ఢిల్లీలో జరిగిన US ఇండియా స్ట్రాటజిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ మౌలిక వసతులు, భద్రత కలిగిన హైదరాబాద్.. పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్యస్థానం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చైనా +1 మోడల్‌కు తెలంగాణే గ్లోబల్ సమాధానం అవుతుందని.. కొత్త నగర నిర్మాణం, మూసీ నది పునరుజ్జీవం, డ్రై పోర్ట్, మెట్రో విస్తరణ వంటి ఇన్‌ఫ్రా విప్లవ ప్రణాళికలను వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటాలియన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చూడాలని సీఎం చంద్రబాబు.. ఆ దేశ రాయబారి ఆంటోనియో ఎన్రికో బార్టోలీని కోరారు. విశాఖపట్నంలోని CII భాగస్వామ్య సదస్సు సందర్భంగా జరిగిన భేటీలో సీఎం చంద్రబాబు రిక్వెస్ట్ చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపణలకు ధీటుగా బదులిచ్చారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. తమ భూముల విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు పూర్తిగా సత్యదూరమైనవన్నారు. పవన్ కల్యాణ్ ఆరోపించినట్లుగా తాము భూములను ఆక్రమించలేదన్నారు.
మంత్రి కొండా సురేఖ, సినీ హీరో అక్కినేని నాగార్జున మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న వివాదం సుఖాంతమైంది. మంత్రి కొండా సురేఖ నిన్న బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో, హీరో నాగార్జున సానుకూలంగా స్పందించి, వివాదానికి తెరదించారు.
వివేకా హత్య కేసుపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. లోతైన దర్యాప్తు కోరుతూ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై ఆమె తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించారు. కుట్ర కోణంపై సీబీఐ పూర్తి విచారణ జరపలేదని.. సప్లిమెంటరీ ఛార్జిషీటు దాఖలు చేయాలని ఆయన కోరారు. తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది.
విజయవాడ తాడేపల్లిలోని ఆలయాన్ని అధికారులు కూల్చివేశారు. నోటీసులు ఇవ్వకుండా కాళికామాత టెంపుల్‌ను నేలమట్టం చేశారని ధర్మకర్తలు మండిపడుతున్నారు. ఆర్ అండ్ బీ స్థలం కావడంతోనే కూల్చివేసినట్లు తెలుస్తుంది. అయితే ప్రశ్నించిన తమపై దాడి చేశారని.. ఫోన్లు లాక్కున్నారని ధర్మకర్తలు ఆరోపిస్తున్నారు.
వరంగల్‌లో మోడల్ బస్టాండ్ నిర్మాణ జాప్యంపై బీజేపీ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. సెల్లార్ కోసం తవ్విన గుంతలో వర్షపు నీరు నిలిచి చెరువులా మారడంతో, నాయకులు అందులో తెప్పలపై ప్రయాణించి నిరసన వ్యక్తం చేశారు. నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం చింతలమ్మ గాటి వద్ద జాతీయ రహదారిపై భారీ కొండచరియలు, బండరాళ్లు విరిగిపడ్డాయి. దీనివల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొయ్యూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రహదారిని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెత్తపల్లి జిల్లాలోని మంథని డ్రీమ్ స్టార్ట్ కార్యాలయంలో టీ వర్క్స్ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు మైండ్ సెట్ మేకర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జూనియర్ కళాశాలలో టెన్నిస్ కోర్టును కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలసి ప్రారంభించారు.
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట నూజివీడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలీ ట్రాక్టర్, ఒక కారు.. ఆటోని ఢీకొట్టడంతో పక్కనే ఉన్న చెరువు వాగులో ఆటో పడింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో ఆటోల్లో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు బయటపడ్డారు. కొండపర్వ గ్రామం వద్ద ఉన్న చందన వాల్యూ వెంచర్లో నడుపుతున్న ట్రాలీ ట్రాక్టర్ ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ను స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకి అప్పగించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇటీవల రిలీజైన “కిష్కందపురి” సినిమా సక్సెస్ కావడంతో స్వామివారికి మొక్కులు తీసుకున్నారు. స్వామివారి ముక్కు తీర్చుకోవడం పట్ల తనకు చాలా సంతోషంగా ఉందని సాయి శ్రీనివాస్ అన్నారు. ఆలయ అధికారులు సాయి శ్రీనివాస్‌ను సత్కరించి స్వామివారి చిత్రపటం బహుకరించారు.
సిద్దిపేట కలెక్టరేట్‌లో జరిగిన దిశా సమావేశంలో పాల్గొన్నారు ఎంపీ రఘునందన్ రావు. తను గెలిచి 18 నెలలైనా పంచాయతీరాజ్, ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు నత్తనడకన సాగుతున్నాయని ఎంపీ మండిపడ్డారు. జిల్లాకు కేంద్ర నిధులు రావడం లేదని.. మల్లన్నసాగర్ కాలువల పూర్తి చేయకపోవడం, ఫ్లైఓవర్ పనులు ఆలస్యం కావడంపై నిలదీశారు. గజ్వేల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అవినీతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏపీ డీజీపీ కార్యాలయంలో సుధా మాధవి అనే మహిళ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్‌తో పాటు మరికొందరు పోలీసులపై ఫిర్యాదు చేశారు. పోలీసులు తనను నిర్బంధించి బలవంతంగా వీడియో రికార్డు చేశారని, డీఐజీ ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించారని ఆమె ఆరోపించారు. తమ కుటుంబానికి అండగా నిలవాలని మాధవి, మంత్రి లోకేష్, పవన్ కల్యాణ్‌లను కోరారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో, కలెక్టర్ జితేష్ పాటిల్ చొరవతో జై శ్రీరామ్ నామంతో కూడిన ఇటుకలను భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. కొత్త నిర్మాణాల శంకుస్థాపనలలో ఉపయోగించేందుకు ఈ పవిత్రమైన ఇటుకలు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకోనున్నాయి. వీటిని భక్తులు కొనుగోలు చేసుకోవచ్చు.
ఎర్రకోట పేలుళ్ల కేసులో ప్రధాన నిందితురాలైన డాక్టర్ షహీన్ సయీద్ గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈమె పాకిస్థాన్ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ మహిళా విభాగానికి హెడ్‌గా పనిచేసినట్టు గుర్తించారు. ఈ ముఠా పేలుళ్లకు ఏకంగా 32 కార్లను సిద్ధం చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక 400కి పైగా నమోదవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితికి మాస్కులు కూడా సరిపోవని వ్యాఖ్యానించింది. కాలుష్య తీవ్రత కారణంగా సీనియర్ న్యాయవాదులు భౌతికంగా కాకుండా వర్చువల్‌గా విచారణకు హాజరుకావాలని జస్టిస్ పీఎస్ నరసింహ సూచించారు.
సంగీత ప్రియులకు గుడ్‌న్యూస్! స్పాటిఫై నుంచి ఇష్టమైన పాటలు, ఆల్బమ్‌లు, పాడ్‌కాస్ట్‌లను ఇకపై నేరుగా వాట్సాప్ స్టేటస్‌కు షేర్ చేసుకోవచ్చు. స్పాటిఫై యాప్‌లో షేర్ బటన్‌ను ఉపయోగించి ఒకే ట్యాప్‌తో స్టేటస్‌లో ట్రాక్‌ను పోస్ట్ చేయవచ్చు, దీనిని కాంటాక్ట్‌లు నేరుగా వినే అవకాశం కలగనుంది.
రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాతగా ప్రకటించిన #తలైవర్173 నుంచి దర్శకుడు సుందర్ ఊహించని విధంగా తప్పుకున్నారు. అనుకోని పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. సుందర్ స్థానంలో కొత్త దర్శకుడు ఎవరనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
వన్డేల్లో కొనసాగాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ సూచించిన నేపథ్యంలో.. రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉంటారనే వార్తలను ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారి తోసిపుచ్చారు. రోహిత్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని తెలిపారు. ఇటీవల ఆసీస్‌పై ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నారు రోహిత్ శర్మ.
బంగ్లాదేశ్ మరోసారి ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఢాకా సహా పలు ప్రాంతాల్లో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనా కేసుల విషయంలో ఈనెల 17న తీర్పు రానున్న నేపథ్యంలో ఆమె పార్టీ అవామీ లీగ్ రాజధాని ఢాకాలో లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చింది. ఆమెకు అనుకూలంగా నినాదాలు చేసింది.