకొని.. అతని వద్ద నుంచి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.
జగిత్యాల పట్టణంలో ప్రైవేట్ చిట్టీల వ్యాపారి హత్య కేసు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ మహిళలు, కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తహసీల్దార్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు.
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల వేళ డ్రగ్స్ కట్టడికి ఈగల్ ఫోర్స్ ప్రత్యేక తనీఖీలు చేపట్టింది. ఎక్సైజ్, పోలీసు విభాగాలతో కలిసి ఈగల్ ఫోర్స్ మూడు కమిషనరేట్ల పరిధిలోని పబ్‌లు, రిసార్ట్‌లలో మెరుపు దాడులు నిర్వహించింది. పబ్‌లలో 51 మందికి పరీక్షలు నిర్వహించగా.. నలుగురు డీజేలు డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారణ అయ్యింది.
నిజామాబాద్ సెంట్రల్ జైల్‌లో గంజాయి దొరకడం సంచలనంగా మారింది. నలుగురు ఖైదీలు గంజాయి తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. జైలు లోపలికి గంజాయి ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేపట్టారు. రాత్రివేళల్లో జైలు గోడపై నుంచి గంజాయి ప్యాకెట్స్ విసిరేస్తున్నట్టు అనుమానిస్తున్నారు.
నూతన సంవత్సవ వేడుకల్లో గ్రీటింగ్ కార్డుల గ్రేస్ తగ్గిపోతోంది. డిజిటల్ యుగంలో నూతన సంవత్సర శుభాకాంక్షల శైలి పూర్తిగా మారిపోయింది. న్యూ ఇయర్ అంటే ఒకప్పుడు గ్రీటింగ్ కార్డుల సందడి మాములుగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు అక్షరం నుంచి ఎమోజీ వరకు మొబైల్‌లో ఒక్క క్లిక్‌తో విషెస్ తెలుపుతున్నారు.
సిగరేట్, పాన్ మసాలాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇటీవల పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలపై 40శాతం అదన పు జీఎస్టీ విధించింది. అయితే పెంచిన జీఎస్టీ ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
నూతన సంవత్సరం వేళ స్విట్జర్లాండ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ స్కీ రిసార్ట్ నగరం క్రాన్స్ మోంటానాలో గల ఓ బార్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
కొత్త ఆశలు.. అంచనాలతో సినీ తారలందరూ 2026కు స్వాగతం పలికారు. ఈ న్యూ ఇయర్‌కు పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెబుతూ గిఫ్ట్ ఇచ్చారు. ఆయన హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా రానున్నట్లు నిర్మాత రామ్ తాళ్లూరి అధికారికంగా తెలిపారు. జైత్ర రామ్ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమా రానున్నట్లు పోస్టు పెట్టారు.
భారత మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ దేవాలయాన్ని సందర్శించారు. నూతన సంవత్సరం సందర్భంగా తన సహచరులైన షెఫాలీ వర్మ, రేణుకాసింగ్ ఠాకూర్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, అరుధంతిరెడ్డి తదితరులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే భస్మ హారతికి హాజరయ్యారు.