ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఐనవోలు మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిని సాదరంగా ఆహ్వానం అందించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ విధ్వంసకర ఆలోచనలు చేసే వ్యక్తి అని, మాటలు మార్చడంలో ఆయనకు ఆయనే సాటి అని విమర్శించారు. జగన్ ఎప్పుడూ మాట తప్పుతూనే ఉంటారని, మడమ తిప్పుతూనే ఉంటారని ఎద్దేవా చేశారు.
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కృషి ఫలించింది. లోక్ సభలో తెలంగాణలో జూట్ సాగుపై వేసిన ప్రశ్నకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. పార్లమెంట్ టెక్స్‌టైల్స్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు ఆయన. ఈ నేపథ్యంలో జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు హైదరాబాద్‌కు చేరుకుని ఎంపీతో చర్చలు జరిపారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు. తెలంగాణను కాపాడుకోవడానికి మాత్రమే అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారన్నారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వకుండా ఆపుతానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారన్నది అవాస్తవం అన్నారు సోము వీర్రాజు.
నంద్యాల జిల్లా మిడ్తూరు మండలం పీర్‌సాహెబ్‌పేటలో నిర్వహించిన ఎన్‌ఆర్‌జీఎస్ గ్రామసభ ఉద్రిక్తంగా మారింది. ఏపీవో నాగమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ఫీల్డ్ అసిస్టెంట్ గైర్హాజరుపై సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి, ఉపసర్పంచ్ విష్ణు అధికారులను ప్రశ్నించారు. ఈ క్రమంలో పాత సమస్యల ప్రస్తావన రావడంతో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పనుల్లో అవకతవకలు లేవని ఒక వర్గం వాదించగా, హాజరు శాతంపై మరో వర్గం అభ్యంతరం తెలిపింది. పరిస్థితి విషమించడంతో ఎస్సై ఓబులేసు జోక్యం చేసుకుని సర్దిచెప్పగా, గంటలోనే సభ ముగిసింది.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇటుక బట్టీలకు బూడిద రవాణా చేస్తున్న లారీలను స్థానిక డ్రైవర్లు, యజమానులు అడ్డుకున్నారు. బూడిద లోడింగ్ విషయంలో నెలకొన్న వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య గొడవ జరగడంతో, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
అనంతపురం జిల్లా గుంతకల్లులో మహిళా ఉపాధ్యాయురాలిపై జరిగిన దాడిని నిరసిస్తూ ప్రైవేట్ పాఠశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ పిలుపు మేరకు విద్యాసంస్థలు బంద్ పాటించాయి. విద్యార్థినిని మందలించినందుకు ఆగ్రహించిన తల్లిదండ్రులు టీచర్‌పై విచక్షణారహితంగా దాడి చేయడాన్ని యాజమాన్యాలు ఖండించాయి. గాంధీ విగ్రహం నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ దొంగతనం జరిగింది. అనంతపురం జిల్లా గడేకల్ గ్రామానికి చెందిన ఒక రైతు, తన క్రాప్ లోన్ చెల్లించేందుకు 5 లక్షల రూపాయలతో ఆదోని వచ్చాడు. నగదు తక్కువ కావడంతో రిలయన్స్ ట్రెండ్ వద్ద ఉన్న వైన్ షాప్‌లో తెలిసిన వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకురావడానికి లోపలికి వెళ్లాడు. అదే అదనుగా భావించిన దుండగులు, కారు అద్దాలు పగలగొట్టి లోపల ఉన్న నగదు బ్యాగుతో పరారయ్యారు.
విజయనగరం జిల్లా రాజాం మండలం బుచ్చంపేటలో స్మశాన వాటిక కబ్జా యత్నం ఉద్రిక్తతకు దారితీసింది. సర్వే నంబర్ 70/2లోని 2.70 ఎకరాల రుద్రభూమిని అక్రమార్కులు రెవెన్యూ అధికారుల అండతో వేరొకరి పేరున రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా సచివాలయం ఎదుట ధర్నా చేపట్టారు. గతంలోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయత్నాలను అడ్డుకున్నామని, ఇప్పుడు మళ్లీ కబ్జాకు చూస్తే సహించబోమని హెచ్చరించారు.
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులు పట్టుకున్నారు. ఏలూరు నుంచి కాకినాడకు టాటా వింట్రా వాహనంలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న 4.5 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ మాఫియాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కఠిన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి ఈ దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో వాహనాన్ని సీజ్ చేసి, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
కర్నూలు జిల్లా కందనాతిలో పాత కక్షలు భగ్గుమన్నాయి. వేటకొడవళ్లతో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. పొలం పనులు చేసుకుని వస్తుండగా కాపుకాచి.. వెంకటేష్, పరమేష్‌లను హతమార్చారు నిందితులు. ఈ ఘర్షణల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తాళ్ల ఊకల్లులో విషాదం చోటుచేసుకుంది. భార్య పుట్టింటి నుంచి తిరిగి రావడం లేదన్న వేదనతో కళ్ళం నవీన్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎనిమిది నెలల క్రితమే వివాహమైన ఈ జంట మధ్య ఇటీవల మనస్పర్థలు రావడంతో భార్య మానస పుట్టింటికి వెళ్లిపోయింది. ఎంత ప్రయత్నించినా ఆమె తిరిగి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవీన్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
నెల్లూరు జిల్లా దగదర్తి టీడీపీలో ఆధిపత్య పోరు భగ్గుమంది. ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి అనుచరుడు కడియాల సురేష్‌పై టీడీపీ నేత మాలేపాటి సుధాకర్ నాయుడు వర్గీయులు దాడి చేశారు. దాడిలో కడియాల సురేష్‌తో అతని తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. కత్తులు, కర్రలతో ఇంటిపై దాడి చేయడంతో ఇంట్లోని ఫర్నీచర్, సామాగ్రి ధ్వంసమయ్యాయి.
బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పులపాలైన వ్యక్తి కరెంట్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాకు చెందిన రాంబాబు.. బెట్టింగ్ యాప్స్ వల్ల దాదాపు 80 లక్షల వరకు నష్టపోయాడు. అప్పు ఇచ్చిన వాళ్ల బాధ తట్టుకోలేకపోతున్నానని, తనకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. రాంబాబును కిందకు రప్పించిన పోలీసులు కౌన్సెలింగ్‌కు తరలించారు.
రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని తిరుపతి కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు వైసీపీ ఇన్‌చార్జ్ భూమన అభినయ్ రెడ్డి. ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమకు అన్యాయం చేసిన చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని ఆరోపించారు. ఈ క్రమంలో భూమన అభినయ్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. తిరుచానూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
జగిత్యాల జిల్లా అంబారిపేటలో బెల్ట్ షాపుల నిషేధం వివాదానికి దారితీసింది. గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం జనవరి 1 నుంచి బెల్ట్ షాపులను నిషేధిస్తూ తీర్మానం చేయడంతో, కిరాణా షాపు యజమానులు దుకాణాలు మూసివేసి నిరసన తెలిపారు. దీనిపై స్పందించిన పాలకవర్గం వారితో చర్చలు జరిపింది. రేపటి నుండి షాపులు తెరవకపోతే ప్రస్తుత ట్రేడ్ లైసెన్సులను రద్దు చేసి, కొత్తవారికి అవకాశం కల్పిస్తామని అధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లేడీ సింగంగా సోషల్ మీడియాలో వైరలైన తమిళనాడులోని ఐపీఎస్ అధికారిణి ఇషా సింగ్‌పై బదిలీ వేటు పడింది. ఇషా సింగ్‌ను పుదుచ్చేరి నుంచి దిల్లీకి బదిలీ చేస్తూ.. అక్కడి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌తో వివాదం వేళ.. ఆమెపై ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం.
స్థానికులు, ఉద్యోగులకు దుబాయ్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. నకిలీ వర్క్ వీసా స్కామ్‌లో పడొద్దని హెచ్చరించారు. తప్పుడు ఉద్యోగ ఆఫర్లు, చట్టవ్యతిరేక వీసా హామీలతో స్కామర్లు బురిడీ కొట్టిస్తున్నారని అడ్వైజరీలో పేర్కొన్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది. అధికారిక మార్గాలు, ప్రభుత్వ లైసెన్స్ పొందిన నియామక సంస్థల ద్వారా ఉద్యోగ ఆఫర్లను ధ్రువీకరించుకోవాలని సూచించారు.
తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి వల్ల హిందువులపై వరుస దాడులు జరుగుతున్నాయి. దీంతో ఐపీఎల్‌లో ఆ దేశానికి చెందిన ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఆటగాడిని రిలీజ్ చేయమని బీసీసీఐ.. కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీని ఆదేశించింది. ఐపీఎల్ మినీ వేలం 2026లో ముస్తాఫిజుర్‌ను రూ.9.20 కోట్ల భారీ ధరకు దక్కించుకున్న కేకేఆర్.. బీసీసీఐ ఆదేశాలతో అతన్ని రిలీజ్ చేసింది.
మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదక కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినమా ట్రైలర్‌ను జనవరి 7న సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.