Nasa : సూర్యుడు నవ్వడం ఎప్పుడైనా చూశారా? ఈ ప్రశ్న వేయగానే అవతలి నుంచి వచ్చే సమాధానం ఏంటో తెలుసా! ఏంటి తమాషాగా ఉందా? లేకపోతే ఆటపట్టిస్తున్నారా? అంటూ ఎవరైనా సరే విరుచుకుపడతారు. ఎందుకంటే సూర్యుడు మండుతున్న అగ్నిగోళం. కొన్ని క్షణాలు తీక్షణంగా సూర్యుడిని చూసి కళ్లు పక్కకు తిప్పుకోగానే అంతా చీకటిగా అనిపిస్తుంది. అలాంటిది సూర్యుడు నవ్వాడు.. ఏడ్చాడు అంటే అవతలి వాళ్లు చెప్పే సమాధానం ఇలాకాకుండా ఇంకెలా ఉంటుంది.
నిజాంగానే సూర్యుడు నవ్వాడు. కాదు కాదు… వికటాట్టహాసం చేశాడు. అది కూడా మొన్న దీపావళి అమావాస్య రోజు పాక్షిక సూర్యగ్రహణం తర్వాత కనిపించిందీ దృశ్యం. దీన్ని నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ-ఎస్.డి.ఓ ఉపగ్రహం చిత్రీకరించింది. ఈ ఫొటోను చూస్తే స్మైలీ గుర్తుకొస్తుంది. అది ఎలాంటిదంటే స్ఫూకీ స్మైలీ ఫేస్. అంటే భయంకరంగా నవ్వుతున్నట్లు ఉన్న స్మైలీ ముఖంలాగా అన్నమాట.
గ్రహణం వీడగానే ఈ దృశ్యం ఇలా ఎందుకు కనిపించింది. సూర్యుడు నిజంగానే నవ్వాడా? మన దేశంలో పాక్షిక సూర్యగ్రహణం కనిపించింది. అంటే చంద్రుడిని చూసి నవ్వాడా? ఇప్పుడు నెట్టింట్లో ఇలా ఎవరికి తోచింది వారు రాసేస్తున్నారనుకోండి. కానీ అసలు విషయానికి వస్తే… గుండ్రటి సూర్యుడి ముఖంపై రెండు కళ్లు, నోరులాగా కనిపిస్తున్నవి వాస్తవానికి అవి కోరోనల్ హోల్స్. వాటి నుంచి గాలి వేగంగా వాతావరణంలోకి దూసుకొస్తుంది. ఆ సందర్భంగా ఆల్ట్రావైలెట్ రేస్ అంటే అతినీల లోహిత కిరణాల్లో నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ-ఎస్.డి.ఓ. ఉపగ్రహం అక్టోబర్ 26న ఈ ఫొటో తీసింది. అందులో సూర్యుడు ఇలా కనిపించాడు. ఈ ఫొటోతోపాటు సే ఛీజ్ అనే క్యాప్షన్ తో నాసా సన్, స్పేస్ అండ్ స్క్రీమ్ అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా దీన్ని పోస్ట్ చేసింది.