కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు. ఆ పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. రైతులు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో ఎంత ప్రొడక్షన్ ఉంటే అంత పత్తి పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు రామచందర్ రావు.
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కల్వకుర్తి ఆసుపత్రిలో కనీసం ఏసీ సౌకర్యం కూడా లేదన్నారు. సౌకర్యాలు లేక రోగిని హైదరాబాద్‌కు తరలించే క్రమంలో ఒక నిండు ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. యాక్సిడెంట్లు జరిగినప్పుడు మెరుగైన వైద్యం అందడం లేదని మండిపడ్డారు కసిరెడ్డి.
ఏపీ నుంచి వెళ్లిన స్వాములతో.. కేరళ పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే రాజాసింగ్. శబరిమలలో ప్రతి ఏడాది ఏదో ఒక సమస్య తలెత్తుతుందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్వాముల పట్ల ప్రతి ఏడాది చులకన భావంతో చూస్తున్నారన్నారు. శబరిమలకు వెళ్లే తెలుగు వాళ్ల కోసం ఒక కోఆర్డినేటర్‌ని నియమించాలని తెలుగు రాష్ట్రాల సీఎంలను కోరారు ఎమ్మెల్యే రాజాసింగ్.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. కార్యాలయాల్లోని ఫైళ్లు, రికార్డులు, డిజిటల్ డేటాను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు, నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదులు నేపథ్యంలో తనిఖీలు చేసినట్లు వెల్లడించారు.
మేడ్చల్ జిల్లా ఔషాపూర్‌లో లోక కవి అందేశ్రీ సంతాప సభ ఘనంగా జరిగింది. ‘జయ జయ హే తెలంగాణ’ రాష్ట్ర గీతం కావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ, మంత్రులు, సినీ హీరో నారాయణ మూర్తి, కవులు ఆయన సేవలను కొనియాడారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్.
వికారాబాద్ జిల్లా పెద్దెముల్ గురుకుల పాఠశాల తాండూరు నుంచి ఇద్దరు విద్యార్థులు మిస్సయ్యారు. వినయ్ కుమార్, హర్షవర్ధన్ ఇద్దరు విద్యార్థులు ఉదయం 6 గంటలకు వసతి గృహం నుంచి వెళ్లిపోవడంతో తమ పిల్లల కోసం తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ, నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు.
BC రిజర్వేషన్లపై ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. బీసీ రిజర్వేషన్లు 42శాతం నుంచి 22కి తగ్గించడం మోసం అని ఎంపీ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు తొందరపడాల్సిన అవసరం లేదని అన్నారు. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా ఎన్నికలు నిర్వహించడం ప్రశ్నార్థకమని తెలిపారు.
బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై ఎంపీ ఆర్.కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు మంత్రి అడ్లూరి.
హైదరాబాద్ మెహిదీపట్నంలో రోడ్డు ప్రమాదం జరిగింది. PVNR ఎక్స్‌ప్రెస్ హైవే పిల్లర్ నంబర్ 40 వద్ద కారు ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్ నుండి మెహిదీపట్నం వైపు వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.
ధాన్యాన్ని కొనుగోలు చేసి 24 గంటల్లోనే డబ్బులు చెల్లించామన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. నెల్లూరు జిల్లా రేబాల రైతు భరోసా కేంద్రంలో నిర్వహించిన ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరి నారు నాటి, ఎరువులు పంపిణీ చేశారు.
ప్రభుత్వం రాజ్యాంగ బద్ధంగా పనిచేయడం లేదన్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. వెంకటరెడ్డి అక్రమ అరెస్టు, AVSO సతీష్ ఆత్మహత్య ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు. తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్తామన్నారు బొత్స.
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ధాన్యం సేకరణను పరిశీలించారు. దళారీ వ్యవస్థను రూపుమాపి, ధాన్యం విక్రయించిన 4 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామన్నారు మంత్రి మనోహర్.
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలోని మంచినీటి చెరువు సమీపంలో మున్సిపాలిటీ చెత్త వేయడాన్ని నిరసిస్తూ.. వీర భవాని ఆలయం వద్ద ఆందోళన చేపట్టారు స్థానికులు. డంపింగ్ యార్డ్ లేక ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయడంపై శ్రీహరిపేట వాసులు మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.
నెల్లూరు జిల్లా కృష్ణాపురంలో 10వ తరగతి విద్యార్థిని ప్రణీత సూసైడ్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులపై అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపించారు. నవోదయ విద్యాలయం వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యార్థిని మృతి పట్ల విచారణ చేయాలని డిమాండ్ చేసాయి సంఘాలు.
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. పులివెందుల ప్రజలను మభ్యపెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. మీ బతుకంతా గుండెపోటుతోనే బతుకుతున్నారని అన్నారు. వైఎస్ భారతీరెడ్డి 400 కిలోల బంగారం కొన్నది వాస్తవం అంటూ ఆరోపణలు గుప్పించారు ఆది నారాయణ రెడ్డి.
ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ AQI 400 పాయింట్లకు పైగా క్షీణించడంపై సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది. చాందినీ చౌక్, ఆనంద్ విహార్ వంటి ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో NCR పరిధిలోని పాఠశాలల్లో జరగాల్సిన క్రీడా పోటీలను వాయిదా వేయాలని CPCBని సుప్రీంకోర్టు ఆదేశించింది.
బిహార్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తదుపరి ముఖ్యమంత్రిగా నీతీశ్ కుమార్ ఖరారయ్యారు. ఈ మేరకు ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు.. తమ కూటమి నేతగా నీతీశ్‌ను ఎన్నుకున్నారు. మరోవైపు గురువారం పదోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీతీశ్ ప్రమాణం చేసే అవకాశం కనిపిస్తోంది.
కొన్నేళ్ల క్రితం నోట్ల మార్పిడి తరహాలో.. గుజరాత్‌లోని మెహసానా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ వద్ద జనాలు బారులు తీరారు. స్థానికులకు తక్కువ విలువ కలిగిన కరెన్సీ రూ.10 నోట్లు, నాణేలు కొరతను తీర్చడానికి ఆర్‌బీఐ ఆదేశాల మేరకు బ్యాంక్ శిబిరం నిర్వహించింది. దాదాపు 17 లక్షల విలువైన చిన్న కరెన్సీని జారీ చేయడంతో, స్థానికులు, వ్యాపారులు ఉదయం నుంచే లైన్లలో నిలబడ్డారు.
ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి నటనకు అధికారికంగా రిటైర్‌మెంట్ తీసుకోనున్నట్లు ప్రకటించారు సీనియర్ నటి తులసి. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ ద్వారా తెలిపారు. రిటైర్‌మెంట్ తర్వాత తన జీవితాన్ని షిరిడీ సాయిబాబా సేవకు అంకితం చేస్తానని, ప్రశాంతంగా ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తానని ఆమె ప్రకటించారు.
ప్రపంచ బాక్సింగ్ కప్‌లో భారత బాక్సర్ల హవా కొనసాగుతోంది. మహిళల 54 కేజీల సెమీఫైనల్లో ప్రీతి 4-0తో ప్రపంచ ఛాంపియన్ హంగ్ హిసావో చైనీస్ తైపీని కంగుతినిపించి తుది పోరుకు అర్హత సాధించింది.