E-Paper
Advertisement

Top 20 News: అందుకే మూసీ ప్రక్షాళన చేపడుతున్నాం.. సీఎం రేవంత్, వివాహం జరగాల్సిన ఇంట్లో విషాదం..

Top 20 News: అందుకే మూసీ ప్రక్షాళన చేపడుతున్నాం.. సీఎం రేవంత్, వివాహం జరగాల్సిన ఇంట్లో విషాదం..

1. అందుకే మూసీ ప్రక్షాళన చేపడుతున్నాం.. సీఎం రేవంత్

హైదరాబాద్ మురుగు నీటి వల్ల నల్గొండ ప్రజలు అంగవైకల్యం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితిని మార్చడానికే మూసీ ప్రక్షాళన చేపడుతున్నామన్నారు. 2026 మార్చి నుంచి తొలి దశలో గండిపేట – బాపూఘాట్ మధ్య 21 కి.మీ. మేర అభివృద్ధి పనులు మొదలవుతాయని, దీనికోసం ADB నుండి 4,100 కోట్లు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.

2. రోడ్డు పరిశీలన.. మంత్రి నారాయణ

అమరావతిలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన 1.5 కి.మీ. సీడ్ యాక్సిస్ రోడ్డును మంత్రి నారాయణ పరిశీలించారు. విజయవాడ-అమరావతి మధ్య ప్రయాణ దూరం తగ్గించేలా గుంటూరు ఛానల్‌పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జిని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే కరకట్టతో పనిలేకుండా రాజధానికి రాకపోకలు సులభతరం కానున్నాయి.

3. ప్రభుత్వ సేవలు నేరుగా రైతు ఇంటికే

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం అక్కయ్యవలసలో మంత్రి అచ్చెన్నాయుడు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. గత ప్రభుత్వ రీ-సర్వే తప్పులను ఏడాదిలోగా సరిచేసి, రాజముద్రతో కూడిన పారదర్శక పుస్తకాలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నారా లోకేష్ ప్రవేశపెట్టిన ‘వాట్సాప్ గవర్నెన్స్’ ద్వారా ప్రభుత్వ సేవలు నేరుగా రైతుల ఇంటికే చేరుతాయని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.

4. పారదర్శక చర్యలు వివరించాలి.. ఎమ్మెల్సీ

తెలంగాణ శాసన మండలిలో గృహ జ్యోతి పథకం అమలుపై ఎమ్మెల్సీ విజయశాంతి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది మహిళలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతోంది, దీని కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు ఎంత అని నిలదీశారు. అర్హులైన వారందరికీ పథకం సక్రమంగా వర్తించేలా ప్రభుత్వం తీసుకుంటున్న పారదర్శక చర్యలను వివరించాలని ఆమె కోరారు.

5. జోగి బ్రదర్స్.. పోలీసుల కస్టడీ

ములకలచెరువు నకిలీ మద్యం కేసులో మాజీమంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాములను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈనెల 4 వరకు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో విచారణ జరగనుంది. ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం సిట్ అధికారులు కూడా వారిని ప్రశ్నించే అవకాశం ఉంది.

6. వివాహం జరగాల్సిన ఇంట్లో విషాదం..

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన గోషిక యశ్వంత్ అమెరికాలో గుండెపోటుతో మృతి చెందాడు. మరో నెల రోజుల్లో యశ్వంత్‌కు వివాహం జరగాల్సి ఉండగా.. ఇంట్లో విషాదం నెలకొంది. యశ్వంత్ మృతదేహం స్వగ్రామానికి చేరుకోగా, నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

7. ల్యాబ్ టెక్నీషియన్ సూసైడ్

నిజామాబాద్‌లోని సాయి అశ్విని ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మాబాద్‌కు చెందిన ఓంకార్ గత ఆరేళ్లుగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

8. మహిళా ప్రయాణికులపై బూతులతో రెచ్చిపోయిన RTC కండెక్టర్

హయత్‌నగర్ డిపోకు చెందిన కండక్టర్ ప్రశాంత్ మహిళా ప్రయాణికులపై బూతులతో విరుచుకుపడటంతో ఆర్టీసీ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. బాధితులు వీడియో తీసి ఫిర్యాదు చేయడంతో స్పందించిన డిపో మేనేజర్ శ్రీనివాసరావు, అతడిని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలిచ్చారు. ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.

9. హనుమాన్ విగ్రహం అదృశ్యం..

జగిత్యాల జిల్లా వెల్లుల్లలో హనుమాన్ విగ్రహం అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. కొందరు వ్యక్తులు అధికారులతో కలిసి విగ్రహాన్ని తొలగించి పొదల్లో పడేశారని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. వెంటనే విగ్రహాన్ని పునఃప్రతిష్టించకపోతే జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

10. భారీ పేలుడు

ఖమ్మం బుర్హన్‌పురం పరిధిలోని ఓ ఇంట్లో గ్యాస్ లీకేజీ కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రైవేట్ టీచర్లుగా పనిచేస్తున్న భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ఇంటి సామాగ్రితో పాటు పొరుగు ఇళ్ల కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. స్థానికులు, ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.

11. రిలయన్స్ మార్ట్‌లో ఓ దొంగ హల్‌చల్

తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రిలయన్స్ మార్ట్‌లో ఓ దొంగ హల్‌చల్ చేశాడు. కిరాణా సెక్షన్‌లో పప్పులు, పండ్లు తింటూ ఎంజాయ్ చేసిన నిందితుడు, సెకండ్ ఫ్లోర్‌లోని మొబైల్ బాక్సులను ధ్వంసం చేసి ఫోన్లను ఎత్తుకెళ్లాడు. క్యాష్ కౌంటర్ తెరిచేందుకు కూడా ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

12. గంజాయి విక్రేతలను రోడ్డుపై నడిపిస్తూ..

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో గంజాయి విక్రేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పట్టుబడిన నలుగురు విక్రేతలను రోడ్డుపై నడిపిస్తూ పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సేవించే మరో 12 మందికి తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసుల ఈ కఠిన చర్యలపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

13. గౌతమి స్కూల్ బస్సు ఢీకొని ఐదేళ్ల బాలుడు మృతి

బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం ఎన్ఎక్స్‌ఎల్ టెక్స్‌టైల్స్ ప్రాంగణంలో విషాదం నెలకొంది. గౌతమి స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఐదేళ్ల బాలుడు ఓంకార్ అక్కడికక్కడే మరణించాడు. దుకాణంలో తినుబండారాలు కొని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కళ్లముందే కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

14. శ్రీవారి క్యూలైన్ మార్గంలో వ్యక్తి హల్‌చల్

తిరుమల శ్రీవారి క్యూలైన్ మార్గంలో ఓ మతిస్థిమితం లేని వ్యక్తి కలకలం రేపాడు. సిగరెట్ కావాలని సిబ్బందితో గొడవకు దిగడమే కాకుండా, తానే దేవుడినంటూ భక్తులను శపిస్తానని భయపెట్టాడు. అరగంట పాటు సాగిన ఈ హంగామాతో భక్తులు ఆందోళన చెందారు. చివరకు భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

15. పోలీసుల నిఘా

గుంటూరు జిల్లా ఉండవల్లిలో సుజుకి యాక్సెస్ వాహనాలే లక్ష్యంగా బైక్ డిక్కీలను ధ్వంసం చేస్తున్న ఘటనలపై తాడేపల్లి పోలీసులు స్పందించారు. సీఏం, మంత్రుల నివాసాలున్న అత్యంత కీలక ప్రాంతం కావడంతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశామని తెలిపారు.

16. 112వ మేయర్‌గా ప్రమాణ స్వీకారం..

భారతీయ మూలాలున్న జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ నగర 112వ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాసియావాసిగా, తొలి ముస్లింగా ఆయన రికార్డు సృష్టించారు. ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడైన మమ్దానీ, రెండు ఖురాన్ ప్రతులపై ప్రమాణం చేశారు. నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.

17. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం

టీఎంసీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సీఎం మమతా బెనర్జీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మా, మాతి, మనుష్ లక్ష్యంగా సామాన్య ప్రజల కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏ దుష్ట శక్తుల ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని, ప్రజల ఆశీర్వాదాలే తమ పార్టీకి శ్రీరామరక్ష అని ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు.

18. ప్రభుత్వం కృషి

కృత్రిమ మేధ (AI) ఒక గొప్ప అవకాశమని, దీని ప్రయోజనాలు అట్టడుగు వర్గాలకు అందాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ఏఐ ద్వారా ఉపాధి, ఉత్పాదకత పెరుగుతాయని పేర్కొన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఏఐపై అవగాహన కల్పించి, వారిని సాంకేతిక నాయకులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.

19. రికార్డుకు చేరువలో.. కోహ్లీ

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 2026లో మూడు అరుదైన మైలురాళ్లకు చేరువలో ఉన్నాడు. ఐపీఎల్‌లో మరో 319 పరుగులు చేస్తే 9,000 రన్స్ పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా నిలుస్తాడు. వన్డేల్లో మరో 443 పరుగులు సాధిస్తే 15,000 క్లబ్‌లోకి చేరతాడు. అలాగే, అంతర్జాతీయ క్రికెట్‌లో మరో 42 పరుగులు చేస్తే సంగక్కరను అధిగమించి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంటాడు.

20. సత్తాను చాటుతోంది..

మాతృత్వం తన జీవితాన్ని మార్చివేసిందని బాలీవుడ్ నటి అలియా భట్ పేర్కొన్నారు. కుమార్తె రాహా బాధ్యతల దృష్ట్యా ప్రస్తుతం ఒకేసారి పలు సినిమాలు చేయకుండా, ఎంచుకున్న పాత్రపైనే దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. తల్లి అయిన తర్వాత ఆల్ఫా వంటి చిత్రాల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం తన శరీర సత్తాను చాటుతోందన్నారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×