దేశంలోనే అతిపెద్ద పౌరవిమానయాన సంస్థ ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతోంది. నిర్వహణపరమైన లోపాల కారణంగా హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబయిల్లోని విమానాశ్రయాల్లో ఇండిగో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. మొత్తం 550కి పైగా జాతీయ, అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ భగవద్గీతను బహుమతిగా ఇచ్చారు. గీత సారాంశం కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుందని మోడీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధం బలపడిందని ఆయన ప్రకటించారు.
తెలుగుదేశంలో వ్యక్తులు శాశ్వతం కాదు, పార్టీ శాశ్వతమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పాలకొండ నియోజకవర్గం భామిని కార్యకర్తలను ఉద్దేశించి లోకేష్ ప్రసంగించారు. అధికారంలోకి రావడానికి దశాబ్దాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా కష్టపడిన ప్రతి కార్యకర్త శ్రమ దాగి ఉందన్నారు.
హిడ్మాది బూటకపు ఎన్‌కౌంటర్ అని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరుతో ఓ లేఖను విడుదల చేసింది. హిడ్మాది పూర్తిగా బూటకపు ఎన్‌కౌంటర్ అని అనారోగ్యంతో ఉన్న హిడ్మా, శంకర్ చికిత్స కోసం విజయవాడకు వెళ్లారని తెలిపారు. ఏపీకి చెందిన కలప వ్యాపారులతో కలిసి వెళితే పట్టుకున్నారని… కొందరు కలప వ్యాపారుల ద్రోహం వల్లే వాళ్లు దొరికిపోయారంటూ లేఖలో పేర్కోంది మావోయిస్టు పార్టీ.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీని ప్రభావంతో నేడు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేటి నుంచి ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గి వాతావరణం చల్లబడనుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జనాలు జ్వరాలతో హాస్పిటల్ బాట పడుతున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా.. ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. మారుతున్న వెదర్‌తో వైరల్ ఫీవర్ల బారిన పడుతున్నారు. దీంతో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్‌కి ఓపీ పెరిగింది.
ఏపీలో ఇవాళ మెగా పేరెంట్-టీచర్స్ సమావేశం3.0 జరగనుంది. ఈ ప్రోగ్రామ్ నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 45వేల ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్స్, జూనియర్ కాలేజీల్లో మెగా పీటీఎం నిర్వహించనున్నారు. ఈ పీటీఎం 3.0 కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ హాజరవుతారు.
యాదాద్రి భువనగిరి జిల్లా దండమల్కాపురం వద్ద బజరంగ్ దళ్ కార్యకర్తలు 11 గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ తుని నుంచి హైదరాబాద్ కబేలాకు తరలిస్తున్న ఈ గోవులను పుష్ప సినిమా తరహాలో పచ్చిమిర్చి, కూరగాయల బస్తాల కింద దాచి తరలిస్తున్నారు. నిందితులను అరెస్టు చేసి, గోవులను గోశాలకు తరలించారు.
ప్రకాశం జిల్లాలోని పొదిలి పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామున భూ ప్రకంపనలు సంభవించాయి. పొదిలితో పాటు ఇస్లాంపేట, శ్రావణి ఎస్టేట్, బెస్తపాలెం ప్రాంతాల ప్రజలు ఈ ప్రకంపనలను గుర్తించారు. ఈ భూ ప్రకంపనలు సుమారు 2 నుంచి 5 సెకన్ల పాటు వచ్చినట్లు తెలుస్తోంది. పొదిలి, దర్శి, ముండ్లమూరు ప్రాంతాల్లో ఇటీవల తరచుగా భూ ప్రకంపనలు సంభవిస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు ప్రజలు.
చిత్తూరు జిల్లా ఆర్కేవిపేట వద్ద జాతీయ రహదారిపై ఆయిల్ ప్యాకెట్ల లారీ బోల్తా పడింది. ప్రమాదాన్ని చూస్తున్న గ్రామస్తులపై తిరుపతి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో రామలింగం మృతి చెందగా.. గిరిబాబు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
ఉపాధి కోసం దక్షిణాఫ్రికా దేశమైన మాలికి వెళ్లిన ఇద్దరు తెలుగు యువకులు కిడ్నాప్‌నకు గురయ్యారు. తెలంగాణ, ఏపీకి చెందిన యువకులను జేఎన్ఐఎం సంస్థకు చెందిన తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. యాదాద్రి జిల్లా బండసోమారం గ్రామానికి చెందిన నల్లమాస ప్రవీణ్, సత్యసాయి జిల్లా పొదరళ్లపల్లికి చెందిన రామచంద్ర గతేడాది హైదరాబాద్‌కు చెందిన ఓ బోర్‌వెల్ కంపెనీ పనిపై డ్రిల్లర్లుగా మాలి దేశంలోని కోబ్రి సమీపంలో పనిచేస్తున్నారు. గత నెల 23న వారు పని ముగించుకొని వస్తుండగా సాయుధులైన జేఎన్ఎంఐ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు.
అనంతపురం జిల్లా ఎల్లుట్ల గ్రామంలో నాగలింగం అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం GGHకు తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంలో సీసీటీవీ ఫుటేజీ బయటపడింది. వేగంగా వెళ్తున్న కంటైనర్‌ను ఓ కారు వెంబడించి, అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆ కారు అడ్డు రావడంతో కంటైనర్ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయగా, వెనుక నుంచి వచ్చిన షిఫ్ట్ కారు బలంగా ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు విద్యార్థుల్లో ఐదుగురు స్పాట్ డెడ్ అయ్యారు. కంటైనర్‌ను ఆపిన కారు ఆర్టీవో అధికారులదేనా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బద్వేల్ మున్సిపాలిటీ మడకలవారిపల్లె రెవెన్యూలో అక్రమ లే-అవుట్‌లో కాంపౌండ్ గోడను మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, టీపీబీఓ నరసయ్య తొలగించారు. ఈ లే-అవుట్‌లో ఇప్పటివరకు దరఖాస్తులు నమోదు కాకపోవడంతో ఈ చర్య తీసుకున్నారు. బద్వేల్‌లోని 16 అనధికార లే-అవుట్ యజమానులు జనవరి 23 లోపు LRS-2020 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
ఏపీలో స్క్రబ్ టైఫస్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యాధితో మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది. విజయనగరం, పల్నాడు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో ఈ మరణాలు నమోదయ్యాయి. ఈ చిన్న కీటకం ద్వారా వ్యాపించే వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
భారత్‌ను ప్రపంచం గ్లోబల్ పవర్‌గా చూస్తోందన్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ప్రధాని మోడీ ఇతర శక్తుల ఒత్తిడికి తలొగ్గే వ్యక్తి కాదని అభిప్రాయపడ్డారు. పరోక్షంగా అమెరికా విధించిన సుంకాలను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు చేరుకున్న ఆయన ‘ఇండియా టుడే’కు ఎక్స్‌క్లూజివ్‌గా ఇంటర్వ్యూ ఇచ్చారు.
కిస్థాన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆదేశ ఆర్మీ అధిపతిగా పనిచేసిన ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ కు మరో ఉన్నత పదవి కట్టబెట్టింది. పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ గా ఆసిమ్ మునీర్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాక్ అధ్యక్ష కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.
పాన్‌మసాలా వంటి డీమెరిట్ ఉత్పత్తులపై తప్ప, నిత్యావసరాలపై ఆరోగ్య- జాతీయ భద్రత సెస్సు విధించబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో స్పష్టం చేశారు. ఈ సెస్సు ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకుంటామని, ఇది ఆరోగ్య పథకాలపై ఖర్చు చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. పాన్‌మసాలా తయారీ కర్మాగారాల్లోని యంత్రాల సామర్థ్యంపై ఈ సెస్సు విధిస్తామని ఆమె వివరించారు.
కథానాయకుడు చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారు చిత్రంతో సంక్రాంతి బరిలో అలరించనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో, నయనతార జంటగా నటిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 8న విడుదల కానున్న రెండో పాట శశిరేఖ.. మెలోడీ గీతానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం, అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. దీని ప్రోమో డిసెంబర్ 6న విడుదల కానుంది.
ఆరంభంలోనే కొన్ని షాట్లు ఆడగలిగితే ఓపెనింగ్ అయినా.. మిడిలార్డర్ అయినా పెద్ద తేడా కనిపించదన్నారు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్. దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో నాలుగో స్థానంలో వచ్చి సెంచరీ సాధించిన నేపథ్యంలో అతడిలా అన్నాడు. మేనేజ్‌మెంట్ మద్దతు ఇవ్వడంతో నాలుగో స్థానంలో దిగి రాణించగలిగా అని అన్నాడు.