ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రసిద్ధ శైవ క్షేత్రం సోమనాథ్ ఆలయాన్ని.. సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. ఓంకార మంత్ర జపంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో భక్తులు సోమనాథ్ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సోమనాథ్ తీరంలో ఏర్పాటు చేసిన అద్భుతమైన డ్రోన్ షోను ఆయన వీక్షించారు.
పిఠాపురంలో పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు రెండో రోజు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా వివిధ జిల్లాల కళారూపాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పాల్గొని ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఒకటిన్నర ఏళ్ల కాలంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి సుమారు 500 కోట్లు రూపాయలు వెచ్చించడం అభినందనీయమన్నారు.
అయోధ్యలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే రామజన్మభూమి ఆలయ ప్రాంగణంలో అసాధారణ ఘటన చోటుచేసుకుంది. భద్రతా వలయాన్ని దాటుకుని లోపలికి ప్రవేశించిన ఒక యువకుడు నమాజ్ చేయడానికి ప్రయత్నించడం స్థానికంగా, భద్రతా వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
భారత అంతరిక్ష రంగంలో 2026 సంవత్సరం సరికొత్త విజయంతో ప్రారంభం కాబోతోంది. దేశ రక్షణ రంగానికి కన్నుగా నిలిచే EOS-N1 ఉపగ్రహాన్ని ఇస్రో కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.ఇవాళ ఉదయం కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. రేపు ఉదయం 10 గంటల 17 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారితో హైదరాబాద్-విజయవాడ హైవే రద్దీగా మారింది. ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఉదయం నుంచీ వెహికిల్స్ క్యూ కట్టాయి. భారీ ట్రాఫిక్‌తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణను శీతల గాలులు వణికిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు పడిపోవడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రానున్న మూడు రోజులు చలి తీవ్రత కొనసాగుతుందని.. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలో వివేకానంద జయంతి, సంక్రాంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ హాజరయ్యారు. భారతదేశం సాంప్రదాయాలకు నిలయమని పేర్కొన్న మంత్రి.. మన పండుగల గొప్పదనాన్ని భావితరాలకు అందించేలా వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కోర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద సంక్రాంతి సందడి మొదలైంది. పండుగ సెలవులు ప్రారంభం కావడంతో పట్నం వాసులంతా పల్లె బాట పట్టారు. దీనితో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా టోల్ సిబ్బంది విజయవాడ వైపు ఏడు గేట్లు, హైదరాబాద్ వైపు ఆరు గేట్లను తెరిచి ఉంచి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో ఇండియన్ ఆర్మీ కోసం హైదరాబాద్ స్టూడెంట్స్ ప్రత్యేక డ్రోన్ తయారు చేశారు. ‘డ్రోన్‌కి ఆహుతి’గా నామకరణం చేశారు. బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న జయంతి ఖత్రి, శౌర్య చౌదరి డ్రోన్ రూపొందించారు. కేవలం 13 మంది సభ్యులతో కూడిన తమ బృందంతో కలిసి.. వీరు ఈ అత్యున్నత సాంకేతికత కలిగిన డ్రోన్‌ను తయ్యారు చేశారు.
ఓ ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారు. బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెంలో ఘటన చోటుచేసుకుంది. బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించారు. గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి అర్ధరాత్రి ఇంటి ముందు తన కొత్త పల్సర్ బైక్‌ను పార్క్ చేయగా…గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి భార్యను చంపిన కేసులో శిక్ష అనుభవిస్తున్న షేక్ సైదులు అనే ఖైదీ పరారయ్యాడు. బాపట్ల జిల్లాకు చెందిన ఇతడు.. జైలులోని ఓపెన్ ఎయిర్ విభాగంలో వ్యవసాయ పనులు చేస్తూ తప్పించుకున్నాడు. ఖైదీల గణన సమయంలో ఇతడు లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు.. వెంటనే వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
విశాఖపట్నం నగరం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు వెళ్లడానికి దాదాపు 4,500 రూపాయల వరకు ఖర్చవుతుందని.. అంత మొత్తంతో విజయవాడకు విమానంలో వెళ్లి రావచ్చని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. విశాఖ వంటి మహా నగరానికి రెండు ఎయిర్‌పోర్టుల అవసరం ఉందని.. అందుకే ఇంటర్నేషనల్, డొమెస్టిక్ విమానాశ్రయాలు రెండింటినీ అందుబాటులో ఉంచాలని ఆయన అసెంబ్లీలో కోరారు. ప్రయాణికుల సౌకర్యార్థం అదనంగా పది రైళ్లను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
నంద్యాల జిల్లా తూర్పు ప్రాతకోటలోని గంగా–పార్వతి నాగేశ్వర స్వామి ఆలయంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా ఇక్కడ ఉత్సవాలు మొదలుకావడంతో భక్తుల సందడి నెలకొంది. స్వామివారిని పెళ్లికొడుకుగా అలంకరించి, పన్నెండు శిరస్సుల నాగేంద్ర స్వామి వాహనంపై శోభాయాత్రను నిర్వహించారు.
పోలవరం జిల్లా రంపచోడవరం పరిధిలోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంత గిరిజన మహిళలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆధ్వర్యంలో సరళ్ కార్యక్రమం నిర్వహించారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ సహకారంతో మారేడుమిల్లి యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో 15 రోజుల పాటు జరిగిన టైలరింగ్ శిక్షణలో 119 మంది మహిళలు పాల్గొన్నారు. శిక్షణా ముగింపు సందర్భంగా ప్రతిభ కనబరిచిన 30 మందికి కుట్టు మెషీన్లను పంపిణీ చేశారు.
అమెరికాలోని మిసిసిపి రాష్ట్రంలో కాల్పులు కలకలం రేపాయి. క్లే కౌంటీలో జరిగిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మూడు వేర్వేరు ప్రదేశాల్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఒడిశా రాష్ట్రం రాయఘడులోని అశోక టాకీస్‌లో రాజాసాబ్ సినిమా ప్రదర్శన సమయంలో పెను ప్రమాదం తప్పింది. థియేటర్‌లో ప్రభాస్ ఎంట్రీ సీన్ సందర్భంగా అభిమానులు హారతి ఇచ్చే క్రమంలో.. మండుతున్న హారతి ప్లేట్ కింద పడిపోయింది. అప్పటికే అక్కడ వెదజల్లిన కాగితపు ముక్కలకు మంటలు అంటుకోని ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెను ముప్పు తప్పింది.
స్వదేశీని, స్వభాషను ప్రోత్సహించేందుకు ప్రజలు స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని, మాతృభాషలోనే సంభాషించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సమాజాన్ని, సంస్కృతిని, మతాన్ని పరిరక్షించేందుకు భాషే కీలకమని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఎదుగుదల సాధించేందుకు ఏ భాషనైనా నేర్చుకోవచ్చని, ఇంట్లో పిల్లలతో మాట్లాడటానికి హిందీ, స్థానిక భాషలు వాడాలని చెప్పారు.
వెనెజువెలాలో రష్యా, చైనాల ఉనికిని తాము ఏమాత్రం సహించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. వెనెజువెలా నేత మదురో మాదిరిగానే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కూడా భవిష్యత్తులో బంధించేందుకు అమెరికా సైనిక చర్యలకు దిగుతుందా? అని విలేకరులు ప్రశ్నించగా ఎన్నో ఏళ్లుగా తనకు పుతిన్‌తో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని తెలిపారు. పుతిన్‌ను బంధించేందుకు లేదా రష్యాపై సైనిక చర్యలకు దిగే ఆలోచన తనకు లేదని తేల్చి చెప్పారు.
హెచ్-1బీ, ఎల్-1 వంటి వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను 2,805 డాలర్ల నుంచి 2,965 డాలర్లకు అమెరికా పెంచింది. మార్చి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. మిగతా వీసా కేటగిరీల ప్రాసెసింగ్ ఫీజుల్లోనూ మార్పులు చేసింది. ఈ మేరకు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. 2023 జూన్ నుంచి 2025 జూన్ మధ్య ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ ఫీజు పెంచినట్లు వెల్లడించింది.
న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత క్రికెటర్ రిషభ్ పంత్ దూరమైనట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బంతి తగలడంతో ఆయనకు బలమైన గాయమైంది. దీంతో ఆయన్ను సిరీస్ నుంచి తప్పించినట్లు సమాచారం. దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
ది రాజాసాబ్ సినిమాలోని కొత్త పాయింట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారన్నారు దర్శకుడు మారుతి. ఈ చిత్ర ఫలితాన్ని ఒక్క షోతోనో, ఒక్కరోజులోనో నిర్ణయించకూడదని.. పదిరోజులు ఆగితే ఈ సినిమా ఏంటో తెలుస్తుందని తెలిపారు. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఎపిసోడ్‌ను సినిమాలో కలుపుతున్నట్లు ప్రకటించారు.