దేవుడు వరమిచ్చినా పూజరి కరుణించలేదట…! మధ్యలో ఈ పూజారి గవర్నర్ గిరీ అడ్డుతగులుడే అందరినీ విస్తుగొలుపుతున్న విషయం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. విజయ్‌ను మానసికంగా ఆడుకుంటూ.. తమ బాస్‌లకు మానసికంగా రంజింపజేస్తూ.. తను మానసికంగా ఆనందిస్తూ.. మానసిక రోగమేదో తమకుందనే మెసేజ్ దేశానికిస్తూ.. అలా అలా కొనసా…గుతున్నాయి తమిళనాట రాజకీయాలు. కొత్త పార్టీ పెట్టాడు. అతి తక్కువ సమయంలోనే తన సత్తా చాటాడు. ప్రభుత్వం ఏర్పాటుకు ఓ పది సీట్లు మాత్రమే తగ్గినయి.. ఇక్కడే నెంబర్ గేమ్ అంటూ డ్రామాకు తెర తీశాడు గవర్నర్.
గవర్నర్ ఉద్దేశ్యం.. వెనుకుండి ఆడిస్తున్న ఆ ఇద్దరి బలప్రదర్శన.. అంతా విజయ్ గమనంలో ఉన్నాయి. అందుకే పదే పదే పదుల సార్లు అన్నట్టుగా గవర్నర్ దగ్గరికి వెళ్తున్నాడు.. ప్రభుత్వ ఏర్పాటుకు పర్మిషన్ అడుగుతున్నాడు. తమిళనాడులో వచ్చిన ఎన్నికల ఫలితాలు నిజానికి హంగు కాని హంగు లాంటిది. కేవలం పది సీట్లతోనే విజయ్ వెనుకంజలో ఉన్నాడు సీఎం సీటును అధిష్టించేందుకు. అందులో కాంగ్రెస్ మేజర్ షేర్‌గా ఐదుగురు సభ్యలను ఇచ్చేందుకు ముందే రెడీ అయ్యింది.
ఇదింకా కడపుమంటనే రేపింది గవర్నర్‌కు, మోడీ, అమిత్ షాలకు. అందుకే తిప్పి తిప్పి సతాయించి.. ఈ మధ్యలో ఇంకేమైనా చెడగొట్టే చాన్సుంటే వెతికి వెతికి వేసారి పోతున్నది కేంద్రం. గవర్నర్ కూడా నవ్విపోదురు నాకేటి సిగ్గు అని.. గవర్నర్ జాతికే అవమానం అని అంతా గగ్గోలు పెట్టినా నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తూనే ఉన్నాడు. చివరకు కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆ ఐదుగురు ఎమ్మెల్యే చరిత్ర చిట్టా విప్పేందుకు రెడీ అయ్యింది కేంద్రం. ఎక్కడన్నా దొరుకుతారా? ఈడీ కేసుల బూచి చూపుదామా? ఏమైనా ఎర వేసి ఆశ చూపి లాక్కుందామా? రాహుల్‌ను దెబ్బకొడదామా? తమతో జట్టుకట్టని విజయ్‌కు బుద్ది చెబుదామా? పాపం ఎన్ని దారులు వెతుకుతున్నారో.. ఎంత తండ్లాడుతున్నారో.. ప్రజాస్వామ్యం.. రాజ్యాంగం.. ఇవన్నీ డోంట్ కేర్.
తామేమి చేసినా అంతా దేశం కోసం.. ధర్మం కోసం అని నమ్మే బుద్ది జీవుల సంఖ్య పెరుగుతూ వస్తుంటే ఇక కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్నది కేంద్రం అనే ఆరోపణలు చుట్టు ముడుతున్నా డోంట్ కేరే అంటున్నారు. కానీ ఇక్కడ రోజు రోజుకు విజయ్‌పై మరింత సానుభూతి పెరుగుతూ వస్తోంది. అసలే కొత్త రాజకీయాలకు. మరి ఇంతటి బలమైన రెండు ప్రాంతీయ పార్టీలను కాదని…తాను తొలిసారే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వాస్తవానికి విజయ్‌కు అన్ని సీట్లు వస్తాయని ఎవరూ ఊహించలేదు. విజయ్ కూడా ఊహించాడో లేదో.. తెలంగాణలో కూడా కాంగ్రెస్ అదే విధంగాఅనూహ్యంగా పుంజుకున్నది. కానీ ఇక్కడ హంగ్ రాలేదు. స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ వచ్చింది. ఏ కొన్ని సీట్లు తక్కువ బడ్డా ఇక్కడా అదే సీన్ రిపీట్ అయ్యేదేమో. అయితే కొత్తగా వచ్చిన విజయ్‌పై మాత్రం రాజకీయంగా అనుభవం లేకున్నా.. తట్టుకుంటున్నాడు.. నెట్టుకొస్తున్నాడు.. అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.
అదే సమయంలో.. బీజేపీ చేష్టలకు, గవర్నర్ ఎగతాళికి మండిపడుతున్నారు. తిట్టిపోస్తున్నారు. దుమ్మెత్తి పోస్తున్నారు. అన్ని వర్గాలు పార్టీలతకతీతంగా విజయ్‌కు సంఘీభావం దొరుకుతున్నది. ఇదీ ఒకందుకు విజయ్ మంచికే. అతనికి వెల్లువలా సానుభూతి దొరుకుతున్నది. కానీ ఇక్కడ వీసీకే పార్టీ తిరుమాళవవ్ చేసిన చేష్టలే కొంచెం జుగుప్సాకరంగా ఉన్నాయి. రాజకీయంగా మరీ అనైతిక లేదని తమిళననాట కొంచెం మెచ్చుకోలు మాటలు వినిపిస్తున్న వేళ.. కింగ్ మేకర్‌గా తనకు వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని భావించి తీసుకున్న యూటర్న్ విజయ్‌ను ఇబ్బంది పెట్టినా.. అతని రాజకీయ భవితవ్యానికి మరింత బలమైన బాటలే వేస్తున్నది. డిప్యూటీ సీఎం కావాలని, తన కుటుంబంలోప్రభుత్వ పదవులు కావాలని ఏవేవో కండిషన్లు పెడుతునన్నది వీసీకే పార్టీ. కానీ.. కొన్ని ఒప్పుకున్నారు.. మరికొన్ని ఒప్పుకోలేదు.
అంతిమంగా వీరి మధ్య రాజీ కుదరడం ఖాయం. విజయ్ సీఎం కావడమూ ఖాయం. ప్రమాణ స్వీకారం చేయడమూ ఖాయమే. విజయ్‌ను కాదని ఇంకే రాజకీయ సమీకరణ జరిగినా.. ఆ పార్టీలు అక్కడి తమిళ ప్రజల వద్ద తమకు తాము గోరీ కట్టుకున్నట్టు. భవిష్యత్తుకు గొడ్డలి పెట్టులాంటి నిర్ణయం తీసుకున్నట్టే. అందుకే స్టాలిన్ హుందాగా పెద్ద మనిషి పాత్రనే పోషిస్తున్నాడు. తను ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆరు నెలల టైమ్ ఇచ్చి అప్పుడు దాడి చేయాలని చూస్తున్నాడు తప్ప.. ఇప్పుడే అధికారం కోసం పాకులాడితే ఉన్న పరువు పోతుంది.. కష్టపడి కాపాడుకున్న పరపతి మట్టికొట్టుకుపోతుందని అతనికీ తెలుసు. కానీ ఇక్కడ నెత్తి నాది కాదు..కత్తీ నాది కాదు.. అని రాజకీయ క్రీడ ఆడుతున్న బీజేపీ నైతికత మీదే జనానికి ఉన్న కొద్ది పాటి విశ్వాసం పోతుంది. అంతే. అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి. డౌట్ లేదు.